అధికారంపై గులాబీ ధీమా | TRS Confident of governing Telangana | Sakshi
Sakshi News home page

అధికారంపై గులాబీ ధీమా

May 1 2014 1:29 AM | Updated on Aug 14 2018 4:44 PM

అధికారంపై గులాబీ ధీమా - Sakshi

అధికారంపై గులాబీ ధీమా

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి పాలకులెవరో.. ఓటింగ్ యంత్రాల్లో భద్రంగా నమోదైపోయింది.

* తమకూ చాన్సుందంటున్న కాంగ్రెస్
* ఒకింత సంతృప్తిగా బీజేపీ... నిర్వేదంలో కూరుకుపోయిన టీడీపీ
* 2009తో పోలిస్తే ఓటింగ్ శాతం పెరగడంతో ఆశల పల్లకీలో పార్టీలు
 
హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి పాలకులెవరో.. ఓటింగ్ యంత్రాల్లో భద్రంగా నమోదైపోయింది. 16వ తేదీన జరిగే లెక్కింపులో... ఓటర్ల తీర్పు ఏమిటనేది వెల్లడికానుంది. అయితే రాజకీయ పార్టీలు మాత్రం అప్పుడే తమ జయాపజయాలను బేరీజు వేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. పోలింగ్ సరళి, స్థానాల వారీగా పోలింగ్ శాతాలు, క్షేత్ర స్థాయి నుంచి పార్టీల శ్రేణులు రాష్ట్ర నేతలకు పంపిస్తున్న సమాచారం... మొత్తంగా ఓటర్ల వైఖరి ఆధారంగా విజయావకాశాల అంచనాల్లో పడ్డాయి.

మొత్తంగా అన్ని పార్టీలూ ప్రజలు తమ పట్ల ఆదరణ చూపించారని చెప్పుకొంటున్నాయి. ప్రత్యేకించి గులాబీ శిబిరం ఉత్సాహంతో అప్పుడే సంబరాల మూడ్‌లోకి వెళ్లిపోగా... టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా పూర్తి నిశ్శబ్దంలోకి జారిపోయాయి. కాంగ్రెస్ నాయకులు మాత్రం తమదే అధికారమంటూ పైకి చెప్పుకొంటున్నా... అంతర్గత సమీక్షల ఆధారంగా ముఖ్యనేతలే చాలా మంది ఓడిపోనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక టీడీపీతో పొత్తుకట్టి దెబ్బతిన్నామని భావిస్తున్న బీజేపీ... ఈ స్థితిలోనూ మూడు నాలుగు పార్లమెంటు స్థానాల్లో మంచి పోటీ ఇవ్వగలిగామని, గెలుపు అవకాశాలున్నాయని నమ్ముతోంది. కనీసం రెండు పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగురవేయగలమనే ధీమా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది.
 
భారీ పోలింగ్ లాభం ఎవరికో..?
2009 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈసారి తెలంగాణలో దాదాపు 35 లక్షలపైచిలుకు ఓట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో 67.7 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి దాదాపుగా 75 శాతానికి చేరుకోనున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే 7 నుంచి 8 శాతం వరకూ  పెరుగుదల నమోదైనట్లే. ప్రజలు ఇంత భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారంటే అది తప్పనిసరిగా తమ గాలి ప్రభావమేననేది టీఆర్‌ఎస్ విశ్వాసం. ఆ అంచనాతోనే సొంతంగానే అధికారంలోకి వచ్చేస్తామని టీఆర్‌ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తమకు పెద్దగా పార్టీ నిర్మాణం లేని దక్షిణ తెలంగాణలోనూ తాము విస్తరించామని... ఒకవేళ తమ అంచనాలు కొంచెం మారి, నాలుగైదు స్థానాలు తగ్గినా ఆ కాసింత మద్దతును సులభంగా సమకూర్చుకుంటామనేది టీఆర్‌ఎస్ నేతల ధీమా. ‘‘కాంగ్రెస్ చతికిలపడింది. యువకులు, మహిళలు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇది మమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది..’ అని టీఆర్‌ఎస్ ముఖ్య నేత ఒకరు విశ్లేషించారు.
 
కాంగ్రెస్ ముఖ్య నేతల్లోనే సందేహం!
ఇక తాము ఆశించినంతగా పనితీరు కనబర్చలేకపోయామని కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా అంగీకరిస్తున్నా, పెరిగిన పోలింగ్ శాతాలు తమకే ఉపయోగపడతాయని చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులుగా చెప్పుకొన్న బడా నేతలు కొందరు తమ గెలుపు అవకాశాలపై సందేహంలో పడిపోయారు. మజ్లిస్ సహకారంతో అధికారంలోకి వస్తామంటూ నిన్నటిదాకా చెప్పుకున్న నేతలు ఇప్పుడలాంటి వ్యాఖ్యలేవీ చేయడం లేదు! ‘పెద్ద నేతలమంటూ చెప్పుకునే వటవృక్షాలే కూలిపోతాయేమో..’ అంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్య పరిస్థితిని కళ్లకు కడుతోంది.
 
టీడీపీ శిబిరాల్లో సెలైన్స్!
తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రవేసుకుని.. ఆ మచ్చ చెరుపుకోవడానికి బీజేపీతో జతకట్టి ప్రజల్లోకి వెళ్లిన తెలుగుదేశం శ్రేణులు పోలింగ్ ముగిసేసరికి ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి ఫలితాల్లో దుస్థితి కనిపిస్తుందేమోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఆరంభమైంది. ‘ఇక ఇప్పట్లో కోలుకుంటామో లేదో తెలియని పరిస్థితి..’.. అని ఓ టీడీపీ సీనియర్ నేత నిర్వేదాన్ని కనబరిచారు.
 
ఎంపీ స్థానాలైనా వస్తాయన్న అంచనాల్లో బీజేపీ..
టీడీపీతో పొత్తు కారణంగా అనేకచోట్ల విజయావకాశాలుండీ కాలదన్నుకున్నట్లయిందని బాధపడుతున్న బీజేపీ.. అసెంబ్లీ స్థానాల మాటేమిటో గానీ మూడు నాలుగు పార్లమెంటు స్థానాల్లో గెలిచే వీలుందని అంచనా వేసుకుంటోంది. కానీ ఆశించినంతగా ఆ రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ జరగలేదని ఇరు పార్టీల శ్రేణులూ అంగీకరిస్తున్నాయి. ఎంపీ స్థానాలకు సంబంధించి క్రాస్ ఓటింగ్ తమకు లాభించనుందని... యువకులు, మహిళల ఓటింగ్ పెరగడం తమకు కొంతైనా ఉపకరించిందని బీజేపీ అభిప్రాయపడుతోంది.
 
* ఇక రెండు పార్లమెంటు స్థానాలను తప్పనిసరిగా గెలుచుకోగలమనే ధీమాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తోంది.
* మజ్లిస్ పార్టీ గతంలోకన్నా ఒకటీరెండు స్థానాలు అధికంగా వస్తాయని అంచనా వేసుకుంటోంది.
* బీజేపీని నానాపాట్లకూ గురిచేసి ఎనిమిది ఎంపీ సీట్లు మాత్రమే ఇచ్చి, సొంతగా తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ.. ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ బలమైన పోటీ ఇవ్వలేక చతికిలపడుతుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement