
నాలుగు దశాబ్దాలుగా ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి పయనిస్తున్న హిందూ మహాసముద్ర ప్రాంత దేశం మాల్దీవులు మళ్లీ అశాంతితో అట్టుడుకుతోంది. జైళ్లలో ఉన్న విపక్ష నేతలందరినీ విడుదల చేయాలని, కొందరు ఎంపీ లపై అనర్హత వేటు వేయడం చెల్లదని గురువారం రాత్రి అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తాజా పరిణామాలకు మూలం. ఈ ఉత్తర్వులను తాను అమలు చేసేది లేదంటూ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రభుత్వం ప్రకటించడంతో దేశమంతా ఆందోళనలు మొదలయ్యాయి. రాజకీయపుటెత్తులు, పైయెత్తుల్లో అక్కడి న్యాయ వ్యవస్థ కూడా భాగం కావడం, ఇష్టానుసారం వ్యవహరిస్తుండటం తదితర కారణాల వల్ల సుప్రీంకోర్టుపై కూడా ఎవరికీ పెద్దగా విశ్వాసం లేదు.
గత మూడు నాలుగేళ్లుగా రాజకీయ ప్రాధాన్యమున్న కేసుల్లో ఆ న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పుల్నే ఇచ్చింది. ఈ కేసులో సైతం అలాంటి తీర్పే వెలువ డుతుందని ప్రభుత్వం భావించింది. కానీ అందుకు భిన్నంగా విపక్ష నేతలను విడుదల చేయమని, అనర్హత వేటు చెల్లదని వెలువడిన ఆదేశాలతో ప్రభుత్వం ఖంగుతింది. మాల్దీవులతో భారత్ సంబంధాలు సంక్లిష్టమైనవనే చెప్పాలి. హిందూమహాసముద్రం–అరేబియా సముద్ర కూడలిలో ఉన్న మాల్దీవులలో మన భద్రతా కారణాలరీత్యా అక్కడ చైనా ప్రాబల్యం పెరగకుండా చూసుకోవాలని మన దేశం భావిస్తోంది. అందుకే ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని, సంయమనం పాటించమని అన్ని పక్షాలనూ కోరడం మన దేశానికి రివాజు.
ఇందుకు భిన్నంగా 1988లో ఒకసారి జరిగింది. అప్పట్లో మాల్దీవుల అధ్యక్షుడు గయూమ్‌కు వ్యతిరేకంగా సైనిక కుట్ర జరగబోతున్నదన్న సమాచారం అందుకున్న రాజీవ్‌గాంధీ ప్రభుత్వం హుటాహుటీన అక్కడికి మన సైన్యాన్ని తరలించి కుట్రదార్లందరినీ నిర్బంధించింది. ఆ ఉదంతం అప్పట్లో రెండు విధాలుగా ప్రకంపనలు రేపింది. ఈ ప్రాంతంలో భారత్ పెద్దన్న పాత్ర వహిస్తున్నదని, అక్కడేం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మెరుపు దాడులు నిర్వ హించగల సత్తా భారత్‌కు ఉన్నదని అమెరికాతోసహా చాలా దేశాలకు అర్ధమైంది. అదే సమయంలో గయూమ్ నియంతృత్వానికి భారత్ వంతపాడుతున్నదని అప్పటికే విపక్షాల్లో నెలకొన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ ఘటన తర్వాత గయూమ్ మరింత రెచ్చిపోయారు. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపారు.
ఎలా ఉద్యమించాలో, నిర్బంధాన్నెలా ధిక్కరించాలో ప్రజలకు నియంతలే నేర్పుతారు. మూడు దశాబ్దాలపాటు సైన్యాన్ని, పోలీసులను, న్యాయవ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన గయూమ్‌కు 2004లో మొదలై దాదాపు రెండేళ్లపాటు వెల్లువెత్తిన ఉద్యమాలను అణచడం సాధ్యం కాలేదు. చివరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరిం చాడు. 2008లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అప్పటికి జైల్లోనే ఉన్న మహమద్ నషీద్ గయూమ్‌పై విజయం సాధించారు. అంతా సవ్యంగా ఉంటే మాల్దీవుల్లో ప్రజా స్వామ్యం వేళ్లూనుకునేది. కానీ అదే సంవత్సరం పుట్టుకొచ్చిన ఆర్థిక మాంద్యం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. కొత్తగా అధికారంలోకొచ్చిన నషీద్ ఆర్థిక, రాజకీయ సంస్కరణలు ప్రారంభించి చక్కదిద్దుతున్న సమయంలోనే నిత్యా వసరాల ధరలు ఆకాశాన్నంటడం, ఉపాధి అవకాశాలు తగ్గడం వగైరా కారణాలతో జనంలో అసంతృప్తి పెరిగింది.
