‘ఉక్కుమనిషి’కి సమున్నత నివాళి

Editorial On Sardar Vallabhbhai Patel Birth Anniversary Special - Sakshi

‘ఉక్కు మనిషి’, ఈ దేశ సమైక్యత, సమగ్రతల కోసం అలుపెరగకుండా శ్రమించిన స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ అతి ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. నర్మదా నదీతీరాన సర్దార్‌ సరోవర్‌ డ్యాం సమీపాన ఈ భారీ విగ్రహం కోసం 3,400మంది కార్మికులు నలభై రెండు నెలలుగా రాత్రింబగళ్లు శ్రమించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అందరూ ఊహించినట్టు నరేంద్ర మోదీ తన 55 నిమిషాల ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయలేదు. అలాగని తనను విమర్శిస్తున్నవారిని ఊరకే వదిలేయలేదు.

తమ ప్రభుత్వం జాతీయ నేతలకు సము న్నతమైన స్మృతి చిహ్నాలను నిర్మించాలని ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తుంటే దీన్నంతటినీ కొందరు రాజకీయ సులోచనాలతో పరికించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్పారు. ‘‘మేమేమైనా తీవ్రమైన నేరం చేశామా అని మాకే అనిపించే స్థాయిలో వీరి విమర్శలుంటున్నాయి’’ అని మోదీ అన్నారు. పటేల్‌ ఈ దేశాన్ని సమైక్యపరచకపోతే జునాగఢ్‌లో సింహాలను చూడ్డానికి, గుజరాత్‌లోని సోమ నాథ్‌ దేవాలయంలో ప్రార్ధించుకోవడానికి, హైదరాబాద్‌లో చార్మినార్‌ చూడటానికి వీసాలు తీసు కోవాల్సి వచ్చేదని ఆయన ప్రజలకు గుర్తుచేశారు. 

సర్దార్‌ పటేల్‌ విషయంలో బీజేపీకి ఉన్న అభిప్రాయాలు, వాటి వెనకున్న కారణాలు ఎవరికీ తెలియనివి కాదు. బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్‌ కాలం నుంచే ఈ అభిప్రాయాలున్నాయి. అయిదేళ్ల క్రితం అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాల్గొన్న సభలో నరేంద్రమోదీ మాట్లాడుతూ పటేల్‌ తొలి ప్రధాని అయివుంటే ఈ దేశ ముఖచిత్రం మరోలా ఉండేదంటూ వ్యాఖ్యానించినప్పుడు దానిపై పెద్ద దుమారమే లేచింది. అంతేకాదు...దేశానికి ఇప్పుడు కావలసింది ‘పటేల్‌ తరహా సెక్యులరిజం’ తప్ప ‘ఓటు బ్యాంకు సెక్యులరిజం’ కాదని కూడా అప్పట్లో ఆయన చెప్పారు.

ఈ బాణాలు తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను, కాంగ్రెస్‌ను ఉద్దేశించినవేనని ఎవరికైనా అర్ధమవుతుంది. నెహ్రు గురించి బీజేపీకి లేదా మోదీకి మాత్రమే కాదు...వేరేవారికి కూడా ఇటువంటి అభిప్రాయాలున్నాయి. నెహ్రూ కేబినెట్‌లో పనిచేసిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆ రోజుల్లోనే నెహ్రూ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని, ఆయన బదులు పటేల్‌ ప్రధాని అయివుంటే బాగుండేదని అన్నారని ఆజాద్‌కు కార్యదర్శిగా పనిచేసి, అనంతరకాలంలో కేంద్ర విద్యామంత్రిగా ఉన్న హుమాయూన్‌ కబీర్‌ ఒక సందర్భంలో చెప్పారు.

నిజానికి పటేల్‌ భావ జాలానికీ, ఆజాద్‌ భావజాలానికీ ఏమాత్రం పొసగదు. లౌకికవాదిగా ఆయన జవహర్‌లాల్‌ నెహ్రూకే సన్నిహితుడు. పటేల్‌ ప్రవచించిన స్వేచ్ఛా వ్యాపార విధానాలను నెహ్రూతోపాటు వ్యతిరేకించినవాడు. స్వాతంత్య్రోద్యమానికి సారధ్యంవహించి, అనంతరకాలంలో దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్‌ నాయకుల్లో ఇలా విరుద్ధ భావజాలాలు, అవగాహనలు ఉండేవి. అందులో అసహజమూ లేదు. వైపరీత్యమూ లేదు. అందరి ఉమ్మడి లక్ష్యమూ సమున్నతమైన, పటిష్టమైన నవభారత నిర్మాణమే. వారంతా పదహారణాల దేశభక్తులు.

