ప్రాతినిధ్య ప్రజాస్వామ్య భావనలు మొగ్గతొడిగి ఓటనేది ఉనికిలోకి రావడానికి... అది అందరిదీ కావడానికి విశ్వవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు జరిగాయి.
సంపాదకీయం: ప్రాతినిధ్య ప్రజాస్వామ్య భావనలు మొగ్గతొడిగి ఓటనేది ఉనికిలోకి రావడానికి... అది అందరిదీ కావడానికి విశ్వవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. అందుకోసం ఎందరెందరో బలిదానాలు చేశారు. ఓటు హక్కు లభించడం సమానత్వానికి చిహ్నంకాగా, దాన్ని వినియోగించుకోవడం భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశం. అయితే, ఆ ఓటు విలువను గుర్తించలేనివారు కొందరైతే...ఆ హక్కును సొంతం చేసుకోవడానికి ప్రయత్నించి పదే పదే విఫలమవుతున్నవారు మరికొందరు. ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతికి చెందిన విద్యావంతులే ఎన్నికలపై నిరాసక్తత ప్రదర్శించడం దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ కనబడుతుంది. అందువల్లే ఓటింగ్ శాతం ఎప్పుడూ 60 శాతానికి అటూ, ఇటే ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ ధోరణి మారినట్టు కనబడుతోంది. పాలకులపై పట్టరాని కోపం ప్రదర్శించి, ఆనక చప్పగా చల్లబడిపోవడం కాకుండా పోలింగ్ కేంద్రాలముందు బారులుతీరే పౌరుల్లో తామూ భాగంకావడం, నచ్చిన పార్టీకి ఓటేయడం అనే అలవాటు పెరిగింది. నాలుగు నెలలక్రితం జరిగిన న్యూఢిల్లీ ఎన్నికల్లో దీని ప్రభావమూ కనబడింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్, బీజేపీ వంటి దిగ్గజాలను కొత్తగా రంగంలోకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్ మట్టికరిపించగలిగారు.
ఈ విజయంతో ఆ పార్టీల్లో కూడా పునరాలోచన మొదలైంది. ఓటర్లకు చేరువకావడానికి కొత్త కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేయడానికి అవి కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ‘చాయ్ పే చర్చా’ పేరిట భిన్నవర్గాల ప్రజలతో నేరుగా సంభాషిస్తున్నారు. వారి సమస్యలేమిటో తెలుసుకుని, తన మనోభావాలను వారితో పంచుకుంటున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం సాధారణ ప్రజానీకానికి సన్నిహితంకావడానికి ప్రయత్నిస్తున్నారు. భిన్నవర్గాలకు చెందిన బృందాలను కలుస్తున్నారు. దేశాన్నేలదల్చుకున్న నేతలు ఎన్ని పరిమితుల్లోనైనా ఇలా ప్రజలకు సన్నిహితంకావడానికి, వారి ఆలోచనలు తెలుసుకోవడానికి, తమ భావనలను వారికి తెలియజేయడానికి ముందుకు రావడం హ ర్షించదగ్గ పరిణామం. ఈ కొత్త ధోరణి నిర్లిప్తంగా ఉన్నవారిలో ఉత్సాహాన్ని రేకెత్తించి, వారు సైతం ఓటర్లుగా నమోదుకావడానికి దోహదపడుతోంది.
ఎన్నికల సంఘం ఈ విషయంలో ఎన్నో చర్యలు చేపట్టింది. ఓటు హక్కు కల్పించడం కోసం ఈసారి యూనివర్సిటీల్లో, కళాశాలల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ప్రయత్నం మంచి ఫలితాలనే ఇచ్చినట్టు కనబడుతోంది. మన రాష్ట్రంలో యువ ఓటర్లే ఈసారి ఎన్నికల్లో కీలక పాత్రవహించబోతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ మొత్తం 6 కోట్ల 23 లక్షలమంది ఓటర్లుండగా అందులో 3 కోట్ల 52 లక్షలమంది యువతీయువకులే. అందులో 30 సంవత్సరాల లోపువారు కోటి 90 లక్షలమంది. 30-39 సంవత్సరాల మధ్యవయస్కులు కోటీ 62 లక్షలమంది. అంటే మొత్తం ఓటర్లలో సగానికిపైగా మంది యువ తరమే! యువ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా మారిన నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు, వారి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించేందుకు పార్టీలు పోటీపడతాయి.
