ప్రాదేశిక పోరులో తొలి అంకం ముగిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు తెర పడింది.
సాక్షి, గుంటూరు
ప్రాదేశిక పోరులో తొలి అంకం ముగిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు తెర పడింది. నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన గురువారం ఒక్క రోజే జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 402 నామినేషన్లు దాఖలయ్యాయి.
సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. ఆఖరి రోజు కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులతో జెడ్పీ కార్యాలయం వద్ద జాతర వాతావరణ కనిపించింది.
ఉదయం 10 గంటల నుంచి ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తూ మధ్యాహ్నానికి బారులు తీరారు. పరిషత్తు పోరుకు ఈ నెల 17 నుంచి నామినేషన్ల ప్రారంభమైంది. గత నాలుగు రోజులుగా జిల్లాలోని 57 జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 508 నామినేషన్లు దాఖలయ్యాయి.
శుక్రవారం పరిశీలన జరగనుంది. 22, 23 తేదీల్లో అభ్యంతరాలు, తిరస్కరణలు ఉంటాయి. 24న ఉపసంహరణతో పాటు అదే రోజు జెడ్పీ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే జిల్లా వ్యాప్తంగా 913 మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల లెక్క తేలలేదు. చివరి రోజు గురువారం భారీగా నామినేషన్లు వేశారు.
ఐదు గంటల కల్లా నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు బారులు తీరడంతో రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. నరసరావుపేట మండల కార్యాలయం వద్ద రాత్రి 9 గంటల సమయంలో 40 మంది క్యూలో వున్నట్టు సమాచారం అందింది.
ఆధిక్యం కనబర్చిన వైఎస్సార్ సీపీ
నామినేషన్ల దాఖలులో వైఎస్సార్ సీపీ ఆధిక్యత కనబరచింది. మొత్తం 508 నామినేషన్లలో వైఎస్సార్ సీపీ తరఫున 201, టీడీపీ 196, కాంగ్రెస్ 61, బీఎస్పీ 11, బీజేపీ 3, సీపీఐ 3, సీపీఎం-15, స్వతంత్రులు 17, జనం పార్టీ 1,నామినేషన్లు దాఖలు చేశారు.