పోస్టర్ మీద ఆయనకున్నంత ఆసక్తి, అభిలాష


మరి ఏ ఇతర నిర్మాతలోనూ కనిపించవు!

 

‘రాముడు భీముడు’ అఖండ విజయం తర్వాత విజయాధినేతలైన ‘నాగిరెడ్డి-చక్రపాణి’గార్లు రామానాయుడు గార్ని సంప్రదించి ఇతర భాషల్లో పునర్నిర్మాణానికి హక్కులు తీసుకున్నారు. ఆ సమయంలో ఏర్పడిన అనుబంధంతో 1967లో ‘విజయ సురేష్’ అనే ఉమ్మడి సంస్థను స్థాపించి ‘పాప కోసం’ సినిమా తీశారు. ఆ నిర్మాణ సమయంలోనే నాగిరెడ్డిగారి కుమారులైన ప్రసాద్, వేణుగోపాల్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, బాబ్జి గార్లతో నాయుడిగారికి సన్నిహిత సంబంధం ఏర్పడ్డం, అప్పటికే నేను విజయా సంస్థకు పోస్టర్లు చేస్తున్నందున నన్ను నాయుడుగార్కి పరిచయం చేసి ‘పాప కోసం’ చిత్రానికి కూడా పోస్టర్లు చేసే అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం నన్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది. ‘ప్రేమనగర్’తో అది సుస్థిరమైంది.



సురేష్ ప్రొడక్షన్స్‌లో నిర్మించిన సుమారు అన్ని చిత్రాల హీరోలకు నేను ‘విగ్’ స్కెచ్ వేసి ఇచ్చాను. ‘ప్రేమనగర్’లో ఏఎన్నార్‌తో ప్రారంభం అయ్యి, సెక్రటరీ, సోగ్గాడు, చిలిపి కృష్ణుడు, ప్రేమ మందిరం, వసంత మాళిగై, ముందడుగు, సావాసగాళ్లు మొదలగు అనేక చిత్రాల హీరోలకు నాయుడుగారు నా చేత స్కెచ్‌లు వేయిస్తేనే గాని మేకప్ చెయ్యనిచ్చేవారు కాదు. ‘ప్రేమనగర్’ హిందీ చిత్రంలో రాజేష్ ఖన్నాకు, ‘దిల్‌దార్’లో జితేంద్రకు ఇంకా అనేక హిందీ, తమిళ హీరోలకు హెయిర్ స్టైల్ ‘విగ్’ స్కెచ్‌లు నేను వేసి ఇచ్చినవే. నిజానికి ఈ పని కళాదర్శకుల పరిధిలోఉన్నా నా చేతనే వేయించేవారు.

 నాకున్న సుదీర్ఘ అనుభవంతో చూస్తే పోస్టర్ మీద ఆయనకున్నంత ఆసక్తి, ఆభిలాష, ఏకాగ్రత మరే ఇతర నిర్మాతలోనూ కనిపించదు. ఆయన ఊపిరి సినిమా, ఆయన శ్వాస సినిమా, ఆయన ధ్యాస సినిమా. ప్రేక్షకుణ్ణి మొదటిగా ఆకర్షించేది పోస్టరేనని నమ్మిన వ్యక్తి.

 నేను ఏదైనా ప్రొడక్షన్ ఆఫీసులో ఆయన్ను చూడ్డం జరిగితే... ‘‘ఎక్కడ చూసినా నువ్వే కనపడతావేమిటయ్యా?.. నువ్వు తప్ప ఈ మద్రాసులో ఇంకో ఆర్టిస్టే లేడా?’’ అని నవ్వుతూ అనేవారు. నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన ఆయన హస్తవాసి అలాంటిది.



‘పాప కోసం’తో ప్రారంభించి పరిశ్రమ హైదరాబాద్ తరలి వెళ్లే వరకు ఆయన నిర్మించిన చిత్రాల్లో 72 చిత్రాలకు డిజైన్లు చేసే అవకాశం నాకు నాయుడుగారిచ్చారు. పబ్లిసిటీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఆయన ప్రతి చిత్రానికి పని ప్రారంభించే ముందు నాకు ప్రొజెక్షన్ వేసి చూపిస్తూ నా పక్కనే కూర్చునేవారు. నా ఫీలింగ్స్‌ను పరిశీలిస్తుండేవారు. ఒకసారి ‘ప్రేమనగర్’ రష్ చూస్తున్నప్పుడు నేను సినిమాలో లీనమైపోయాను. ఎందుకో మధ్యలో రాజబాబు, రమాప్రభ, కె.వి. చలం కామెడీ అడ్డుపడ్డట్టు అనిపించి రష్ చూసి బయటకొస్తున్నప్పుడు ‘‘నాయుడుగారూ... మధ్యలో ఆ కామెడి అక్కడక్కడ అడ్డుపడుతున్నట్టు కనిపిస్తుందండీ’’ అని అన్నాను. దానికాయన ‘‘అమ్మమ్మ... అలాక్కాదు లేవయ్యా... కొంచెం మసాలా ఉండాలి’’ అన్నారు. ఆయనలో ఉన్న అపారమైన అనుభవ లోతులు అప్పుడే నాకు కనిపించాయి. రిలీజ్ అయ్యాక చూస్తే నిజంగా ఆ కామెడీయే ఆ సినిమాకి ‘రిలీఫ్’ అని పత్రికల్లో రివ్యూలు ఇచ్చాయి.



జెమిని, ఏవీయం, విజయా సంస్థల గత వైభవం స్ఫురణకు తెచ్చి ఆ అగ్ర సంస్థల స్థానాన్ని అంది పుచ్చుకుని చివరివరకూ ఎదురులేని నిర్మాతగా, స్టూడియో అధినేతగా ప్రకాశించారు. ఆ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు.

 - ఈశ్వర్, సీనియర్ పబ్లిసిటీ డిజైనర్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top