ఇంతవరకూ బాగానే ఉన్నా మహిళా ఓటర్ల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తుంది. నిరుడు జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితాలో 2.90 కోట్లమంది పురుషులు, 2.92కోట్లమంది మహిళలు ఉన్నారు. ఆ ఏడాది సెప్టెంబర్‌కే పురుష ఓటర్లు పెరిగి మహిళా ఓటర్లు నాలుగు లక్షలమేర తగ్గారు. ఇప్పుడు ఓటర్ల తుది జాబితాలో కూడా ఇది కొనసాగింది. గతంలో జనగణనలో సైతం ఈ తేడాయే దర్శనమిచ్చింది. 2001 జనాభా లెక్కలతో పోలిస్తే 2011 లెక్కల్లో దేశవ్యాప్తంగా స్త్రీ, పురుష నిష్పత్తి స్వల్పంగా పెరిగినా మన రాష్ట్రంలో మాత్రం లోగడకంటే తగ్గుదల కనిపించింది.
ఓటు హక్కుకు అర్హత ఉన్నవారిని జాబితాల్లోకెక్కించడం ఒక ఎత్తయితే...అర్హులైనవారి పేర్లు గల్లంతుకావడం, బోగస్ ఓటర్లు వచ్చి చేరడం మరో సమస్య. క్రితంసారి తమకు ఓటున్నా ఈసారి గల్లంతయిందని చెప్పేవారు చాలామంది ఉంటున్నారు. పోలింగ్ రోజున చానెళ్లనిండా ఇలాంటివారి ఆవేదనలు కనబడుతుంటాయి. గతంలో ఓటుండి ఇప్పుడెందుకు గల్లంతయిందో ఆరా తీస్తే బహుశా చాలా అంశాలు బయటపడవచ్చు. పెత్తందార్లతో కుమ్మక్కయ్యే అధికారుల తీరు వెల్లడికావొచ్చు. తమ ఓటు మాయమైందని గగ్గోలుపెట్టేవారిని గాలికొదిలి ఇంకోసారి నమోదు చేయించుకోమని సలహా ఇవ్వడంతప్ప మరేమీ చేయకపోవడంతో ఇలాంటివి కొనసాగుతున్నాయి. ఈ విషయంలో ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇవి ఆగవు. బోగస్ ఓటర్లది మరో కథ. ఓటరుగా నమోదు చేయించుకోవడానికి ఎన్నెన్నో ఆధారాలను సమర్పించమని కోరే అధికారులు ఈ బోగస్ ఓటర్లను కిక్కురుమనకుండా ఎలా చేర్చుకుంటారో అనూహ్యం.
ఎక్కడో కాదు...చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే 43,000 బోగస్ ఓట్లున్నాయని నిరుడు డిసెంబర్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. మన రాష్ట్రం, తమిళనాడు, కర్ణాటక కూడలిగా ఉన్న ఆ నియోజకవర్గంలో తమిళులు, కన్నడిగులు ఓటర్లుగా చేరిపోయారు. ఒక అసెంబ్లీ స్థానంలో ఇంతపెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లుంటే అభ్యర్థి గెలుపోటములపై దాని ప్రభావం ఎంతగా ఉంటుందో చెప్పనవసరంలేదు. ఓటర్ల జాబితాలను యాంత్రికంగా నవీకరించడం కాకుండా...పాతవారి పేర్లు ఎందుకు మాయమయ్యాయో, కొత్తగా వచ్చిచేరిన వారిలో అర్హులెందరో అక్కడక్కడైనా తనిఖీలు జరిపి కఠిన చర్యలు తీసుకునే పద్ధతి ఉంటే మాయగాళ్ల ఆటలు సాగవు. అలాంటి చర్యలు మన ఎన్నికల ప్రక్రియపై మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి. ఎన్నికల సంఘం ఈ దిశగా కూడా దృష్టి సారించాలి.