అనంతర పరిణామాల్లో నషీద్ సైతం నియంతృత్వ విధానాలనే ఆశ్రయించారు. మాజీ అధ్యక్షుడు గయూమ్‌పై వచ్చిన అవినీతి కేసుల్లో చర్యలకు అడ్డుపడుతున్నారన్న కారణంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా మహమద్‌ను 2012లో అరెస్టు చేయించారు. చివరకు పోలీసులు, సైన్యమూ తన ఆదేశాలను ధిక్కరించడం ప్రారంభించాక నషీద్ రాజీనామా చేయాల్సివచ్చింది. అయితే తనకు వ్యతిరేకంగా సైనిక కుట్ర జరిగిందన్నది ఆయన ఆరోపణ. ఒకప్పుడు సైన్యాన్ని తరలించి గయూమ్‌ను కాపాడిన భారత్ తన విషయంలో కనీసం వ్యతిరేకంగా ప్రకటన కూడా చేయ లేదన్న అసంతృప్తి నషీద్‌కు ఉంది. అయితే మన దేశం ఆయనను మొదటినుంచీ నమ్మదగ్గ మిత్రుడిగా పరిగణించలేదు. నషీద్ చైనాకు సన్నిహితంగా ఉండటం, భారత్–పాక్‌ల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా ఉంటానని ప్రకటించడం లాంటివి మన దేశానికి రుచించలేదు. 2013లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ నషీద్‌ను ఓడించారు.
అయితే ఆ ఎన్నికల్లో పెద్దయెత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. ఎప్పుడూ సంక్షోభంతో కొట్టుమిట్టాడే మాల్దీవుల విషయంలో మన దేశం అంటీముట్టనట్టు వ్యవహరించడం ప్రారంభించాక చైనా ఆ దేశానికి సన్నిహిత మైంది. చైనా బృహత్తర ప్రాజెక్టు వన్ బెల్ట్ వన్ రోడ్(ఓబీఓఆర్)లో పాలుపంచు కోవాలని మాల్దీవులు నిర్ణయించింది. జీఎంఆర్ సంస్థ అక్కడ నిర్మించ తలపెట్టిన విమానాశ్రయం ప్రాజెక్టును సైతం చైనా ఒత్తిడితో ఏకపక్షంగా రద్దుచేసి అందుకు భారీమొత్తంలో ఆ సంస్థకు పరిహారం చెల్లించింది. మాజీ అధ్యక్షుడు గయూమ్‌కు ప్రస్తుత అధ్యక్షుడు యమీన్ సమీప బంధువే. వారిద్దరి సంబంధాలూ చెడి ఆయన నషీద్‌తో చేతులు కలపడంతో నిరుడు ఉద్యమాలు ఊపందుకున్నాయి.
అప్పట్లో గయూమ్ అనుకూల ఎంపీలు విపక్షంలోకి ఫిరాయించడంతో ప్రభుత్వం మైనారి టీలో పడింది. ఇలా ఫిరాయించినవారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించడం చెల్ల దన్న సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ‘సూర్యుడు ముద్దాడే దేశం’గా, 26 పగడాల దీవుల సముదాయంగా, కేవలం 4,30,000 జనాభా ఉన్న మాల్దీవులు వ్యూహాత్మకంగా కీలకప్రాంతం కావడం వల్లే ఆ దేశంపై మన దేశానికి ఆదుర్దా. అధికార, విపక్షాల నిరంతర ఘర్షణలతో అట్టు డుకుతున్న మాల్దీవుల్లో ఈ ఏడాది ఆఖరులో జరగబోయే ఎన్నికలతోనైనా ప్రశాం తత ఏర్పడుతుందా అన్నది చూడాలి.