ఇతర లక్షణాల మాట అటుంచి కనీసం ఎప్పుడేమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియనివారు రాజకీయాల్లో రాణించలేరు.
సంపాదకీయం: ఇతర లక్షణాల మాట అటుంచి కనీసం ఎప్పుడేమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియనివారు రాజకీయాల్లో రాణించలేరు. దురదృష్టమనాలో, శాపమనాలోగానీ ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ రూపంలో సరిగ్గా అలాంటి వ్యక్తి సారథిగా దొరికారు. కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించకపోయినా... రాహుల్ స్వయంగా పదే పదే తిరస్కరిస్తున్నా ఆయనే తమ ప్రధాని అభ్యర్థని కాంగ్రెస్ శ్రేణులంతా నిర్ణయాని కొచ్చేశాయి. కనీసం వారలా అనుకుంటున్నందుకైనా కాస్త వెనకా ముందూ చూసి మాట్లాడాలని రాహుల్‌కు తోచడంలేదు. నేర చరితులైన చట్టసభల సభ్యులపై అనర్హత వేటు పడకుండా కాపాడేందుకు ఉద్దేశించి యూపీఏ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌పై రాహుల్‌గాంధీ శుక్రవారం మాట్లాడిన తీరు దాన్నే మరోసారి రుజువుచేసింది. ఆర్డినెన్స్‌ను ఆయన ‘నాన్సెన్స్’ అంటూ కొట్టిపారేశారు. దాన్ని చించి అవతలపారేయాలన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేసిందన్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీవారే కాదు... సామాన్యులు సైతం బిత్తరపోయారు. లోగడ మాట్లాడిన మాటల సంగతేమోగానీ... ఇప్పుడు మాత్రం ఇరకాటంలో పడిన కాంగ్రెస్‌ను ఒడ్డున పడేయడానికే ఆయనలా అన్నారని విశ్లేషకులు అంటున్నా ఆ క్రమంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ పరువు ప్రతిష్టలు మాత్రం పూర్తిగా మసకబారాయి. ఆయనా, ఆయన మంత్రివర్గ సహచరులు నేరస్తులను కాపాడటానికి తాపత్రయపడినవారిగా ముద్రపడ్డారు. ఆర్డినెన్స్ మంచిచెడ్డలపై చాలామంది చాలా అభిప్రాయాలు చెబుతున్నారు. అలా చెప్పడానికి రాహుల్‌గాంధీకి కూడా హక్కుంది. దానినెవరూ కాదనలేరు. కానీ, ఆయన యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి ఉపాధ్యక్షుడు. అంతకన్నా మించి ఆ పార్టీకి అధినేతగా, యూపీఏ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న సోనియాగాంధీ కుమారుడు. పైగా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిననాటి నుంచి ఆ అంశంపై అన్ని పార్టీల్లోనూ, అన్ని వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలి, అప్పీల్‌కు వెళ్లిన ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పిస్తున్న సెక్షన్ 8(4) చెల్లదని జూలై 10న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
సాధారణ వ్యక్తులకు క్రిమినల్ కేసుల్లో శిక్ష పడినప్పుడు చట్టసభలకు పోటీచేయకుండా నిరోధించే చట్ట నిబంధన ఉన్నప్పుడు పదవుల్లో ఉన్నవారికి ఇలాంటి మినహాయింపునివ్వడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. అయితే, ఇలా చేయడమంటే, కిందిస్థాయి కోర్టులిచ్చే తీర్పులను తుది తీర్పులుగా పరిగణించడమేనన్న అభిప్రాయాలున్నాయి. ఇందుకు బదులు చట్టసభల సభ్యులపై ఆరోపణలొచ్చే సందర్భాల్లో సత్వర విచారణ జరిపి తీర్పులిచ్చే విధానాన్ని అమలులో పెడితే బాగుంటుందన్న సూచనలు కూడా వచ్చాయి. ఈ విషయంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ యూపీఏ ప్రభుత్వం దాఖలుచేసిన రివ్యూ పిటిషన్‌ను ఈ నెల 4న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈమధ్యలో అఖిలపక్ష సమావేశం జరిగింది. చట్టసభల సభ్యుల రక్షణకు చర్య అవసరమని అందులో దాదాపు అన్ని పార్టీలూ అభిప్రాయపడ్డాయి. ఈ 2 నెలల 25రోజుల వ్యవధిలోనూ రాహుల్‌గాంధీ ఈ అంశంపై పార్టీలోగానీ, వెలుపలగానీ ఏ వేదికపైనా ఎన్నడూ మాట్లాడలేదు. తన అభిప్రాయమేమిటో చెప్పలేదు.
ఆర్డినెన్స్ జారీకి వ్యతిరేకంగా గురువారం రాష్ట్రపతి వద్దకు ప్రతినిధి బృందంగా వెళ్లిన బీజేపీ దానిపై సంతకం చేయొద్దని ఆయనను అభ్యర్థించింది. నేర రాజకీయ వేత్తలను కాపాడటానికి ప్రభుత్వం ప్రయత్నించిందంటూ విరుచుకు పడింది. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో, ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి తిప్పిపంపితే ఏంచేయాలో తోచక కాంగ్రెస్ కళవళపడుతుంటే హఠాత్తుగా రాహుల్‌గాంధీ నోరు తెరిచారు. ఇలా మాట్లాడటం రాహుల్‌కు కొత్త కాదు. తానెవరో, ఏమిటో తెలియనట్టుగా గతంలోనూ ఆయన మాట్లాడారు. ఆయన తనకు వారసత్వంగా వచ్చిన పదవులను చేపడతారు. తన పలుకుబడిని వినియోగించి ఆశ్రీతులకు పార్టీలోనూ, ప్రభుత్వాల్లోనూ పదవులిప్పిస్తారు. ఎన్నికల సమయంలో ఎవరెవరికి టిక్కెట్లివ్వాలో నిర్ణయిస్తారు. ఇన్నీ చేస్తూ వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమంటారు. ప్రతిభనుబట్టి అవకాశాలు రావాలితప్ప ఇతరేతర విధానాలు ప్రామాణికం కారాదంటారు. మా కుటుంబం తల్చుకుంటే ఏమైనా చేయగలదని... నాయనమ్మ ఇందిరాగాంధీ పాకిస్థాన్‌ను విడగొట్టి బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడం ఇందుకు ఉదాహరణ అంటారు. గుప్పెడు మంది మాత్రమే రాజకీయాలను శాసిస్తున్నారంటారు. ఈ పద్ధతి మార్చాలంటారు. అన్నిటినీ త్యజించి రాహుల్ ఇలా మాట్లాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, అన్నీ తానే చేస్తూ, చేసే స్థానంలో ఉంటూ బయటి వ్యక్తిగా, తటస్థుడిగా మాట్లాడటంతోనే చిక్కంతా వస్తుంది.
ఇప్పుడు మన్మోహన్‌సింగ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ప్రభుత్వంపై దాడిచేయడానికి రాహుల్ ఈ సమయాన్ని ఎంచుకోవడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకపక్క జరుగుతున్న పరిణామాలపై యూపీఏ ప్రభుత్వం నిర్ఘాంతపోయి ఉన్నది. పోయి పోయి ఈ ఊబిలో ఎలా చిక్కుకుపోయామా అని మథనపడుతున్నది. ఈ దురవస్థ నుంచి పార్టీని బయటపడేయటానికి మన్మోహన్‌ను బలిపెట్టడమే మార్గమని రాహుల్ భావించారా? అలా భావించి ఉంటే మరి మన్మోహన్ ప్రతిష్ట మాటేమిటి? ఆయనకు మెతకస్వభావుడన్న ముద్ర ఉంది. చాలా ముక్తసరిగా మాట్లాడతారన్న విమర్శలున్నాయి. ఆ పదవికి అవసరమైన ప్రజా సంబంధాలను ఆయన పాటించరని వ్యాఖ్యానించేవారూ ఉన్నారు. ఇన్నివున్నా మన్మోహన్ నేరస్తులకు అండదండలిస్తారని మాత్రం ఎవరూ అనలేరు. కానీ, రాహుల్ మాట్లాడిన తీరు, ఆయన వాడిన భాష ప్రధానిపై అలాంటి అభిప్రాయాన్ని కలిగించాయి. ఉద్దేశాలు ఎంత గొప్పవైనా వ్యక్తం చేసే తీరు హుందాగా ఉండాలి. అలా ఉండాలంటే ఆ మాట్లాడేవారిలో పరిణతి ఉండాలి. రాహుల్‌లో అది లోపించిందని మరోసారి రుజువైంది.