అరుణాచల్‌లో ఆగ్రహాగ్ని

Editorial On Why Arunachal Pradesh Burning - Sakshi

ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల మధ్య వైరం, ఆయా జాతుల్లో అభద్రతాభావం ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి పౌరసత్వ చట్టం సవరణ బిల్లుపై రెండు నెలలపాటు అక్కడ మహో ధృతంగా సాగిన ఉద్యమాలు తేటతెల్లం చేశాయి. ఇప్పుడు తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో సైతం ఆ మాదిరి సమస్యపైనే జనం ఆగ్రహోదగ్రులు కావడం గమనిస్తే ప్రభుత్వాలు ఎంత సున్నితంగా ఆలోచించాలో, వ్యవహరించాలో అర్ధమవుతుంది. ఆరు ఆదివాసీ తెగలకు శాశ్వత నివాస ధ్రువీ కరణపత్రాలు(పీఆర్‌సీ) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సు గత గురువారం వెల్లడైన వెంటనే అక్కడ నిరసనలు మిన్నంటాయి. ఉద్యమ తీవ్రత చూసి కర్ఫ్యూ విధించి, సైన్యాన్ని రప్పించినా ఇవి ఆగలేదు. చివరకు ఆ కమిటీ సిఫార్సుపై తదుపరి చర్యలు తీసుకోబోమని, అది ముగిసిన అధ్యాయమని ఆదివారం ప్రభుత్వం ప్రకటించాక పరిస్థితి చక్కబడింది. కానీ ఈలోగా ఇటానగర్‌లో ముఖ్యమంత్రి పెమా ఖండూ గృహాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. వారిలో మరికొందరు పక్కనున్న ఉప ముఖ్యమంత్రి చౌనామీన్‌ ఇంటికి పాక్షికంగా నిప్పంటించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. వందకుపైగా వాహనాలను ఆందోళనకారులు దగ్ధం చేశారు.

అహోం, దేవరి, సోనోవాల్‌ కచరీ, మిసింగ్, గూర్ఖా, మోరన్‌ తెగలకు పీఆర్‌సీ ఇవ్వొచ్చునని ఉన్నత స్థాయి కమిటీ సూచించడానికి చాలా ముందే గత డిసెంబర్‌లో ఉప ముఖ్యమంత్రి చౌనా మీన్‌ కొత్త సంవత్సర కానుకగా ఈ తెగలకు పీఆర్‌సీ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఈ ఏడాది ఆఖ రులో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్రకటన చేసినా, ఆ తెగల డిమాండ్‌లో అసంబద్ధత ఏమీ లేదు. ఎందుకంటే, దాదాపు 30,000మంది జనాభా గల ఈ తెగలన్నీ ఆ రాష్ట్రం లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న నమ్సాయ్, చంగ్లాంగ్‌ జిల్లాల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటు న్నాయి. ఎగువ అస్సాంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న ఈ తెగలవారు 1972లో అస్సాంనుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి అరుణాచల్‌ప్రదేశ్‌ ఏర్పాటు చేశాక ఆ రెండు జిల్లాల్లో అల్పసంఖ్యాకుల య్యారు. తాము అస్సాంకు చెందినవారం కానప్పుడు అరుణాచల్‌ప్రదేశ్‌ వాసులుగా ఎందుకు గుర్తిం చరన్నది వారి ప్రశ్న. అందుకే కనీసం తమకు పీఆర్‌సీ ఇవ్వాలని ఈ తెగలన్నీ డిమాండ్‌ చేస్తున్నాయి. పీఆర్‌సీ ఉంటేనే విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయి. అలాగే రాష్ట్రం లోని రక్షిత ప్రాంతాల్లోకి వెళ్లేందుకు వీలవుతుంది. కానీ ఇతర ఈశాన్య రాష్ట్రాల తరహాలోనే అరుణాచల్‌లో కూడా వివిధ తెగల్లో అభద్రతాభావం అధికం.

