ఉదారత ఇప్పటి అవసరం

IMF Executive Board Meeting Amid Corona Outbreak - Sakshi

భూగోళాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్‌కు ధనిక, బీద దేశాల తారతమ్యత లేదు. కానీ అన్ని దేశాలూ ఆ మహమ్మారిని ఒకే తీరున ఎదుర్కొనే పరిస్థితి లేదు. డబ్బున్న దేశాలు నయానో భయానో తమకు కావలసినవి సమకూర్చుకుంటున్నాయి. గండం గడవడానికి సమృద్ధిగా ఖర్చు చేస్తున్నాయి. అమెరికా అయితే ఒకటికి రెండుసార్లు చైనా నుంచి వేరే దేశాలకు పోవాల్సిన మాస్క్‌లు, వైద్య ఉపకరణాలు హైజాక్‌ చేసి తీసుకుపోయింది. మన దేశం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతిని నిలుపుదల చేస్తే, ఒత్తిడి తెచ్చి మళ్లీ పునరుద్ధరించేలా చేసింది. పేద దేశాలు వున్న వనరులతోనే, ఆ పరిమితుల్లోనే పౌరుల ప్రాణాలు కాపాడుకునేందుకు శక్తికొద్దీ పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో మూడు రోజుల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశం కాబోతోంది. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న బీభత్సం కారణంగా ప్రపంచ మార్కెట్లన్నీ దెబ్బతిన్నాయని, ఆర్థిక వ్యవస్థ లన్నీ తలకిందులవుతున్నాయని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జీవా వారంరోజులక్రితం ప్రకటించారు. ఆ సంస్థలో 189 సభ్య దేశాలుండగా దాదాపు వంద దేశాలు తమకు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాయి. ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేసుకునేందుకు, వైద్య సేవల్లో నిమగ్న మైనవారికి వైద్య ఉపకరణాలు, మాస్క్‌లు అందించడానికి, వారికి వేతనాలు చెల్లించడానికి రుణం అవసరమని ఈ దేశాలు కోరుతున్నాయి.

దీంతోపాటు పాత బకాయిల చెల్లింపును వాయిదా వేయా లని,  కొంత భాగాన్ని రద్దు చేయాలని బలంగా కోరుతున్నాయి. ఎందుకంటే 64 దేశాలు వైద్య రంగంపై కన్నా ఐఎంఎఫ్‌ బకాయిల చెల్లింపునకే అధికంగా ఖర్చు చేయాల్సివస్తోంది. ఈలోగా కరోనా వైరస్‌ పంజా విసరడంతో ఆ దేశాలు అనిశ్చితిలో పడ్డాయి. పాకిస్తాన్, అంగోలా, శ్రీలంక, గాంబియా, కాంగో, ఘనా, లెబనాన్, కామెరూన్, లావోస్‌ వంటివి ఈ చిట్టాలో వున్నాయి. ఇవన్నీ వాటి ఆదాయంలో 20 శాతాన్ని పాత బకాయిల చెల్లించడానికి ఖర్చు పెడుతున్నాయి. అదే సమయంలో వైద్య రంగానికి  అవి పది శాతం మొత్తాన్ని కూడా కేటాయించలేకపోతున్నాయి. అసలే అంతంతమాత్రంగా వున్న ఆర్థిక వ్యవస్థతో ఈదుకొస్తున్న బంగ్లాదేశ్‌ మయన్మార్‌ నుంచి వచ్చిపడిన రోహింగ్యా శరణార్థులతోనే సతమతమవుతుండగా ఆ కష్టాలను కరోనా మహమ్మారి మరింత పెంచింది. తాము చెల్లించాల్సిన బకాయిలను వాయిదా వేయడం లేదా కొంత మొత్తాన్ని రద్దు చేయడం అవసరమని ఈ దేశాల్లో అనేకం కోరుతున్నాయి. 

