‘పచ్చ’నోట్ల పంపకంపైనే ఆశలు | money distributeing for elections | Sakshi
Sakshi News home page

‘పచ్చ’నోట్ల పంపకంపైనే ఆశలు

May 1 2014 2:16 AM | Updated on Mar 22 2019 6:18 PM

ఓట్ల పండుగను కాస్త నోట్ల పండుగగా మార్చేందుకు ‘పచ్చ’ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రచారంలో పార్టీ అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

సాక్షి, కడప : ఓట్ల పండుగను కాస్త నోట్ల పండుగగా మార్చేందుకు ‘పచ్చ’ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రచారంలో పార్టీ అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పట్ల పెద్దగా ఆదరణ లేకపోవడం, బరిలో ఉన్న అభ్యర్థులకు వ్యక్తిగతంగా గుర్తింపు లేకపోవడంతో ఎన్నికల బరిలో గెలుస్తామన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.
 
 దీంతో సదరు అభ్యర్థులు డబ్బు పంపకాలపైనే దృష్టి సారించారు. పోలింగ్‌కు రెండు రోజులముందునుంచి  ఓటుకు రూ. 1000 ఇచ్చి ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రామాల్లో ద్వితీయ, తృతీయ స్థాయి శ్రేణులను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం, కులసంఘాలతో పాటు యువకులను తమవైపునకు తిప్పుకునేందుకు డబ్బు వెదజల్లుతున్నారు. జిల్లాలోని మైదుకూరు, రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధానంగా ఆ పార్టీ డబ్బు పంపకాలపై దృష్టి సారించినట్లు సమాచారం.
 
 సడలిన నమ్మకం
 పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ప్రచారానికి పెద్దగా ఆదరణ లభించడం లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు సైతం గుర్తించారు. ప్రచారానికి డబ్బు ఖర్చు చేయడం దండగ అని ఆ పార్టీ భావిస్తోంది. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగితే జనాలు ఛీ కొడుతుండటంతో ప్రచారంలో వెనుకడుగు వేస్తున్నారు. ఇందుకు అయ్యే ఖర్చును మిగుల్చుకుని ఓటర్లకు పంచి పెట్టాలని భావిస్తున్నారు. జనాభిమానంతో కాకుండా డబ్బుతో ఓట్లను రాబట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
 
 ఇందుకోసం సొమ్ము సిద్దం చేసుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమీ చేయనక్కర లేదు.. వారి కష్టాలు, కన్నీళ్లు తుడాల్సిన పని లేదంటూ బరిలో ఉన్న అభ్యర్థులకు టీడీపీ ముఖ్య నేతలు హితబోధ చేస్తున్నట్లు సమాచారం. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోయినా, ప్రజల నడ్డి విరిచినా ఇప్పుడు హామీలు గుప్పిస్తూ జనం అవన్నీ మరిచిపోతారని భావిస్తున్న పార్టీ అధినేతను ఆదర్శంగా తీసుకోమంటున్నారు. ప్రచారం ప్రక్కనపెట్టి డబ్బు పంపకాల మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు.
 
 ప్రలోభాలు
 పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో వివిధ రాజకీయ పక్షాలు ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమానికి తెర తీస్తున్నారు. ఈ విషయంలో జిల్లాలో ఓ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. డబ్బు, మందు, విందులతో ఆ పార్టీ నేతలు ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఓవైపు ప్రచారంలో హడావుడి కొనసాగిస్తూనే నేతలు తెర వెనుక కార్యక్రమాల జోరు పెంచారు. జిల్లాలో పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న నేపధ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కనీసం ఒకటి,  రెండు స్థానాల్లోనైనా గట్టి పోటీ ఇచ్చేందుకు ఆ పార్టీ పడరాని పాట్లు పడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement