ట్రంప్‌ దుస్సాహసం!

Trump Jerusalem move sparks clashes - Sakshi

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పనీ చేశారు. జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తున్నట్టు, తమ దౌత్య కార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి అక్కడికి తరలిస్తున్నట్టు ప్రకటించారు. ‘ఇజ్రాయెల్‌ సార్వభౌమాధికారం ఉన్న రాజ్యం. అది రాజధానిగా నిర్ణయించుకున్న నగరంలో దౌత్య కార్యాలయం పెట్టడంలో తప్పేముంద’న్న తర్కానికి దిగారు. తన నిర్ణయంలోని ప్రమాదకర పర్యవసానాల నుంచి జనం దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వంలో ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నప్పుడు అందరూ విస్మయపడ్డారు. అయితే అక్కడి ప్రజాస్వామిక వ్యవస్థపై అంచంచల విశ్వాసం ఉన్నవారు దీన్నంతటినీ కొట్టిపారేశారు. అవన్నీ గెలవడానికి ఇచ్చే హామీలే తప్ప వాటి అమలు అమెరికాలాంటి దేశంలో అసాధ్యమన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి?  పేద వర్గాలకు చవగ్గా వైద్య సాయం లభించే ‘ఒబామా కేర్‌’కు మంగళం పాడారు.

ఎందరో నిపుణులు శ్రమకోర్చి అమెరికా, మరో అయిదు అగ్రరాజ్యాలతో ఇరాన్‌ అణు ఒప్పందానికొచ్చేలా ఒప్పిస్తే... ట్రంప్‌ దాని పీకనొక్కే పని ప్రారంభించారు. నిబంధనల ప్రకారం ఆ ఒప్పం దాన్ని ధ్రువీకరించాల్సి ఉండగా దాన్ని నిలిపేశారు. ఆ పరంపరలో భాగంగానే బుధవారం జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించారు. ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న పశ్చిమాసియాలో మరో చిచ్చు రగిల్చారు. రానున్న కాలంలో అది ఉగ్రరూపం దాల్చేందుకు బీజం నాటారు. ఈ ప్రమా దాన్ని పసిగట్టడం వల్లనే అరబ్‌ దేశాలు మాత్రమే కాదు... యూరప్‌ దేశాలు, చైనా, భారత్‌ సైతం ట్రంప్‌ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ నాయకులంతా వివేకమూ, దూరదృష్టి ప్రదర్శించి ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ప్రవర్తించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ హితవు చెప్పారు.

 డోనాల్డ్‌ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియపై  ప్రారంభించాలా వద్దా అన్న అంశంలో డెమొక్రాట్లు తర్జనభర్జన పడుతున్నారని గురువారం వార్తలొచ్చాయి. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వారి అంతర్గత విషయం. కానీ జెరూసలేం విషయంలో ట్రంప్‌ చర్య పర్యవసానంగా ఇవాళ మొత్తం అమెరికాయే ప్రపంచ అభిశంసనను ఎదుర్కొనే దుస్థితిలో పడింది. జెరూసలేం ప్రపంచంలోని క్రైస్తవ, ముస్లిం, యూదు మతానికి చెందిన కోట్లాదిమందికి సమానంగా ఆరాధనీయమైన పవిత్ర స్థలి. ఆ మూడు మతాలకు చెందిన పురాతన చిహ్నాలూ ఆ నగరంలో ఉంటాయి. ట్రంప్‌ అంటున్నట్టు అది ఇప్పటికైతే ఇజ్రాయెల్‌ రాజధానే. అక్కడ ఆ దేశ ప్రధాని నివాసం, దాని పార్లమెంటు భవనం ఉన్నాయి. అయితే అవి నగరంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయని మరువకూడదు. పశ్చిమ జెరూసలేం 1949 నుంచీ ఇజ్రాయెల్‌ అధీనంలో ఉంటున్న ప్రాంతం. ఆ నగరంలోని తూర్పు ప్రాంతంలోకి ఇజ్రా యెల్‌ 1967లో చొరబడి విలీనం చేసుకుంది.