నిజానికి ఈ కరోనా మహమ్మారి తొలుత సంపన్న దేశాలను తాకింది. ఆ తర్వాత పేద దేశాలపై విరుచుకు పడింది. అన్నిచోట్లా మరణమృదంగాన్ని మోగించడంతోపాటు భిన్న రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. డిమాండు, సరఫరాల మధ్య నిరంతరం వుండాల్సిన సంబంధాన్ని ఇది దెబ్బ తీసింది. ఈ సంక్షోభం తాత్కాలిక దశగానే వుండాలి తప్ప, శాశ్వత సంక్షోభంగా మారకూడదని... ఉపాధి దెబ్బతిని, దివాళా తీసి జనం ఇక్కట్లపాలు కాకూడదని అన్ని దేశాలూ బలంగా కోరుకుం టున్నాయి. ఆర్థిక సంక్షోభం అందరిలోనూ అశాంతి సృష్టించి, అది శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తే అన్ని సమాజాలు అస్తవ్యస్థమవుతాయి. కనుకనే ఇప్పుడు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు తదితర సంస్థలతోపాటు ధనిక దేశాలు కూడా రంగంలోకి దిగి ఆదుకోవాల్సిన అవసరం వుంది. మొట్టమొదట కరోనా బారినపడిన చైనాలో తయారీ రంగం, సేవారంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఫిబ్రవరి నెలలో ఆ రంగాలు రెండూ కళ్లు తేలేశాయి. చైనా సంపన్న దేశం గనుక ఆ రెండు రంగాలూ యధావిధిగా తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. కానీ ప్రపం చమంతా సంక్షోభంలో వున్నప్పుడు అవి మునుపటిలా సమర్థవంతమైన ఫలితాలనీయడం సాధ్యం కాదు.

కనుక ప్రపంచంలో ఒక దేశమో, ఒక ప్రాంతమో కోలుకుంటే సరిపోదు. అన్ని దేశాలూ సాధారణ స్థితికి చేరాలి. ప్రపంచ పౌరులందరిలో కొనుగోలు శక్తి పెరగాలి. ఇందుకు ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, జీ–20వంటివి ప్రధాన పాత్ర పోషించవలసివుంటుంది. కేవలం లాభార్జన దృష్టితో కాక ప్రపంచ దేశాలన్నీ మళ్లీ మెరుగైన స్థితికి చేరాలన్న లక్ష్యంతో పనిచేసినప్పుడే మంచి ఫలితా లొస్తాయి. మన దేశంతోపాటు దక్షిణాసియా దేశాల్లో ఈ నాలుగు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో వృద్ధి మందగించబోతున్నదని ప్రపంచబ్యాంకు ప్రకటించింది. ఈ దేశాలన్నీ 1.8 శాతం నుంచి 2.8 శాతం లోపు మాత్రమే వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉన్నదని ఆ సంస్థ అంచనా వేస్తోంది. ఈ సందర్భంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పడ్డ అంతర్‌ సంస్థల టాస్క్‌ఫోర్స్‌ అభివృద్ధి సాధనకు పెట్టుబడులు పెట్టడం అనే అంశంపై రూపొందించిన నివేదిక గురించి చెప్పుకోవాలి.

ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు తదితర 60 అంతర్జాతీయ సంస్థలున్న ఆ టాస్క్‌ఫోర్స్‌ ప్రపంచ ఆర్థిక విపత్తును నివారించేందుకు అనేక సూచనలు చేసింది. ఆహారం, మందులు వంటి ప్రజల మౌలిక అవసరాలు తీర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు విపత్తులను ఎదుర్కొనడానికి వర్థమాన దేశాలను సంసిద్ధం చేసే దిశగా కార్యక్రమాలు అమలు చేయాలని ప్రతిపాదించింది. ప్రపంచంలో అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు 44 వున్నాయి. ఈ దేశాలకు అందే ఆర్థిక సాయం నానాటికీ కుంచించుకుపోతూవుంది. 2018లో ఈ సాయం అంతక్రితంకంటే 4.3 శాతం తగ్గిపోయింది. ఈ ధోరణి మారకపోతే ప్రమాదకర పర్యవసానాలు ఏర్పడతాయి. ఈ మహమ్మారి అంతరించేసరికి 780 కోట్ల ప్రపంచ జనాభాలో సగంమంది పేదరికంలో మగ్గవలసి వస్తుందని ఆక్స్‌ఫాం సంస్థ ఈ మధ్యే అంచనా వేసింది. కనుక ముంచుకొస్తున్న ఈ పెను ముప్పును గ్రహించి నిరుపేద దేశాలకు ఉదా రంగా ఆర్థిక సాయం అందించేందుకు సంపన్న దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఉదారంగా ముందుకు రావాలి. ఐఎంఎఫ్‌ ఈ విషయంలో చొరవ తీసుకుని అందరికీ మార్గదర్శకం కావాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top