పాక్‌ కోర్టు అత్యుత్సాహం

Pak Supreme Court Sentenced 10 Years Jail To Ex Prime Minister Nawaz Sharif - Sakshi

పాకిస్తాన్‌లో వ్యవస్థలు దిగజారడం, విశ్వసనీయత కోల్పోవడం కొత్త కాదు. తాజాగా పనామా పత్రాల వ్యవహారంలో పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(పీఎంఎల్‌)–ఎన్‌ అధినేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు, ఆయన కుమార్తె మరియంకు ఆదరా బాదరాగా జైలుశిక్షలు విధిస్తూ వారి పరోక్షంలో అక్కడి కోర్టు వెలువరించిన తీర్పు దానికి కొనసాగింపే. పాకిస్తాన్‌ అకౌంటబిలిటీ కోర్టు షరీఫ్‌కు పదేళ్లు, ఆయన కుమార్తె మరియంకు ఏడేళ్లు జైలు శిక్షలు విధించింది. అంతక్రితం మాటెలా ఉన్నా 2007లో ఆనాటి మిలిటరీ పాలకుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికర్‌ మహమ్మద్‌ చౌధురిని, మరో 60మంది న్యాయమూర్తులను పదవులనుంచి తొలగించి అరెస్టు చేసిన ప్పుడు అక్కడి న్యాయవ్యవస్థ పోరాడిన తీరు దాని ప్రతిష్టను అమాంతం పెంచింది.

ఆయనను, ఆయన సహచర న్యాయమూర్తులను 2009లో తిరిగి నియమించే వరకూ ఆ పోరాటం సాగింది. కానీ క్రమేపీ న్యాయవ్యవస్థ పాత ధోరణిలోకి తిరోగమించడం మొదలుపెట్టింది. గతంలో పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు అత్యుత్సాహంతో వ్యవహరించింది. 2012లో పీపీపీకి చెందిన ప్రధాని యూసఫ్‌ రజా గిలానీని కోర్టు ధిక్కారం కింద పదవినుంచి తొలగించి, ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రధానిని సైతం ముప్పుతిప్పలు పెట్టింది. అక్రమార్జనతో లండన్‌లోనూ, ఖతార్‌లోనూ షరీఫ్‌ కుటుంబం విలాసవంతమైన భవనాలు, ఇతర ఆస్తులు సమకూర్చుకున్నదని, పరిశ్రమలు స్థాపించిందని 2016లో వెల్లడైన పనామా పత్రాలు బట్టబయలు చేశాయి.

అయితే వీటిల్లో నవాజ్‌ షరీఫ్‌ పేరు లేదు. ఆయన కుమార్తె మరియం, కుమా రులు హుస్సేన్, హసన్‌ల ప్రస్తావన ఉంది. ఈ ఆస్తులెలా వచ్చాయో షరీఫ్‌ కుటుంబం, ప్రత్యేకించి నవాజ్‌ షరీఫ్‌ సంజాయిషీ ఇవ్వాల్సిందే. అయితే అలా సంజాయిషీ ఇవ్వాల్సిన జాబితాలో ముషా ర్రఫ్‌ అగ్రస్థానంలో ఉంటారు. సైన్యంలో ఇప్పుడు అగ్ర స్థానాల్లో కొనసాగుతున్నవారూ, ఇంతక్రితం పనిచేసి రిటైరైనవారూ కూడా ఉంటారు. వారందరి విషయంలోనూ ఉలుకూ పలుకూ లేకుండా ఉండి పోయిన న్యాయవ్యవస్థ నవాజ్‌ షరీఫ్‌ దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని ఉత్సాహాన్నీ ప్రదర్శించింది.

ఆయన పేరు నేరుగా లేకపోయినా, అసలు కేసులు నమోదై దర్యాప్తు సాగకముందే, వాటిపై న్యాయ స్థానాల్లో విచారణ జరగకముందే నవాజ్‌ షరీఫ్‌ ప్రజాప్రతినిధిగా అనర్హుడవుతారని పాక్‌ సుప్రీంకోర్టు «నిర్ణయానికొచ్చింది! ఆ తర్వాత కేసు దర్యాప్తు, అకౌంటబిలిటీ కోర్టులో విచారణ కూడా చకచకా సాగిపోయాయి. తమకు మరికాస్త సమయం కావాలన్న వినతిని న్యాయస్థానం పట్టించుకోకపోవ డంతో ఈ కేసుల వకాల్తాను వదులుకుంటున్నట్టు షరీఫ్‌ న్యాయవాదులు ఇటీవల ప్రకటించారు. అయినా ఆ కోర్టు నదూరూ బెదురూ లేకుండా విచారణ కొనసాగించి జైలు శిక్షలు విధించింది.