రెండో ప్రపంచయుద్ధం సృష్టించిన విలయాన్ని చల్లార్చడానికి ఐక్యరాజ్యసమితి 1949లో నియమించిన ఆర్మిస్టిస్‌ కమిషన్‌ గీసిన విభజన రేఖ జెరూసలేంని కూడా తాకింది. అందులో పశ్చిమ భాగం ఇజ్రాయెల్‌ వైపుంటే, తూర్పు ప్రాంతం పాలస్తీనాలో ఉంది. ఆ వివాదంపై ఇరుపక్షాలూ కూర్చుని పరిష్కరించుకోవాలన్నది ఆర్మిస్టిస్‌ కమిషన్‌ నిర్ణయం. ఇజ్రాయెల్‌ జెరూసలేంను రాజధానిగా ప్రకటించుకున్నా సమితి సభ్య దేశాలన్నీ ఆర్మిస్టిస్‌ కమిషన్‌ నిర్ణయాన్ని గౌరవించి టెల్‌అవీవ్‌లో తమ దౌత్య కార్యాలయాలను ఏర్పాటుచేసుకున్నాయి. అయితే అమెరికా అధ్యక్షులు మాత్రం ‘గోడ మీద పిల్లివాటం’తీరున అప్పటినుంచీ టెల్‌అవీవ్‌లో దౌత్యకార్యాలయం కొనసాగడానికి వీలుగా ఆర్నెల్లకోసారి మినహాయింపునిచ్చే పత్రాలపై సంతకాలు చేస్తున్నారు.  90వ దశకంలో ఓస్లో వేదికగా ఇజ్రాయెల్‌–పాలస్తీనాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పుడు ఇతర అంశాలకు జెరూసలేం అడ్డు రాకూడదన్న భావనతో దాన్ని భవిష్యత్తు చర్చలకు వదిలిపెట్టారు. 2000 సంవత్సరంలో అప్పటి ఇజ్రాయెల్‌ ప్రధాని ఎహుద్‌ బారక్, ఆనాటి పాలస్తీనా అధినేత అరాఫత్‌లు ఆర్మిస్టిస్‌పై దాదాపు అవగాహనకొచ్చారు. కానీ ఆ నగరం అడుగునున్న సొరంగాల నియంత్రణపై విభేదాలొచ్చి ఒప్పందం నిలిచిపోయింది.

ఇజ్రాయెల్‌ దురాక్రమణతో సర్వం కోల్పోయినా ఆర్మిస్టిస్‌ కమిషన్‌ విభజన రేఖను గౌరవించి తూర్పు జెరూసలేంతో సరిపెట్టుకోవడానికి పాలస్తీనావాసులు అంగీకరించారు. కానీ ఇజ్రాయెల్‌ మొండికేస్తూ వస్తోంది. పాలస్తీనాతో చర్చించడానికీ, ఒప్పందానికి రావడానికీ అంగీకరిస్తూనే... జెరూసలేంలో మాత్రం అంగుళం భూమిని కూడా వదిలేది లేదని పేచీ పెడుతోంది. ట్రంప్‌ కొత్తగా చెప్పిందేమీ లేదని వైట్‌హౌస్‌ అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. జెరూసలేంకున్న సరిహద్దుల్ని గుర్తించబోమని ఆయన అనలేదని వాదిస్తున్నారు. వైఖరి మారనట్టయితే జెరూసలేంలోని తూర్పు ప్రాంతంవైపు వెళ్లొద్దని ట్రంప్‌ ప్రకటనకు ముందు తన పౌరులకు అమెరికా ఎందుకు హెచ్చరికలు జారీ చేసినట్టు? ఆయన ప్రకటనతో అమెరికాపై ఆగ్రహజ్వాలలు రగలవచ్చునని వారెందుకనుకున్నారు? పైకి ఏం చెప్పినా ఇజ్రాయెల్‌కు తాను తిరుగులేని మద్దతుదారునని అమెరికా ఇప్పుడు ‘అధికారికంగా’ రుజువు చేసుకుంది.

ఈ సమస్యలో మధ్యవర్తి పాత్రను అది కోల్పోయింది. తనకు తాను తీవ్రమైన నష్టం కలగజేసుకుంది. ట్రంప్‌ తాజా చర్యతో ఇప్పటికే గాజా స్ట్రిప్‌లోనూ, బీరూట్, లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్ధి శిబిరాల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి. ఈ పరిస్థితిని తమకనుకూలంగా మలచుకోవడానికి ఐఎస్‌లాంటి ఉగ్రవాద సంస్థలు సహజంగానే ప్రయత్ని స్తాయి. ఆ విషయంలో అవి విజయం సాధిస్తే అమెరికా మతిమాలినతనం వల్ల పశ్చిమాసియాలో మరో పెద్ద ఉపద్రవం వచ్చిపడినట్టే లెక్క. ప్రపంచ దేశాలన్నీ ఏకమై మీ వెంట మేముంటామని పాలస్తీనా పౌరులకు భరోసా కల్పించడం, అమెరికా ప్రజానీకం యావత్తూ పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించడం తక్షణావసరం. అవి ఎంతో కొంత మేర నష్ట నివారణకు తోడ్పడతాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top