కశ్మీర్‌ విషయంలో, విభ జన సమయంలో పాకిస్తాన్‌కు చెల్లించాల్సిన రూ. 64 కోట్ల పరిహారం విషయంలో, అలీనో ద్యమంవైపు మొగ్గుచూపడంలో, చైనాతో చెలిమి విషయంలో వారిమధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలే తప్ప అభిప్రాయభేదాలు కాదు. భారత్‌లో విలీనమయ్యేదిలేదన్న పలు సంస్థానాలను దారికి తేవడంలో పటేల్‌ పాత్ర ఎనలేనిది. చివరివరకూ మొండికేసిన హైదరాబాద్, జునాగఢ్‌ సంస్థానా ధీశులపై బలప్రయోగానికి పూనుకున్నారు. 

అయితే నరేంద్రమోదీ, బీజేపీ సర్దార్‌ పటేల్‌ పేరెత్తినప్పుడల్లా ఆయన తమవాడని తరచు భుజాలు తడుముకుంటున్న కాంగ్రెస్‌ను గురించి చెప్పుకోవాలి. స్వాతంత్య్రోద్యమంలో నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలు...సామ్యవాద, లౌకిక భారత్‌ను నిర్మించడానికి నెహ్రూ చేసిన ఎనలేని కృషి దాచేస్తే దాగనివి. అలాగని అదే స్వాతంత్య్రోద్యమంలో ఆయనతో సమానంగా పాలు పంచు కున్న షహీద్‌ భగత్‌సింగ్, నేతాజీ సుభాస్‌చంద్ర బోస్, ఆజాద్, సర్దార్‌ పటేల్, లాల్‌బహదూర్‌ శాస్త్రి వంటి మహనీయుల కృషిని తక్కువ చేసి చూడటం లేదా విస్మరించటం క్షమిం చరాని నేరం.

ఆ పని కాంగ్రెస్‌ చేసింది. ఆ నాయకుల పట్ల అలవిమాలిన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వారి వర్ధంతులూ, జయంతులనాడైనా వారి కృషిని ఘనంగా స్మరించుకోవాలని, ఈ దేశ నిర్మాణానికి వారు దోహ దపడ్డ తీరును చాటిచెప్పాలని ఆ పార్టీ, దాని నేతృత్వంలోని ప్రభుత్వాలూ ఏనాడూ అనుకోలేదు. మొక్కుబడి నివాళులతో సరిపెట్టడమే రివాజైంది. కనీసం 2009లో బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా ఎల్‌కే అద్వానీని రంగంలోకి దింపి, ఆయన్ను ‘అభినవ సర్దార్‌’గా అభివర్ణించడం మొదలుపెట్టా కైనా కాంగ్రెస్‌ మేల్కొనలేదు. ఎప్పటినుంచో తనకలవాటైన విధానాలనే కొనసాగించింది. 2014 ఎన్నికలకు ముందు  నరేంద్రమోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రంగప్రవేశం చేసి, పిడుగులు కురిపిం చడం మొదలెట్టాక పటేల్‌ చరిత్రను, ఇతర నాయకుల చరిత్రను పఠించడం ప్రారంభించింది.  

ఇటు బీజేపీ కూడా సర్దార్‌ పటేల్‌కు ప్రాముఖ్యం ఇస్తూనే చరిత్రలో నెహ్రు స్థానాన్ని తక్కువ చేసి చూపడానికి వీలైనప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉంది. ఒకరకంగా ఆ పార్టీ కాంగ్రెస్‌ ఇంతక్రితం చేసిన తప్పునే మరో పద్ధతిలో చేస్తోంది. గత పాలకులు విస్మరించిన స్వాతంత్య్రోద్యమ సారథు లను, వారి కృషిని వెలికితీయాల్సిందే. దాన్నెవరూ కాదనరు. కానీ అందుకోసం నెహ్రూ వంటి శిఖరసమానుల పాత్రను తగ్గించి చూపనవసరం లేదు. నరేంద్రమోదీ బుధవారం ప్రతిష్టించిన ‘ఐక్యతా ప్రతిమ’ 597 అడుగులతో ఇప్పటికైతే ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం. ఈ ప్రతిమ కాలావధుల్ని దాటి ఐక్యతా పరిమళాలు వెదజల్లాలంటే... జన హృదయాల ఐక్యతకు అది స్ఫూర్తి నీయాలంటే ఆ దిశగా ప్రభుత్వాల కార్యాచరణ ముఖ్యం.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top