లాక్‌డౌన్‌కు మరిన్ని సడలింపులు?

Sakshi Editorial On Lockdown Relaxations

ఆరు రోజుల్లో రెండో దశ లాక్‌డౌన్‌ గడువు ముగుస్తుండగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ పర్వం మొదలయ్యాక ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడటం ఇది నాలుగోసారి. నలుగురు ముఖ్యమంత్రులు మినహా మిగిలినవారు లాక్‌డౌన్‌ను సడలించడం అవసర మని చెప్పడంతోపాటు, రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరాన్ని కేంద్రం దృష్టికి తీసుకొ చ్చారు. ఈ మహమ్మారిపై పోరాడుతూనే దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రీకరించాల్సివుంటుందని ప్రధాని కూడా అంగీకరించి, లాక్‌డౌన్‌ పరిమితులను సడలించే ఉద్దేశం వున్నదని సూచనప్రాయంగా తెలియ జేయడం అందరికీ ఉపశమనం కలిగిస్తుంది.

ఔఅయితే అంతమాత్రాన యధాపూర్వ స్థితి ఏర్పడు తుందన్న భరోసా లేదు. జూన్‌, జూలై నెలల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభించే అవకాశం వున్నదని మోదీ హెచ్చరించారు గనుక నిరంతర జాగురూకతలో అందరూ మెలగవలసి వుంటుంది. గత మూడు దఫాల సమావేశాల్లో అభిప్రాయాలు చెప్పడం సాధ్యంకాని తొమ్మిది రాష్ట్రాల సీఎంలకు ఈసారి మాట్లాడే అవకాశం లభించగా, మిగిలిన సీఎంలు తమ మనోగతాలను లిఖితపూర్వకంగా తెలియజేశారు. మార్చి 23 నుంచి అమల్లోకొచ్చిన లాక్‌డౌన్‌ నలభై రోజులకు చేరువవుతుండగా కరోనా మహమ్మారి పూర్తిగా నియంత్రణలోకొచ్చిన దాఖలా లేదు. దాని తీవ్రత కొంతమేర తగ్గడం ఉన్నంతలో ఊరటనిస్తుంది. ఇంతవరకూ దేశవ్యాప్తంగా 377 జిల్లాల్లో కరోనా ప్రభావం ఉండగా, ఆదివారానికి ఆ సంఖ్య 429కి చేరుకుంది. 

కాస్తయినా సమయం ఇవ్వకుండా ఒక్కసారిగా లాక్‌డౌన్‌ను ప్రకటించడం వల్ల సాధారణ పౌరులు ఇబ్బందుల్లో పడటం వాస్తవం. ముఖ్యంగా వలస కార్మికులు, కూలీలు ఎటూ కదల్లేక, ఉన్న చోట గూడు కరువై, సాపాటుకు సమస్యలెదురై చెప్పనలవికాని కష్టాలుపడ్డారు. ఇప్పటికీ దేశంలో ఏదో ఒక మూల నడక దారిన స్వస్థలాలకు వెళ్లే జనం కనబడుతూనే వున్నారు. అయితే ఈ లాక్‌డౌన్‌ ఎంతోమంది ప్రాణాలు కాపాడిందన్నది కూడా వాస్తవం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 30,000 లోపు వుంది. లాక్‌డౌన్‌ లేకుంటే ఇది లక్షకంటే ఎక్కువుండేదని నిపుణులు చెబుతున్నారు. అత్యవసర సందర్భాల్లో పౌరుల్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో, రోగుల్ని ఆసుపత్రులకు, అనుమానాస్పద కేసుల్ని పర్యవేక్షణ కేంద్రాలకు తరలించడానికి, వైద్య రంగ నిపు ణులను సమీకరించడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఈ లాక్‌డౌన్‌ విలువైన పాఠాలు నేర్పింది.

వైరస్‌లు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో, చిన్న పొరపాటు సైతం ఎలా కొంపముం చుతుందో సామాన్యులకు కూడా అర్థమైంది. అయితే దేశమంతా ఒకే స్థితి లేదు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువుంటే, మరికొన్నిచోట్ల దాని జాడలేదు. వైరస్‌ ప్రభావం బాగా ఎక్కు వున్న రాష్ట్రాల్లో సైతం కొన్ని జిల్లాల్లో పరిమిత ప్రాంతాల్లో వ్యాధి కనబడుతోంది. ఇలా భిన్న పరిస్థితులున్న దేశంలో అన్ని రాష్ట్రాలకూ, అన్ని ప్రాంతాలకూ వర్తించే ఒకే రకమైన విధానం అమలు చేయడం నిరర్థకం మాత్రమే కాదు... ప్రమాదకరం కూడా. బతుకు బండి సాగుతుంటేనే, ఆర్థిక వ్యవ స్థకు ఊపిరాడుతుంది. నిరవధికంగా ఆగిపోతే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. రోగి ప్రాణాపా యంలో వున్నప్పుడు ఐసీయూకి తరలిస్తారు. చికిత్సకు సక్రమంగా స్పందిస్తూ, మెరుగుపడుతున్న సూచనలు కనబడితే సాధారణ వార్డుకి తీసుకొస్తారు. లాక్‌డౌన్‌ సడలింపులోనూ ఈ రీతిగానే ఆలోచించక తప్పదు. కరోనా వైరస్‌ 3.4 రోజులకొకసారి రెట్టింపుమందికి విస్తరిస్తున్న సమయంలో లాక్‌డౌన్‌ విధించారు.

అదిప్పుడు 12 రోజులకు పెరిగింది. మరణాల రేటు కూడా తక్కువ. కోలుకుం టున్నవారి సంఖ్య సైతం పెరుగుతోంది. ఇప్పుడు కూడా లాక్‌డౌన్‌ యధావిధిగా కొనసాగాలన్న వాదనలో అర్థం లేదు. అయితే రెడ్‌జోన్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో ఎలాంటి సడలింపులూ ఇవ్వకుండా మరింత పటిష్టంగా అమలు చేయక తప్పదు. అక్కడ కూడా పూర్తిగా కట్టడి చేయాల్సిన ప్రాంతమేదో, కొంతమేర కదలికలకు అవకాశం ఇవ్వదగిన ప్రాంతమేదో గుర్తించడం తప్పనిసరి. అలాగే ఆరెంజ్‌ జోన్‌లో కొంత మేరకు సడలింపులివ్వడం, గ్రీన్‌జోన్‌లో కొన్ని ముందు జాగ్రత్తలతో కార్యకలాపాలు కొనసాగేలా చూడటం అవసరం. ఆరెంజ్, గ్రీన్‌ జోన్‌లలో భౌతిక దూరం పాటించ డంతోపాటు, జనం ఎక్కువగా గుమిగూడటానికి ఆస్కారం వుండే వ్యాపార కార్యకలాపాలను మరికొన్నాళ్లపాటు పూర్తిగా నిలిపివేయక తప్పదు. మాస్కుల వాడకం కొన్నేళ్లపాటు తప్పనిసరి చేయడం, వాటిని ధరించనట్టయితే చర్యలు తీసుకోవడం వంటి నిబంధనలు అమల్లోకి తీసుకు రావాల్సి వుంటుంది. రాష్ట్రాలమధ్య పౌరుల కదలికలను మరికొంతకాలం నిలిపివుంచకతప్పదని, రైళ్లు, విమానాలు, బస్సులు రాకపోకలుండవని మోదీ చెప్పడం సరైందే.

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బాగుందని, దానిపై కలతపడొద్దని నరేంద్ర మోదీ ముఖ్య మంత్రులకు సూచించారు. మంచిదే. అయితే దానికి తగినట్టు రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించే విషయమై ఆలోచిస్తున్నామనిగానీ, ఫలానావిధంగా చేస్తామన్న హామీగానీ ఇచ్చివుంటే మరింత బాగుండేది. అయితే ఈసారి వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొన డాన్నిబట్టి ఆ దిశగా కేంద్రం దృష్టి సారిస్తున్నదన్న ఆశ కలుగుతోంది. ఉన్న వనరులన్నిటినీ కరోనా వైరస్‌ తీవ్రతను అరికట్టడానికి వెచ్చించి ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకపక్క రావాల్సిన ఆదాయం పడిపోయి, మరోపక్క వ్యయం అమాంతం పెరిగి దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఇప్పటికైనా కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎలాంటి ఆర్థిక సాయం అందబోతున్నదో తెలియజెప్పడం అవసరం. కరోనా మహమ్మారిపై పోరాటం సమష్టిగా, పటిష్టంగా కొనసాగడానికి ఇది తోడ్పడుతుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top