షరీఫ్‌పై ఇంత త్వరగా తీర్పు ఎందుకు వెలువడిందో, ఇది ఎవరికి అవసరమో పాక్‌ ప్రజలకు బాగా తెలుసు. ఈ నెల 25న జరగబోయే పాకిస్తాన్‌ ఎన్నికల్లో షరీఫ్‌ పార్టీ పీఎంఎల్‌–ఎన్‌ పరువుతీసి దాని విజయావకాశాలను దెబ్బతీయడం, పాకిస్తాన్‌ సైన్యం ఆశీస్సులున్న మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఏ–ఇన్సాఫ్‌(పీటీఐ)ను గద్దెనెక్కించడం ఈ తీర్పు పరమావధి. పాక్‌ రాజకీయాల్లో కొద్దో గొప్పో ప్రాబల్యం ఉన్న పార్టీ నవాజ్‌ షరీఫ్‌దే. బేనజీర్‌ భుట్టో మరణించాక ఆ సానుభూతితో పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) విజయం సాధించినా అవినీతి ఆరోపణలవల్లా, నాయకత్వ లేమివల్లా పూర్తిగా చతికిలబడింది.

షరీఫ్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా ఇమ్రాన్‌ఖాన్‌ను రూపొందించాలని సైన్యం తెరవెనక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు షరీఫ్‌కు జైలు శిక్ష విధించి, ఆయన పార్టీకి నాయకత్వం లేకుండా చేస్తే జనం ఇమ్రాన్‌నే ఎంచు కుంటారని సైన్యం భావిస్తోంది. నిజానికి నవాజ్‌ షరీఫ్‌తో అక్కడి సైన్యానికి వేరే తగవులున్నాయి. ఇతర పాలకులతో పోలిస్తే  సైన్యం ఆటలు ఆయన పెద్దగా సాగనీయలేదు. మన దేశంతో మెరుగైన సంబంధాల కోసం షరీఫ్‌ ఎంతగానో ప్రయత్నించారు. వాటన్నిటినీ సైన్యం వమ్ము చేసింది. ఇరు దేశాల మధ్యా చర్చల తేదీలు ఖరారు కాగానే సరిహద్దుల్లో సైన్యం ఆగడాలకు పాల్పడటం, ఇరు దేశాల మధ్యా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి ఆ చర్చలు వాయిదా పడేలా చేయటం దానికి రివాజు.

సైన్యం వ్యవహారశైలి వల్ల అంతర్జాతీయ వేదికల్లో ఏకాకులవుతున్నామని, దీన్ని సరిచేయా లని షరీఫ్‌ భావించారు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా ప్రకటించినవారికి అండదండలెలా అంది స్తారని 2016లో ఒక సమావేశంలో సైన్యాన్ని ఆయన గట్టిగా నిలదీశారు. ఇది మీడియాలో వెల్లడి కావడంతో సైన్యం ఆయనపై కక్ష పెంచుకుంది. దీనికితోడు 1999లో తాను ప్రధానిగా ఉన్నప్పుడు సైనిక కుట్రతో తనను అధికారం నుంచి తొలగించిన ముషార్రఫ్‌పై కేసు నమోదు చేసి విచారణ జర పాలని షరీఫ్‌ నిర్ణయించారు. ఇది కూడా సైన్యానికి ఆగ్రహం తెప్పించింది. అందుకే పనామా పత్రాల కేసు ఇంత శరవేగంతో కదిలింది.

ఈ కారణాలన్నిటివల్లా సైన్యానికి షరీఫ్‌పై ఆగ్రహం ఉండటాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ దాని ప్రయోజనాలు నెరవేర్చడం కోసం న్యాయవ్యవస్థ తన విశ్వసనీయతను పణంగా పెట్టడమే ఆశ్చ ర్యకరం. అధికారంలో ఉన్నవారిపై ఆరోపణలొచ్చినప్పుడు ఆ కేసుల్ని విచారించడం తప్పేమీ కాదు. కానీ ఆ విచారణ క్రమం పారదర్శకంగా, సందేహాతీతంగా ఉండాలి. తీర్పు ప్రామాణికంగా ఉండాలి. కానీ న్యాయవ్యవస్థ వాటి విషయంలో పట్టింపు లేనట్టు వ్యవహరించింది. ఇప్పుడు విధించిన శిక్షలపై షరీఫ్‌ హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న షరీఫ్, ఆయన కుమార్తె దేశం తిరిగొచ్చి దీనిపై పోరాడతామంటున్నారు. మంచిదే. వ్యవస్థలపై పాక్‌ సైన్యం పట్టు బిగుసుకుంటుండటం ప్రజాస్వామ్యానికి చేటు కలిగించే అంశం. ఇక ఈనెల 25న జరిగే ఎన్ని కలు ఎంత సవ్యంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top