హృదయ నిరాడంబరత

Analysis On Commentaries An Living Book - Sakshi

జిడ్డు కృష్ణమూర్తి ‘కామెంటరీస్‌ ఆన్‌ లివింగ్‌’ పుస్తకం తెలుగులోకి ‘మన జీవితాలు’ (జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు)గా 1997లో వచ్చింది. దీన్ని అబ్బూరి ఛాయాదేవి అనువదించారు. ప్రచురణ: ప్రగతి పబ్లిషర్స్‌. దీని ప్రత్యేకత ఏమిటంటే– ‘కృష్ణమూర్తి ప్రచురణలలో ఎక్కువ భాగం వివిధ సందర్భాల్లో, వివిధ ప్రదేశాల్లో చేసిన ప్రసంగాలు కాగా యీ ప్రస్తుత గ్రంథం ఆయన స్వయంగా చేసిన లిఖిత రచన’. అందులో హృదయ నిరాడంబరత గురించి కృష్ణాజీ ఇలా వ్యాఖ్యానిస్తారు:

‘‘వస్తు వాహనాలు కలిగి ఉండటంలో నిరాడంబరత కన్న హృదయ నిరాడంబరత చాలా ముఖ్యమైనది, అర్థవంతమైనది. ఏవో కొద్ది వస్తువులతో తృప్తిపడి ఉండటం అంత కష్టం కాదు. సౌఖ్యాన్ని వదులుకోవటం, ధూమపానం మొదలైన అలవాట్లను మానివెయ్యటం– ఇవి హృదయ నిరాడంబరతని సూచించవు. వేషభూషణాలతో, సౌఖ్యాలతో, అనేక ఆకర్షణలతో నిండి ఉన్న ప్రపంచంలో గోచీగుడ్డ కట్టుకుని తిరిగినంత మాత్రాన స్వేచ్ఛా జీవనాన్ని సూచించదు.

‘‘వాస్తవికతని బాహ్యనిగ్రహాల ద్వారా, ఆంక్షల ద్వారా చేరుకోగలరా? బాహ్యనిరాడంబరత, సుఖాల్ని వదులుకోవటం అవసరమే అయినా, ఆ మాత్రం చేష్టకే యథార్థం అనేదానికున్న ద్వారం తెరుచుకుంటుందా? సౌఖ్యంతో, విజయంతో మనస్సు, హృదయం భారమైపోతాయి. ప్రయాణం చెయ్యాలంటే స్వేచ్ఛగా ఉండాలి. అయితే, మనం ఈ బాహ్య చేష్టతోనే ఎందుకంత సతమతమైపోతున్నాం? మన ఉద్దేశాన్ని బాహ్య రూపంలో పెట్టటానికి ఎందుకంత ఉత్సుకత, ఎందుకంత పట్టుదల? ఇది ఆత్మవంచన వల్ల కలిగే భయం వల్లనా, మరొక కారణం వల్లనా? మన చిత్తశుద్ధి గురించి మనల్ని మనమే నమ్మించుకోవాలని ఎందుకు కోరుకుంటాం? సుస్థిరంగా ఉండాలనే కోరికలోనూ, ఏదో అయితే మనకి ఘనత ఉంటుందన్న నమ్మకంలోనూ ఈ సమస్యంతా ఇమిడి ఉంది.

ఏదో అవాలనే కోరికతోనే చిక్కులన్నీ ఆరంభమవుతాయి. ఏదో అవాలి అనే కోరిక లోపలా, బయటా కూడా అంతకంతకు పెరిగిపోవటం వల్ల కూడబెట్టు కోవటం, త్యజించటం, అలవరుచుకోవటం, లేదా వదులుకోవటం చేస్తూ ఉంటాం. కాలం అన్నింటినీ దోచేస్తుందని తెలిసి కాలరహితమైన దానికోసం ప్రాకులాడతాం. ఏదో అవాలని చేసే పోరాటం– ఏదైనా చెయ్యటం ద్వారా గాని, మానెయ్యటం ద్వారా గాని, బంధనాలను పెంచుకోవటం ద్వారా గాని, వాటిని వదులుకోవటం ద్వారా గాని, బాహ్య చేష్టలతో గాని, క్రమశిక్షణతో గాని, సాధనతో గాని ఎన్నటికీ అంతం కాలేదు. కాని, ఈ పోరాటాన్ని అవగాహన చేసుకోవటంతోనే, ఏ విధమైన బాహ్య ప్రేరణ లేకుండా దానంతట అదిగా స్వేచ్ఛ కలుగుతుంది. బహిరంగంగానూ, ఆంతరంగికంగానూ జరిగే సేకరణ నుంచీ, అది కలిగించే సంఘర్షణల నుంచీ విముక్తి లభిస్తుంది. కేవలం బంధనాలను తెంచుకోవటం ద్వారా వాస్తవికతని చేరుకోలేము. ఏ మార్గాన్ని అవలంబించినా అది సాధ్యం కాదు. అన్ని మార్గాలూ, లక్ష్యాలూ ఒకే విధమైన బంధనాలు. అవన్నీ వదులుకోవాలి వాస్తవిక స్థితి కోసం.’’ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top