కులం మేడిపండు విప్పి చూపిన దాటు

కులం మేడిపండు విప్పి చూపిన దాటు


80 ఏళ్ల కింద కన్నడ గ్రామీణ జీవితంలో బలంగా పాతుకుపోయిన కుల వ్యవస్థలోని కుళ్లుని మన ముందు నిలబెట్టిన మూడు తరాల ఆలోచనే ఈ నవల.

 

‘బ్రాహ్మణత్వానికి రెండు నియమాలున్నాయి. ఆత్మజ్ఞానం, వేదం. వేదం అంటే జ్ఞానం. కనక ప్రతి ఆత్మకూ జ్ఞానం పొందే అధికారం- అంటే వేదాధ్యయన అధికారం ఉన్నది. అధికారం ఒకరిని అడిగి పుచ్చుకోవలసినది కాదు. చెలాయించవలసినది. మీరందరూ అధికారం చెలాయించండి. మీరందరూ బ్రాహ్మణులే’....తమ తమ కులాలని గొప్పవిగా గుర్తించాలంటూ ఊరి గుడి ముందు పోగయిన కుల పెద్దలతో ‘దాటు’ నవల ప్రధాన పాత్ర సత్యభామ చెప్పిన మాటలివి. దాటు- సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన కన్నడ నవల. రాసింది ఎస్.ఎల్.బైరప్ప. సినిమాలు తెలిసిన వారికి ‘వంశవృక్షం’ ద్వారా, సాహిత్య పరిచయం ఉన్నవారికి ‘పర్వ’ నవల ద్వారా బైరప్ప బాగా తెలిసిన రచయిత. ఆయన రచనలు తెలుగుకి అనువాదం అయ్యే ఆనవాయితీ ఉంది. ‘దాటు’ను పరిమి రామసింహం తెలుగులోకి తీసుకు వచ్చారు.80 ఏళ్ల కింద కన్నడ గ్రామీణ జీవితంలో బలంగా పాతుకుపోయిన కుల వ్యవస్థలోని కుళ్లుని మన ముందు నిలబెట్టిన మూడు తరాల ఆలోచనే ఈ నవల. ఒక్క కర్నాటకకే కాదు మొత్తం దేశంలో ఈ రోజుకు కూడా సమాజాన్ని వెనక్కు లాగుతున్న ఈ రుగ్మతకు అందులో ఉన్న అంతర్గత వైరుధ్యాలకి ఈ నవల ఒక నిలువుటద్దం.పూజారి వెంకట రమణయ్యగారి కూతురు సత్య. బాగా చదువుకోవడమే కాకుండా అభ్యుదయ భావాలు ఉండి కుల వ్యవస్థపై నమ్మకం లేని వ్యక్తి. ఉపమంత్రి, ఆలయ ధర్మకర్త అయిన మేలగిరి గౌడ కొడుకు శ్రీనివాసు, సత్య ప్రేమించుకుని పెళ్లికి సిద్ధపడతారు. ‘ఒక్కలింగ’ కులంలోకి బ్రాహ్మణుల పిల్ల కోడలుగా రావటం మంత్రిగారికి ఇబ్బందేమి లేదుగాని కాకపోతే ఈలోపు డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వేరే గౌడగారు పిల్లనిస్తామని వచ్చారు. వారి రాజకీయ బలంతో కేబినెట్ మంత్రిని కావచ్చుననే ముందుచూపుతో గౌడ తన భార్య అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని సత్య అన్న వెంకటేశం సహాయంతో పెళ్లి చెడగొడతాడు. జరిగిన సంఘటనలతో పాటు తనకి మాదిగ మాతంగితో ఉన్న పాత జ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేయటంతో పూజారి వెంకట రమణయ్య ఆత్మహత్య చేసుకుంటాడు. తన వాటాగా తండ్రి ఇచ్చిన పొలంలో అన్నకు దూరంగా సొంతంగా వ్యవసాయం చేసుకుంటుంది సత్య. మాదిగ ఎం.