ఆలస్యంగా దక్కిన న్యాయం

Editorial Article On Indian Judiciary - Sakshi

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ తమ పార్టీ చేతులు కూడా నెత్తుట తడిశాయని అంగీకరించినప్పుడు కాంగ్రెస్‌లో పెద్ద దుమారం లేచింది. ‘నేరాంగీకార ప్రకటన’గా భావించాల్సిన ఆ జవాబుకు కారణమైన ప్రశ్న బుధవారం తీర్పు వెలువడిన హాషింపురా నరమేథానికి సంబంధించిందే. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్థులతో సంభాషిస్తున్న సందర్భంలో ఒక విద్యార్థి ఆ దారుణ మారణకాండ వెలు గుచూడకుండా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కప్పెట్టే యత్నం చేయలేదా అని అడిగినప్పుడు ఆయన ఒప్పుకోక తప్పలేదు.

ఈ ఉదంతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు పర్యవసానంగా ప్రొవిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ(పీఏసీ)కి చెందిన 16 మంది మాజీ జవాన్లకు జీవితఖైదు పడింది. ఈ రోజు కోసమే మృతుల కుటుంబాలు 31 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో కేంద్రంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ కాంగ్రెసే అధికారం చలాయిస్తోంది. అంతకు మూడేళ్లక్రితం దేశ రాజధాని నగరం న్యూఢిల్లీతోసహా పలు నగరాల్లో మూడురోజులపాటు కాంగ్రెస్‌ నాయకులు పంపిన హంతక ముఠాలు చెలరేగి అయిదువేలమంది సిక్కు పౌరులను ఊచకోత కోశాయి.

ఎందరో మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. దాన్నుంచి దేశం ఇంకా తేరుకోక ముందే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మత ఘర్షణలు చెలరేగి 350 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ప్రశాంతత నెలకొల్పడానికొచ్చిన పీఏసీ జవాన్లు ఆ పని విడిచిపెట్టి తామే హంతకులుగా మారారు. నగరంలోని హాషింపురా ప్రాంతంలోని ముస్లింల ఇళ్లు చుట్టుముట్టి ఆడవాళ్లనూ, వృద్ధులనూ వేరుచేసి 43 మంది యువకులను, మైనర్‌ బాలురను ట్రక్కుల్లో తీసు కుపోయి ఒకరి తర్వాత ఒకరిని కాల్చుకుంటూ పోయారు. బుల్లెట్‌ గాయాలతో నెత్తురోడు తున్నవారిని కాలువలోకి విసిరేశారు. వీరిలో అయిదుగురు చనిపోయినట్టు నటించి ప్రాణాలు కాపాడుకున్నారు. 

మన దేశంలో న్యాయం ఎలా నత్తనడకన సాగుతుందో చెప్పడానికున్న అనేక ఉదాహరణల్లో ఈ హాషింపురా నరమేథం ఒకటి.  ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో, ఎంత నిర్లక్ష్యానికి గురైందో, బాధిత కుటుంబాలు ఎంత క్షోభకు గురయ్యాయో గమనిస్తే ఎలాంటివారైనా దిగ్భ్రమచెందుతారు. సమాజాన్ని అల్లకల్లోలం చేసే ముఠాల బారినుంచి కాపాడటానికి అవసరమైన శిక్షణనిచ్చి యూనిఫాంనూ, ఆయుధాన్నీ ఇచ్చి పంపితే కొందరు సిబ్బంది తమ బాధ్యతల్ని గాలికొదిలి ఉద్దేశపూర్వకంగా ఊచకోతకు పాల్పడిన దురంతమది. ఆనాటి జిల్లా ఎస్‌పీ విభూతి నారాయణ్‌ రాయ్‌ ఈ ఉదంతం గురించి తెలుసుకుని చలించి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆయన్ను తీసుకుని రాత్రికి రాత్రే అక్కడికి వెళ్లారు.

మృతదేహాల మధ్య కొన ఊపిరితో ఉన్న అయిదుగురిని గమనించి ఆసుపత్రికి పంపి కాపాడారు. ఆ సమయానికి మీరట్‌ నగరం మీదుగానే వెళ్తున్న అప్పటి ముఖ్యమంత్రి వీర్‌బహదూర్‌సింగ్‌ను ఆపి ఆయనకు దీన్ని గురించి వివరించారు. విభూతి నారా యణ్‌ ఎంతో శ్రద్ధపెట్టి దుండగులపై కేసులు పెట్టకపోయి ఉంటే ఇదసలు వెలుగుచూసేదే కాదు. కానీ విచారకరమేమంటే, ఆ తర్వాత దర్యాప్తు ప్రక్రియనంతటినీ వీర్‌బహదూర్‌ నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఫలితంగా నిందితులంతా సులభంగా తప్పించుకోగలిగారు.

