గంటల తరబడి వాటి ముందే గడపటంతో...

5 Reasons You Might Want To Limit Your Screen Time - Sakshi

ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది... మీతో మాకేం పని అంటూ.. పక్కన వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలోనే మునిగి తేలుతున్నారు చాలామంది. కాలు కదపకుండా.. కూర్చున్న దగ్గర్నుంచే అన్ని పనులు చకాచకా చేసేసుకుంటున్నారు. ప్రజంటేషన్‌ దగ్గర్నుంచి బిల్లు చెల్లింపుల వరకు అన్నింటిన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో పూర్తి చేసుకుంటున్నారు‌. బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు సైతం స్మార్ట్‌ఫోన్లను వదలడం లేదు. స్మార్ట్‌ఫోన్లతో ఆడటం, గంటల తరబడి వీడియోలను, కార్టూన్లను చూడటం చేస్తున్నారు. ఇలా చేయడంతో పిల్లలు తాత్కాలిక ఉత్సాహాన్ని పొందుతున్నారేమో కానీ.. ఆరోగ్యానికి, ఇది ఏ మాత్రం మంచి కాదని అంటున్నారు నిపుణులు. ఒక్క పిల్లలకే కాకుండా.. మీపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందట. స్క్రీన్‌ ముందే గంటల తరబడి గడపటం వల్ల మీరు మీ కుటుంబంతో గడిపే అమూల్యమైన క్షణాలను కోల్పోతారట. 

డిజిటల్‌ స్క్రీన్‌ ముందే గంటల తరబడి గడపటం వల్ల వచ్చే అనర్థాలు....
డిజిటల్‌ స్క్రీన్‌ ముందు కూర్చుని గంటల కొద్దీ పనిచేయడంతో కేవలం కళ్లు మాత్రమే కాక... మొత్తంగా ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడనుందట. అవేమిటో ఓ సారి చూద్దాం..

రేడియేషన్‌ పెరగడం : ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లను ఎక్కువగా వాడటంతో, వాటి నుంచి వచ్చే రేడియేషన్‌... క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదాలను పెంచుతాయట. ఈ ప్రమాద బారిన పడకుండా ఉండేందుకు రోజుల్లో ఒక్క గంట లేదా రెండు గంటలు మాత్రమే డిజిటల్‌ స్క్రీన్‌కు పరిమితమవుతూ.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సంరక్షించుకోవడం చాలా మంచిదంటున్నారు నిపుణులు.  

అలసట : సోషల్‌ మీడియాలో అప్‌డేట్లను చెక్‌ చేసుకుంటూ.. ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేయడం వల్ల కాస్త విశ్రాంతిని పొందవచ్చని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ పలు పరిశోధనలు, అధ్యయనాల ప్రకారం.. ఇంటర్నెట్‌(ముఖ్యంగా సోషల్‌ మీడియా), ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్ల వాడకం మిమ్మల్ని తీవ్ర అలసటకు గురిచేస్తుందని తెలిసింది. అంతేకాక డిప్రెషన్‌లోకి వెళ్లేలా చేస్తుందట. చిన్నారులపై కూడా గాడ్జెట్ల వాడకం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, వారి నిద్రకు భంగం కలిగించి, వారి ప్రవర్తనలో సమస్యలను తెచ్చి పెడుతుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.  

నిద్ర రుగ్మతలు : మనం ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే, ఆరోగ్యకరమైన నిద్రను అలవాటు చేసుకోవాలి. పెద్దలకు రోజూ తప్పనిసరిగా రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. కానీ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లపై ఎక్కువగా సమయాన్ని వెచ్చించడం వల్ల, చాలామంది(ముఖ్యంగా టీనేజర్లు, యువత) మూడు నుంచి నాలుగు గంటలు నిద్రపోవడానికే చాలా కష్టపడుతున్నారు. దీంతో నిరంతరం నిద్ర లేమి ఏర్పడి, ఊబకాయం, హైపర్‌టెన్షన్‌, మధుమేహం, గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారు. 

సంబంధాలు సన్నగిల్లడం : గత దశాబ్ధం లేదా రెండు దశాబ్దాల నుంచి అనూహ్యంగా బ్రేకప్‌లు, పెళ్లిళ్లు విఫలమవడం, విడాకుల సంఖ్య పెరగడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కపుల్స్‌ ఒకరినొకరు అర్థం చేసుకోలేక చాలా సతమతమవుతున్నారు. ఈ సమస్యలకు ప్రధాన పరిష్కారం ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడమే. కానీ ఇటీవల చాలా మంది తమ భాగస్వామికి కొంత సమయం కూడా కేటాయించకుండా.. గాడ్జెట్లలో మునిగి తేలుతున్నారు. దీంతో ముఖాముఖిగా సమస్యపై చర్చించుకోవడం, అర్థవంతమైన సంభాషణను కొనసాగించడం వంటి వాటిల్లో విఫలమవుతూ వస్తున్నారు. ఈ ప్రభావంతో సంబంధ బాంధవ్యాలు సన్నగిల్లుతున్నాయని తెలిసింది. దీనికి పరిష్కారంగా డిజిటల్‌ స్క్రీన్‌పై వెచ్చించే సమయాన్ని తగ్గించి, కుటుంబంతో సంతోషంగా గడపాలని సూచిస్తున్నారు నిపుణులు. దీంతో మీ భాగస్వామితో మీ బంధాన్ని కూడా మరింత బలోపేతం చేసుకోవచ్చట. 

మీ భంగిమల్లో తీవ్ర మార్పులు : రోజంతా స్మార్ట్‌ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌తో గడపటం తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుందట. అంతేకాక శారీరక పనులు కూడా తగ్గిపోతాయట. దీంతో మెడ నొప్పి, భుజాలు లాగడం, వెన్నుపోటు వంటి సమస్యలు పెరిగి, సరిగ్గా నిల్చులేక, కూర్చోలేక సతమతమవుతారని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 

ఇటీవల స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో మీ అవసరాలు పెరిగినప్పటికీ.. వాటితో మీరు పని చేయనప్పుడైనా స్క్రీన్లను ఆపివేసి కాస్త పక్కన పెట్టేస్తే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఆ సమయంలో మీ చిన్నారులతో మాట్లాడుతూ వారితో సరదాగా గడిపితే, మానసిక, శారీరక ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చట.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top