బాధ్యతారాహిత్యం తగదు! | UPA's irresponsible attitude in missing coal scam files | Sakshi
Sakshi News home page

బాధ్యతారాహిత్యం తగదు!

Sep 6 2013 12:54 AM | Updated on Jul 29 2019 7:43 PM

ఏ ముహూర్తంలో బొగ్గు కుంభకోణం బయటపడిందోగానీ... దాన్ని కప్పెట్టాలని చూసేకొద్దీ అది యూపీఏ సర్కారు పరువును మరింతగా దిగజారుస్తోంది.

సంపాదకీయం: ఏ ముహూర్తంలో బొగ్గు కుంభకోణం బయటపడిందోగానీ... దాన్ని కప్పెట్టాలని చూసేకొద్దీ అది యూపీఏ సర్కారు పరువును మరింతగా దిగజారుస్తోంది. పక్షంరోజులక్రితం మాయమైన బొగ్గు కుంభకోణం ఫైళ్లపై నిండు సభలో ప్రధాని మన్మోహన్‌సింగ్ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రధాని జవాబిచ్చే పరిస్థితి రాకుండా చూడటానికి కాంగ్రెస్ చేసిన యత్నాలు ఫలించలేదు. ఆయన ఇచ్చిన సమాధానం సభ్యుల సందేహాలను నివృత్తి చేయకపోగా మరిన్ని సందేహాలు కలిగించింది.
 
 అసలు ఫైళ్ల మాయం అనేదే జరగలేదన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఈ స్కాం చిన్నదేమీ కాదు. దేశ ఖజానాకు లక్షా 80 వేల కోట్ల రూపాయల నష్టం తెచ్చిన అతి పెద్ద కుంభకోణమది. అందుకు సంబంధించి సుప్రీంకోర్టే కలగజేసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన ఆదేశాలిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ఫైళ్లకు కాళ్లొచ్చాయంటే దోషుల తెగింపు ఏపాటిదో అర్ధంచేసుకోవచ్చు. ఈ స్కాంలో ప్రభుత్వం వ్యవహార శైలి ఆదినుంచీ అనుమానాస్పదంగానే ఉంది. గత ఏడాది మేనెలలో బొగ్గు కుంభకోణాన్ని కాగ్ బయటపెట్టింది. విద్యుత్తు, సిమెంటు, ఉక్కు పరిశ్రమలకు క్యాప్టివ్ మైనింగ్ కోసం బొగ్గు గనుల క్షేత్రాలను కేటాయించడంలో పారదర్శకత లోపించిందని, 2004-09 మధ్య ఇలా 155 బొగ్గు క్షేత్రాలను 100 సంస్థలకు కట్టబెట్టారని ఆ నివేదిక వెల్లడించింది.
 
  కాగ్ లెక్కలు అతిగా ఉన్నాయని వాదించడం దగ్గర్నుంచి సుప్రీంకోర్టుకివ్వాల్సిన నివేదికను కేంద్రమంత్రి తెప్పించుకుని అందులో మార్పులూ చేర్పులూ చేసేవరకూ ప్రభుత్వం వేసిన అడుగులన్నీ దాని ప్రతిష్టను దిగజారుస్తూ వచ్చాయి. సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల పర్యవసానంగా ఆ కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సివచ్చింది. సీబీఐ ‘పంజరంలో చిలుక’ మాదిరి వ్యవహరిస్తున్నదని, దీన్ని అనుమతించజాలమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించవలసివచ్చింది ఈ కేసులోనే. ఇంతగా రచ్చ అయ్యాక కూడా యూపీఏ ప్రభుత్వం తన తీరును మార్చుకోలేదని ఈ ఫైళ్ల గల్లంతు వ్యవహారం చాటిచెబుతోంది.
 
 రాజ్యసభలో ప్రధాని ఈ విషయంలో ఇచ్చిన జవాబు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడంలేదు. దర్యాప్తు కోసమని సీబీఐకి ఇంతవరకూ లక్షన్నర పేజీల పత్రాలను అందజేశాం గనుక తమను అనుమానించడానికేమీ లేదని ఆయన అంటున్నారు. ‘ఒకవేళ’ ఏమైనా ఫైళ్లు కనిపించడంలేదనుకుంటే వాటిని సుప్రీం కోర్టు ఇచ్చిన రెండువారాల గడువులో సీబీఐకి అందజేయగలమన్నారు. నిజానిజాలేమిటో తెలుసుకోకుండా ఫైళ్లు పోయాయని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అసలు ఫైళ్లు పోయిన విషయం ప్రభుత్వానికి తెలుసా? తెలిస్తే ఆ తదుపరి తీసుకున్న చర్యలేమిటి? ఎవరిపైన అయినా కేసులు పెట్టారా? అనే సందేహాలు ఎవరికైనా వస్తాయి.  
 