ఎల్.ఏ బెట్టయ్యగారి కొడుకు మోహన్‌దాసు, కూతురు మీరాలతో పరిచయం అవుతుంది. మోహన్‌దాసు దళితులు తిరగబడి, ఆయుధాలు తీసుకుంటేగాని సమాజంలో మార్పు రాదని నమ్మిన వ్యక్తి. ఇంతలో మంత్రిగారి కొడుకు శ్రీనివాసు భార్యను పోగొట్టుకుని చెడు అలవాట్ల పాలవుతాడు. తండ్రి ప్రోత్సాహంతో సత్యకు మళ్లీ దగ్గర అవడానికి ప్రయత్నిస్తాడు. సత్య తనకు పెళ్లి మీద నమ్మకం లేదని, మీరాను చేసుకోమని సూచిస్తుంది. శ్రీనివాసు నెమ్మదిగా మీరాకు దగ్గర అవుతాడు. బ్రాహ్మణ అమ్మాయి అయితే పర్వాలేదుగాని, ఈ మాదిగ అమ్మాయితో వ్యవహారం మంత్రిగారిని కలవరపెడుతుంది. మళ్లీ సత్య అన్న వెంకటేశం సహాయంతో శ్రీనివాసు మనసు చెడగొడతాడు. మీరా ఆత్మహత్య చేసుకుంటుంది. శ్రీనివాసుకి మతి చెడుతుంది. దళిత విప్లవంలో భాగంగా మోహన్‌దాసు మొదలుపెట్టిన ఆలయ ప్రవేశ కార్యక్రమం రసాభాసగా మారుతుంది. మోహన్‌దాసు బాంబులతో చెరువుగట్లను పేల్చివేయడంతో ఆ జలప్రళయంలో అంటరానితనానికి ప్రతీకగా నిల్చిన ఊరి గుడి కొట్టుకుపోవడంతో నవల ముగుస్తుంది.ఈ నవలలో పాత్రలన్నీ మన మధ్య ఉన్న మనుషులే. బ్రాహ్మణ గర్వం, పురుష అహంకారానికి ప్రతీక సత్య అన్న వెంకటేశం తనకు లాభం వచ్చే ఏ పనైనా సరే చేయడానికి వెనుకాడడు. పదేళ్లుగా కాపురం చేస్తున్న భార్యను కూడా ఆస్తి కోసం వదిలేయడానికి సిద్ధపడతాడు. మంత్రి మేలగిరి గౌడ తన చేతుల పాడవకుండా తనకి ప్రయోజనం కలిగించేలా ఏ సంఘటననైనా మలుచుకోగలిగిన రాజకీయ నాయకుడు. మాదిగ బెట్టయ్య గాంధేయవాది. ఈ పైకులాలతో మనకెందుకు? మనకి హాని కలిగించకుండా ఉంటే చాలు అనే తత్వం. అందుకు విరుద్ధం ఆయన కొడుకు మోహన్‌దాసు. ప్రధాన పాత్రల మధ్య జరిగే సంభాషణలు, సత్య తనలో తాను అనుకునే విషయాలు చదివే వాళ్లలో చాలా ఆలోచనలు రేకెత్తిస్తాయి. ఈరోజు రాజకీయాల కోసం ఓట్ల కోసం కుల సంఘాలని పెంచి పోషిస్తూ కులాల వారీ రాజ్యాధికారాన్ని పంచుకోవటం చూస్తున్నాము. సాంకేతికంగా ఎంతో సాధించాం అని చెప్పుకుంటున్న మనం ‘ఖాప్’ పంచాయితీలు, పరువు హత్యలు, దళితుల ఊచకోతలు, ఆడవాళ్ల మీద అరాచకాలు టి.వి.ల ద్వారా మన గదుల్లోకే చొచ్చుకుని వస్తున్నప్పుడు నిస్సహాయంగా చూడటం తప్ప ఏం చేయగలుగుతున్నాం? ఇవన్నీ దాటాలి అంటే ఏదో ఒక బలమైన శక్తి రావాలి.

 - కృష్ణమోహనబాబు   9848023384

 

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top