బాధిత కుటుం బాలన్నీ ఎంతో పట్టుదలగా పోరాడి ఉండకపోతే... ఈ ఉదంతంలో గాయపడిన పదిహేడేళ్ల బాలుడు జుల్ఫికర్‌ నాసిర్‌ బెదిరింపులను బేఖాతరు చేస్తూ గత 31 ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరిగి ఉండకపోతే బుధవారంనాటి తీర్పు వెలువడేది కాదు. అతడిచ్చిన తిరుగులేని సాక్ష్యాధారాల వల్లే దోషులకు ఇన్నాళ్లకైనా శిక్ష పడింది. నిందితులు 19 మందిలో ముగ్గురు చనిపోగా మిగిలిన వారికి ఇప్పుడు శిక్షలు పడ్డాయి. విభూతి నారాయణ్‌ చెబుతున్న ప్రకారం ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలు లేకుండా వీరు ఇంతగా బరితెగించరు.

ఈ నరమేథంపై రెండేళ్లక్రితం ఆయన వెలువరిం చిన పుస్తకం సంచలనం సృష్టించింది. నేరాల దర్యాప్తు, న్యాయస్థానాల్లో వాటి విచారణ ఏళ్ల తరబడి సాగటం వల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు. దర్యాప్తులో బయటికొచ్చిన అనేక అంశాలకు సంబంధించిన ఫైళ్లు మాయం చేయడానికి నేరగాళ్లకు వీలవుతుంది. హాషింపురా దురంతంలో జరిగిన సీఐడీ దర్యాప్తులో కొందరు అధికారుల పేర్లున్నట్టు తమకు తెలుసునని, అవన్నీ కాలక్రమంలో మాయం చేశారని రిటైర్డ్‌ పోలీసు అధికారులు చెబుతున్న మాట.

అప్పట్లోని కాంగ్రెస్‌ ప్రభుత్వమూ, అనంతరకాలంలో వచ్చిన బీజేపీ, బీఎస్‌పీ, ఎస్‌పీ తదితర పక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలు కూడా న్యాయస్థానాల పోరు పడలేక అయిష్టంగా కేసు నడిపించినా... అందులో నిందితులుగా ఉండాల్సిన ఉన్నతాధికారుల పేర్లు మాయం చేశాయి. నిందితుల జాబితాలో ఉన్నవారికి పదోన్నతులిస్తూ పోయాయి. వారి సర్వీసు రికార్డుల్లో ఈ కేసులో నిందితులుగా ఉన్నారన్న ప్రస్తావనే లేదు. న్యాయస్థానం పదే పదే మందలించాకగానీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ల నియామకం చేయలేదు. ఆ వచ్చినవారు సైతం ఒకటికి రెండుసార్లు న్యాయస్థానం మందలించాకగానీ ఈ కేసుపై సరైన శ్రద్ధపెట్టలేదు. పట్టపగలు హత్యా కాండ సాగించినవారిని శిక్షించడానికి కూడా మూడు దశాబ్దాలకుపైగా సమయం పట్టిందంటే మన దేశంలో నేర న్యాయ వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్ధమవుతుంది.

ఇప్పుడు వెలువడిన ఢిల్లీ హైకోర్టు తీర్పుతో హాషింపురా కేసు ముగిసినట్టు కాదు. ఇప్పుడు శిక్షపడినవారంతా సుప్రీంకోర్టుకు వెళ్తామం టున్నారు. కనుక ఇది మరి కొన్నేళ్లు నడుస్తుంది. అన్యాయానికి గురైనామని భావించేవారికి సకా లంలో న్యాయం అందించగలిగితే వారికి వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. అది దక్కనప్పుడు వారు అసహనానికీ, ఆగ్రహావేశాలకూ లోనవుతారు. ఇతరేతర మార్గాలు ఆశ్రయిస్తారు. పర్య వసానంగా సమాజం అల్లకల్లోలమవుతుంది. పాలకులు దీన్ని దృష్టిలో ఉంచుకుని మెలగాలి.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top