
పరాభవమే మిగిలింది
చిరంజీవి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, ఇచ్చాపురం, పలాస, తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించారు.
ఆయనను చూడడానికి ఒకప్పుడు జనం క్యూ కట్టేవారు. ఆయన వస్తున్నాడంటే ఎండనకా వాననకా గంటలకొద్ది వేచి చూసేవారు. ఆయన్ని చూస్తే అభిమానులు ఉప్పొంగిపోయేవారు. కానీ ఆయన రాజకీయ రంగప్రవేశం చేశాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన వస్తున్నారన్నా జనం పట్టించుకోవడంలేదు. కనీసం ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒకప్పుడు వేలల్లో వ చ్చిన వారు కనీసం వందల్లో కూడా రావడం లేదు. ఆయన ఇమేజ్ అంతగా దిగజారిపోయింది మరి. ఆయన ఇంకెవరో కాదు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మెగాస్టార్, ప్రస్తుత కేంద్రమంత్రి చిరంజీవి. ఆయన శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్నా పెద్దగా జనం పట్టించుకోవడంలేదు.
కవిటి,కంచిలి,సోంపేట,వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, పలాస,మందస, న్యూస్‌లైన్ : చిరంజీవి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, ఇచ్చాపురం, పలాస,తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించారు. ఎక్కడా ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరుకాలేదు. ఆయన పర్యటనలో ఎక్కడా ఎక్కువసేపు ప్రసంగించకపోవడంతో హాజరైన అతి కొద్దిమంది కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రసంగించిన తీరు కూడా ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వజ్రపుకొత్తూరు మండలంలో పర్యటించాల్సిన చిరంజీవి అనుకున్న సమయానికంటే అరగంట ఆలస్యంగా వచ్చినప్పటికీ గరుడుభద్ర వద్ద వాహనాలు ఆపకుండా నేరుగా వెళ్లిపోయారు. అక్కడ నుంచి వజ్రపుకొత్తూరులో కారు ఆపాల్సి ఉన్నా ఆపకుండా నేరుగా నువ్వులరేవు చేరుకున్నారు.
ఆ గ్రామంలో మాట్లాడుతారని ఆశించిన గ్రామస్తులు ఆయన కారు ఆపకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సమీప గ్రామమైన కాశీనగర్‌లో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంక నాగేశ్వరరావు ఇంటి వద్ద ఉంటారని భావించి వచ్చిన అభిమానులకు చిరంజీవి కనిపించకపోయేసరికి వంక నాగేశ్వరరావు ఇంటిపై రాళ్లు రువ్వి అద్దాలు పగులగొట్టారు. కాంగ్రెస్‌కు ఒక్క ఓటు వేయమని బహిరంగంగా చెబుతూ నువ్వలరేవు గ్రామానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో చిరంజీవిని హెలికాప్టర్‌లో ఎక్కించేందుకు మండల కేంద్రం ఎదురుగా ఉన్న హెలీప్యాడ్ వద్దకు వెళ్లి సాగనంపి వస్తున్న వంక నాగేశ్వరరావుకు కొంతమంది జరిగిన విషయాన్ని తెలియపర్చడంతో ఆయన వెంటనే పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ఇంటి వద్దకు చేరుకుని చూసేటప్పటికీ ఇంటి వద్ద కిటికీలు పగులగొట్టిన దృశ్యం ఆయనకు కనిపించింది. హరిపురం జంక్షన్‌లో బస్సు డోరు వద్దకు వచ్చిన చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్ధులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరగా మధ్యలో కొంత మంది కలుగజేసుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌కి పార్టీకి ఓటు వేయమని సమాధానం చెప్పారు. మరికొంత మంది కేంద్ర మంత్రిగా మీరు ఎందుకు రాష్ట్ర విభజనను అడ్డుకోలేదని ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న చిరు వేగంగా తన ప్రసంగాన్ని ముగించుకుని వెళ్లిపోయారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి కిల్లి కృపారాణి, డీసీసీ అధ్యక్షుడు డోల జగన్, పలాస నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వంక నాగేశ్వరరావు, ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థి నరేష్‌కుమార్ అగర్వాలా సాతుపల్లి శేషయ్య, మడ్డు శాంతిమూర్తి, బాలకృష్ణ, పార్టీ నాయకులు పాల్గొనారు.