నిఘా నీడలో..


కర్నూలు, న్యూస్‌లైన్: ప్రాదేశిక సమరంలో మలి విడతకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో 17 జెడ్పీటీసీలకు, 289 ఎంపీటీసీ స్థానాలకు 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతంలో వివాదాస్పద నాయకులు ఉండటంతో ఎస్పీ రఘురామిరెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.

 

 అల్లరి మూకల ఆగడాలను నియంత్రించేందుకు పల్లెల వారీగా పక్కా జాబితాలను సేకరించారు. కొంతమందికి కౌన్సెలింగ్ ఇప్పించారు. నేర చరిత్ర ఉన్న వారి జాబితాను స్టేషన్ల వారీగా సిద్ధం చేసి, వారి కదలికలపై  నిఘా ఉంచారు. సబ్‌డివిజన్ పరిధిలో అత్యంత సమస్యాత్మక గ్రామాలు 75, సమస్యాత్మక గ్రామాలు 100కు పైగా గుర్తించారు. ఆయా గ్రామాల్లో 155కు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

 

 ఆ ప్రాంతాలపై నిఘా తీవ్రం..

 అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో నిత్యం ఒక సీఐ, ఎస్‌ఐలతో పాటు పోలీసు కానిస్టేబుల్‌తో కూడిన బృందం పర్యటించే విధంగా పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మొదటి విడత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల బయట తోపులాటలు, రాళ్లదాడులు, స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి.  ఇలాంటి సంఘటనలు మలి విడతలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు.

 

 అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఇవే..

  కప్పట్రాళ్ల, కుంకనూరు, అలారుదిన్నె, పి.కోటకొండ, పందికోన, మాచాపురం, గుండ్లకొండ, నక్కలదొడ్డి, ఎద్దులదొడ్డి, పెండేకల్ ఆర్‌ఎస్, శెబాష్‌పురం, బొందిమడుగుల, బసినేపల్లి, తుగ్గలి, పగిడిరాయి, అగ్రహారం, తెర్నేకల్లు, కరివేముల, నేలతలమర్రి, చక్రాళ్ల, జొన్నగిరి, జి.ఎర్రగుడి, మారెల్ల, పత్తికొండ.

 

 సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా..

 మలి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే సాయుధ బలగాలను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ఫ్యాక్షన్ గ్రామాల్లో గస్తీ తిప్పుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు, బళ్ళారి జిల్లాల సరిహద్దు గ్రామాలకు చెందిన ఓటర్లు కర్నూలు జిల్లా సరిహద్దు గ్రామాలకు వచ్చి సైక్లింగ్ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో నిఘాను తీవ్రతరం చేశారు.

 

 కర్ణాటక, మహబూబ్‌నగర్ జిల్లాల పోలీసు అధికారుల సమన్వయంతో సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఛత్రగుడి, హోళగుంద, పెద్ద హరివాణం, బాపురం, మాధవరం, నాగులదిన్నె ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేసి ఎన్నికలతో సంబంధం లేని వ్యక్తులు రాకుండా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు.

 

 పేరుకే మూత..ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఉండకూడదని కఠినంగా ఆదేశాలిచ్చినప్పటికీ జిల్లా సరిహద్దులోని అనేక గ్రామాల్లో కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి చేయడంతో కొన్ని ప్రాంతాల్లో బెల్టు దుకాణాలు మూసి వేసినట్లు చూపుతున్నప్పటికీ మరో మార్గంలో వాటి విక్రయాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తోటలు, గడ్డివాములు, ఇసుక ట్రాక్టర్లలో మద్యం బాటిళ్లను నిల్వ చేసి పంపిణీ సాగిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు  సమాచారం అందింది. ఆదోని, డోన్ పోలీస్‌సబ్ డివిజన్ అధికారులను అప్రమత్తం చేసి వాటి కట్టడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top