నేర్చుకోవాలన్న తపన ఉండాలే గానీ... | devotional informaiton | Sakshi
Sakshi News home page

నేర్చుకోవాలన్న తపన ఉండాలే గానీ...

Jan 21 2018 12:53 AM | Updated on Jan 21 2018 12:53 AM

devotional informaiton - Sakshi

అద్వైత సంప్రదాయంలో దత్తాత్రేయ స్వామి జగద్గురువు. ఆయన ప్రకృతిలో ఇరవై నాలుగింటిని గురువులుగా స్వీకరించారు. అవి–పృథ్వి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశం, సముద్రం, ఏనుగు, సూర్యుడు, చంద్రుడు, బాలుడు, మిడత, పావురం, భ్రమరం, మధుక్షిక, కన్య, లేడి, సర్పం, కొండచిలువ, భృంగి, వేశ్య, చేప, బాణాలు తయారు చేసేవాడు, పక్షి, సాలెపురుగు.

పామును గురువుగా స్వీకరించడానికి కారణం–పాము ఇల్లుకట్టుకోదు. చీమలు పెట్టిన పుట్టలో పడుకుంటుంది. సన్యాసి తనంత తాను ఆశ్రమాలు, శాఖలు పెట్టే ప్రయత్నాలు చేయకూడదు. వైరాగ్యంతో ఉంటే చాలు. పాము చీమలపుట్టలో ఉన్నట్లు, ఈశ్వరుడు ఇచ్చిన పర్వత గుహలలో ఉండి సన్యాసి అయిన వాడు బతకవచ్చు తప్ప నివాస స్థానాలు కోరాల్సిన అవసరం లేదన్న విషయాన్ని పాముని చూసి నేర్చుకున్నాను కాబట్టి ఇది నాకు గురువు–అన్నారు.

పింగళ అనే వేశ్య విటులను ఆకర్షించడానికి రాత్రంతా వీథుల్లో నిల్చుంది. తెల్లవార బోతున్నా ఎవ్వరూ రాలేదు. ఆమె ఇంట్లోకి వెళ్ళి ‘ఇన్ని గంటలు వృథాగా నిలబడ్డాను, అదే పరమేశ్వరుడిమీద ధ్యాసపెట్టి నిలబడితే ఏమవుదునో’ అన్న వైరాగ్యంతో ఆర్తి చెందిన కారణానికి స్వర్గలోకానికి చేరుకుంది. భగవదార్తిలో పింగళ నాకు గురువు–అన్నారు.కన్యను కూడా గురువుగా స్వీకరించారు. పెళ్ళివారొచ్చే సమయానికి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. వారికేదయినా చేసి పెట్టాలని ఆ కన్య బియ్యం రోట్లోపోసి దంచుతున్నది. చేతికున్న గాజుల శబ్దం వినిపిస్తున్నది.

అతిథులు–ఇంట్లో బియ్యపు పిండికూడా లేదనుకుంటారేమోనని, చప్పుడు రాకుండా ఉండడానికి చేతులకున్న రెండేసిగాజుల్లో ఒక్కొక్క గాజు తీసి పక్కనబెట్టి బియ్యం దంచి దానితో వారికి ఫలాహారం చేసిపెట్టింది. అంటే ‘చేతికి రెండు గాజులుంటే ధ్వనులొస్తాయి. ఇద్దరు కూడితే అక్కర్లేని మాటలొస్తాయి. మౌనంలోనే శాంతి, ఒక్కడు ఉండడంలోనే గొప్ప ఉందని నేను ఈ కన్య నుండి నేర్చుకున్నాను కనుక ఈ కన్యను నేను గురువుగా స్వీకరిస్తున్నా’ అన్నారు.

వర్షాకాలంలో నదులన్నీ సముద్రంలో చేరినా సముద్రం పొంగదు. ఎండాకాలంలో నదులు ఎండిపోతాయి. దానికి తోడు సముద్రంలోని నీటిని కూడా సూర్యుడు పీల్చేస్తుంటాడు. అయినా ఇంకదు. పొంగూ కుంగూ లేకుండా ఎప్పుడూ ఒక్కలాగే ఉండే సముద్రం నాకు గురువన్నారాయన. కురారి అనే పక్షి మాంసం ముక్క పట్టుకుని ఆకాశంలో ఎగురుతోంది.

అది చూసి చాలా పక్షులు దాని వెంట పడ్డాయి. అది మాంసాన్ని కిందపడేసింది. పక్షులన్నీ అటు వెళ్ళిపోయాయి. ‘దగ్గర ఏదయినా ఉంటేనే కదా ఈ అల్లరి. ఏదీ లేకపోతే అంతా ప్రశాంతం’ అని ఈ పక్షిని చూసి నేర్చుకున్నా. కాబట్టి ఇది నాకు గురువు అన్నారు. అంతటా నిండి ఉన్న పరబ్రహ్మం గురువు. నేర్చుకోవాలన్న జిజ్ఞాస శిష్యుడిలో ఉన్నప్పుడు,  గురుస్థానాన్ని నింపడానికి ప్రతిదీ అర్హత పొందుతుందనేదే దత్తా్తత్రేయ తత్త్వం మనకు అందించే సూత్రం.


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement