ఓటరు దేవాయనమః | Sakshi
Sakshi News home page

ఓటరు దేవాయనమః

Published Thu, Apr 17 2014 2:45 AM

ఓటరు దేవాయనమః - Sakshi

నేడు పోలింగ్..  నెల తర్వాతే ఫలితాలు
  కాంగ్రెస్, బీజేపీలకు జీవన్మరణ సమస్య
  సిద్ధరామయ్యకు తొలి అగ్ని పరీక్ష
  కనీసం 15 స్థానాల్లో గెలుపే లక్ష్యం
  ఫలితాల్లో తేడాలొస్తే ముళ్ల బాటే
 కర్ణాటకపై మోడీ భారీ ఆశలు
 19 స్థానాలపై గురి
 నామమాత్రంగా ‘ఆప్’


 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో సాగుతున్నది నరేంద్ర మోడీ ప్రభంజనమా లేక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాణక్యమా... గురువారం తేలిపోనుంది. మొత్తం 28 నియోజక వర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరుగనుంది. ఫలితాల కోసం వచ్చే నెల 16 వరకు వేచి ఉండాల్సిందే. గత మేలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సిద్ధరామయ్య తొలి సారిగా అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు.

 కన్నడ నాట కమలనాథులకు గట్టి పునాదులు ఉండడానికి తోడు మోడీ పవనాలు వీస్తున్నాయనే అంచనాలను ఆయన తలకిందులు చేయాల్సి ఉంది. కనీసం 15 స్థానాల్లో గెలుపు సాధించడం ద్వారా ఢిల్లీలో తన పరపతికి ఢోకా లేకుండా చూసుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది. పార్టీలోనే పొంచి ఉన్న శత్రువులకు ఘన విజయం ద్వారా ఆయన ప్రత్యుత్తరం ఇవ్వాల్సి ఉంది. ఫలితాల్లో తేడాలొస్తే ఆయనకు ముందున్నది ముళ్ల బాటే. మరో వైపు ప్రతిపక్ష బీజేపీ కూడా ఈ ఎన్నికల ద్వారా గట్టి సవాలును ఎదుర్కోవాల్సి ఉంది.

దేశమంతటా మోడీ పవనాలు వీస్తున్నాయనే అంచనాల నేపథ్యంలో గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లను గెలిపించి ఇవ్వకపోతే ఇక్కడి కమలనాథులు ఢిల్లీలో ముఖం చూపడమే కష్టమవుతుంది. 2009లో జరిగిన ఎన్నికల్లో 19 స్థానాలను గెలుచుకున్న కమలనాథులు, ఒకటో, రెండో...అటు ఇటుగా స్థానాలను సాధించకపోతే ఢిల్లీలో కూడా మోడీ పని కష్టమవుతుందని వినిపిస్తోంది. అధికార పార్టీని ఎదురొడ్డి మెజారిటీ సీట్లను సాధించడం బీజేపీకి కత్తి మీద సామే.

 ఆరుగురు మాజీ సీఎంలు
 కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున మాజీ ముఖ్యమంత్రులు బరిలో ఉన్నారు. మాజీ ప్రధాని కూడా అయిన జేడీఎస్ అధినేత దేవెగౌడ హాసనలో, ఆయన కుమారుడు కుమారస్వామి చిక్కబళ్లాపురంలో, కాంగ్రెస్‌కు చెందిన వీరప్ప మొయిలీ కూడా అదే నియోజక వర్గంలో, ధరం సింగ్ బీదర్‌లో, బీజేపీకి చెందిన యడ్యూరప్ప శివమొగ్గలో, డీవీ. సదానంద గౌడ బెంగళూరు ఉత్తరలో తలపడుతున్నారు.

ఈ నియోజక వర్గాలతో పాటు బెంగళూరు దక్షిణ, కేంద్ర మంత్రి మల్లిఖార్జున పోటీ చేస్తున్న గుల్బర్గ, మరో కేంద్ర కేహెచ్. మునియప్ప బరిలో ఉన్న కోలారు నియోజక వర్గాలు కీలకంగా మారాయి. సినీ నటి, కాంగ్రెస్ అభ్యర్థి రమ్య బరిలో ఉన్న మండ్యలో కూడా పోటీ ఆసక్తికరంగా మారింది.

 నామ మాత్రంగా ఆప్
 ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులు దాదాపుగా అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నప్పటికీ, వారి ప్రభావం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. వారు పోటీ చేస్తున్న నియోజక వర్గాల్లో తమ ఓట్లలో చీలిక ఏర్పడుతుందని బీజేపీ తొలుత ఆందోళన చెందినప్పటికీ ప్రస్తుతం కుదుట పడుతోంది.

 ఓటు వేస్తే...కంటి పరీక్షల్లో రాయితీ
 నగరంలోని శంకర కంటి ఆస్పత్రి ఓటర్లకు డిస్కౌంట్ తాయిలాన్ని ప్రకటించింది. బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరింది. అలా ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఈ నెల 17, 18 తేదీల్లో తమ ఆస్పత్రిలో కన్సల్టేషన్ ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. పోలింగ్ రోజు నుంచి 14 రోజుల పాటు లాసిక్ స్క్రీనింగ్‌ను కూడా ఉచితంగా నిర్వహిస్తామని తెలిపింది. ఓటు వేసినప్పుడు వేలిపై పెట్టే సిరా గుర్తును డాక్టర్లకు చూపించడం ద్వారా ఈ రాయితీలను పొందవచ్చని పేర్కొంది.

Advertisement
Advertisement