కొత్తగా ఆ తెగలకు పీఆర్‌సీ వస్తే విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో వారు తమతో పోటీ పడతారని, మున్ముందు ఎస్టీలుగా గుర్తించాలంటూ ఉద్యమిస్తారని, అది తమ ప్రయో జనాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని అధిక సంఖ్యాకులుగా ఉంటున్న న్యీషీతోపాటు మరికొన్ని తెగలు ఆందోళన చెందుతున్నాయి. దానికితోడు తమకు పీఆర్‌సీ ఇవ్వాలంటూ మొన్న జనవరిలో అఖిల మోరన్‌ విద్యార్థి సంఘం ఆర్థిక దిగ్బంధనం ఉద్యమం చేపట్టింది. దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుందామని పెమా ఖండూ అనుకుంటుండగానే ఉద్యమం రాజుకుంది. అసెంబ్లీలో శనివారం తీవ్ర గందరగోళం చెలరేగి చివరకు సభ నిరవధికంగా వాయిదా పడింది.  ఈ హింసా కాండ వెనుక కాంగ్రెస్‌ హస్తం ఉన్నదని పెమా ఖండూ ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఉంటే ఉండొచ్చు. ఏ సమస్యనైనా రాజకీయ ప్రయోజనాలకు ఉప యోగించుకోవడం మన దేశంలో కొత్త గాదు. కానీ ఒక సమస్య విషయంలో ప్రజల్లో ఏదో మేరకు ఆందోళన, అభద్రత, అసంతృప్తి లేకపోతే ఉద్యమాలు వాటంతటవి పుట్టుకు రావు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు ఎందుకింత తీవ్రంగా ఉన్నాయో పాలకులు ఆలోచించాలి.

అరుణాచల్‌ప్రదేశ్‌ చైనా సరిహద్దుల్లో ఉంది. అలాంటి అత్యంత సున్నితమైన ప్రాంతంలో రాజ కీయంగా, సామాజికంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన మాత్రమే కాదు... రాజకీయ పార్టీలపైన కూడా ఉంది. కానీ అక్కడి వ్యవహారాలు ఈమధ్య కాలంలో అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. 2016 ఫిబ్రవరిలో అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తి ఆ ఏడాదంతా అనిశ్చిత వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి పాలన విధింపు, కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, నబం టుకీ, కలిఖో పుల్‌ వంటివారు ముఖ్యమంత్రులుగా వచ్చి తెరమరుగు కావడం, చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో కాంగ్రెస్‌కు చెందిన పెమా ఖండూ ముఖ్యమంత్రి కావడం వగైరాలు వరస బెట్టి సాగాయి. కానీ ఆ ఏడాది ఆగస్టులో ఖండూ ఆ పార్టీ నుంచి తప్పుకుని మెజారిటీ ఎమ్మెల్యేలతో పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌(పీపీఏ)లో చేరడం, ఆ వెంటనే అక్కడినుంచి కూడా నిష్క్రమించి బీజేపీలో విలీనం కావడం అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో తీవ్ర గందర గోళాన్ని సృష్టించాయి. స్థానికంగా లభ్యమయ్యే వనరులను సవ్యంగా వినియోగించి సమ్మిళిత అభివృద్ధికి కృషి చేస్తే ప్రజల్లో అభద్రత, అనిశ్చితి వంటివి ఏర్పడవు. కానీ ఈశాన్య భారతం దురదృష్టమేమోగానీ కొంచెం హెచ్చుతగ్గులతో అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ నాయకత్వం బల హీనంగానే ఉంది. ఫలితంగా ఏ రాష్ట్రమూ చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి సాధించలేదు. పైపెచ్చు రాజకీయ సంక్షోభాలు రివాజుగా మారాయి. అందువల్లే ఎక్కడాలేని విధంగా ఈ రాష్ట్రా లన్నిటా వైషమ్యాలు తప్పడం లేదు. నాగాలాండ్, మిజోరం, మణిపూర్, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఈ వైషమ్యాలు తరచుగా ఆర్థిక దిగ్బంధనాలకు మాత్రమే కాదు... అప్పుడప్పుడు తెగలమధ్య ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. భయందోళనల మధ్య బతు కీడుస్తున్నారు. కేంద్రం ఈ సమస్యలపై దృష్టి సారించి అక్కడి ప్రభుత్వాల భాగ స్వామ్యంతో ఆ ప్రాంత అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు రచించి సక్రమంగా అమలయ్యేలా చేస్తేనే ఇదంతా చక్కబడుతుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top