భీమవరం.. టీడీపీ శ్రేణుల గరంగరం
భీమవరం నియోజకవర్గ సీటును చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు కట్టబెట్టడంపై
భీమవరం, న్యూస్‌లైన్: భీమవరం నియోజకవర్గ సీటును చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు కట్టబెట్టడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. కొన్నేళ్లుగా ఎన్నోవ్యయప్రయాసలకోర్చి పార్టీని నిలబెట్టిన నాయకులను కాదని.. ఐదేళ్లుగా తమను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తికి టికెట్ ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలముకుంది. ఎమ్మెల్యేగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని అంజిబాబుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డబ్బున్నంత మాత్రాన ఎన్నికల్లో గెలిచేస్తామని ధీమాలో పార్టీ అధిష్టానం ఉండడం చా లా పొరపాటని తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు.
పార్టీ గెలిచే పరిస్థితులు లేకపోవడంతో చాలామంది ద్వితీయ శ్రేణి నేతలు ప్రచారానికి దూరంగా ఉంటూ ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. టికెట్ ఆశించి భంగపడిన సీనియర్ నేత మెంటే పార్థసారథిని అధిష్టానం బుజ్జగించే పనిలో ఉన్నప్పటికీ తన సీటును తన్నుకుపోయిన అంజిబాబుపై ఆయన లోలోన రగిలిపోతున్నట్లు తెలిసింది. సారథికి జరిగిన అన్యాయాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని పని చేసిన సార థిలాంటి వారినే గుర్తించకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ కొంతమంది కార్యకర్తలు తీవ్రంగా మదనపడుతున్నారు. ఎమ్మెల్యేగా అంజిబాబు పాలనను చూ శామని ఆయన ఏలుబడిని మరోసారి చూడనవసరం లేదని పలువురు టీడీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. దీంతో అంజిబాబు శిబిరంలో స్తబ్దత నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలను తనవైపునకు తిప్పుకునేందుకు ఏం చేయాలో తెలియ క అంజిబాబు తల పట్టుకున్నారు.