 మొదట్లో తమకు 225 ఫైళ్లు ప్రభుత్వంనుంచి రావాల్సి ఉందని సీబీఐ చెప్పింది. అందులో చాలావరకూ ఆ తర్వాత ప్రభుత్వం అందజేసింది. అయితే, కీలకమైన దశకు సంబంధించి 29 ఫైళ్లు ఇంకా సీబీఐకి చేరలేదు. వీటి గురించి ఆ సంస్థ పదే పదే ఆరా తీయడం మొదలెట్టాక బొగ్గు మంత్రిత్వ శాఖనుంచి డజను ఫైళ్ల వరకూ వచ్చిన మాట వాస్తవమే అయినా, అవన్నీ ఈ దర్యాప్తు వ్యవహారానికి సంబంధంలేనివని సీబీఐ చెబుతోంది. ఈ ఫైళ్లు బొగ్గు క్షేత్రాల కేటాయింపుల తర్వాతి దశకు సంబంధించినవని అంటున్నది. ఏ ప్రాతిపదికన కేటాయింపులు చేశారో, అందుకు అనుసరించిన విధానాలేమిటో తెలుసుకోవడానికి ఇవి ఏమాత్రం ఉపయోగపడవు.
 
 ఈ కుంభకోణంలో ప్రభుత్వం వైపునుంచి నాలుగు రకాల తప్పిదాలు జరిగాయి. తొలుత నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు క్షేత్రాలు కేటాయించడం ద్వారా ఖజానాకు తీవ్ర నష్టం కలిగించింది. అటు తర్వాత కోర్టు పర్యవేక్షణలో సాగుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకుని నివేదిక మార్చడానికి ప్రయత్నించి కోర్టు ధిక్కారానికి పాల్పడింది. తమకు అందజేయాల్సిన ఫైళ్లు ఏమయ్యాయో తెలియడంలేదంటున్నారని సీబీఐ చెబితే, అది నిజం కాదన్నట్టు మాట్లాడటం ద్వారా సభను పక్కదోవపట్టించింది. ఫైళ్లు కనబడటంలేదనే కథనాలు నిజమైన పక్షంలో అది సాక్ష్యాధారాలను ధ్వంసంచేయడమే అవుతుంది.
 
 ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా తప్పు మీద తప్పు చేస్తూ యూపీఏ ప్రభుత్వం తనను తానే చులకన చేసుకుంటున్నది. ఫైళ్లు నిజంగా కనబడకపోయిన పక్షంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని ప్రధాని చెప్పడం బాగానే ఉన్నా, అందువల్ల స్కాం దర్యాప్తు మరింత జాప్యం కావడంతప్ప ఒరిగేదేమీ లేదు. అలాంటి చర్యలేమైనా ఉంటే ఈపాటికే మొదలై ఉండాలి. పోయాయని చెబుతున్న ఫైళ్లల్లో ఆయా సంస్థల ఆర్ధిక స్థోమతను అంచనావేసి స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన నివేదిక కూడా ఉంది. ఇవన్నీ వెల్లడైతే తమ బండారం బయటపడుతుందన్న భయంతో కీలక స్థానాల్లో ఉన్నవారే ఫైళ్లు మాయం చేసి ఉండొచ్చునని చెబుతున్నారు.
 
 తమకు ఏ ఫైళ్లు కావాలో సీబీఐ స్పష్టంగా లేఖ రాసినా, దాంతో నిమిత్తంలేకుండా ఇతరేతర ఫైళ్లన్నీ అప్పగించడం బొగ్గు శాఖ అధికారుల అతి తెలివిని పట్టిచూపుతోంది.  2006-09 మధ్య బొగ్గు శాఖను పర్యవేక్షించిన ప్రధానిని సైతం ఈ వ్యవహారంలో ప్రశ్నించవలసి ఉన్నదని సీబీఐ సీనియర్ అధికారి అభిప్రాయపడినట్టు మీడియా కథనాలద్వారా ఇప్పటికే వెల్లడైంది. ఫైళ్ల మాయంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఒక సభ్యుడన్నట్టు ఈ స్కాంపై పూర్తి జవాబుదారీ ప్రధానిదే. ఫైళ్ల మాయంపై తమకు సంబంధమే లేకపోతే, ఆ సంగతి మీడియాలో రాకముందే ప్రభుత్వం తీవ్రంగా స్పందించి ఉండేది. బాధ్యులనుకున్నవారిపై కేసులు పెట్టేది. ఆ పనిచేయలేదు సరిగదా... పార్లమెంటుకు సైతం సరైన సమాచారం ఇవ్వలేదు.  బొగ్గు స్కాం విషయంలో ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించకపోతే మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టవుతుందని యూపీఏ ప్రభుత్వం గుర్తించడం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement