బోధనపై ఆంక్షలా?

Editorial About BHU Assistant Professor Feroz Khan Transfer - Sakshi

వివేచనపైనా, వివేకంపైనా పిడివాదమే గెలిచింది. వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యా లయం(బీహెచ్‌యూ)లోని సంస్కృత విద్యా ధర్మ విజ్ఞాన్‌(ఎస్‌వీడీవీ) విభాగంలో సంస్కృత విద్యా  బోధన కోసం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితుడైన ఫిరోజ్‌ఖాన్‌ దాన్నుంచి తప్పుకుని మరో విభాగంలో చేరవలసి వచ్చింది. విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఆయన మరో 9మందితో పోటీపడి రెండు నెలలక్రితం ఆ పోస్టుకు ఎంపికయ్యాడు. ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన బోర్డులో ప్రముఖ సంస్కృత పండితుడు ప్రొఫెసర్‌ రాధావల్లభ్‌ త్రిపాఠీతోసహా హేమాహేమీలున్నారు.

ఇతరులతో పోలిస్తే ఆ పోస్టుకు కావాల్సిన సకల అర్హతలూ ఆయనకు ఉన్నాయని, ఫిరోజ్‌ఖాన్‌ సంస్కృతంలో సాహిత్య సంబంధ అంశాలే బోధిస్తారు తప్ప మతపరమైన అంశాలతో ఆయనకు ప్రమేయం ఉండదని బీహెచ్‌యూ వైస్‌చాన్సలర్‌ రాకేష్‌ భట్నాగర్, సంస్కృత సాహిత్య విభాగం అధిపతి ప్రొఫెసర్‌ ఉమాకాంత్‌ చతుర్వేది, విశ్వవిద్యాలయ పాలకమండలి నచ్చ జెప్పినా విద్యార్థులు అంగీకరించలేదు. సంస్కృతాన్ని మతంతో లేదా కులంతో ముడిపెట్టడం, దాన్ని ఫలానా మతం వారు మాత్రమే నేర్చుకోవాలని, వారు మాత్రమే బోధించాలని ఆంక్షలు పెట్టడం రాజ్యాంగ విలువలకు అపచారం చేయడం మాత్రమే కాదు.

ఆ భాషకు కూడా అన్యాయం చేసినట్టే. ప్రజల్లో విస్తృతంగా వాడుకలో ఉన్నప్పుడే ఏ భాషైనా అభివృద్ధి చెందుతుంటుంది. చిర కాలం వర్థిల్లుతుంది. కొందరికే పరిమితమైనప్పుడు కుంచించుకుపోతుంది. సంస్కృత వ్యాకరణం, సాహిత్యం, వేదాలు, ఉపనిషత్తులు ఔపోసనపట్టిన ఫిరోజ్‌ఖాన్‌ను విధ్వంసక శక్తిగా చూడటం, ఆయన బోధనాచార్యుడిగా వస్తే ఏదో అపచారం జరిగిపోతుందని బెంబేలెత్తడం ఆశ్చర్యం కలిగి స్తుంది. రాజస్తాన్‌కు చెందిన ఫిరోజ్‌ కుటుంబం మూడు తరాలనుంచి సంస్కృతంపైనా, హిందూ మత ఆచారాలపైనా ఆసక్తి, అనురక్తీ పెంచుకుంది.

ఒకపక్క మసీదులో నమాజు చేస్తూనే గోవును పూజించడం, వారి స్వస్థలమైన బంగ్రూలో ఉన్న దేవాలయాల్లో భజన గీతాలు పాడటం ఫిరోజ్‌ తండ్రి రంజాన్‌ఖాన్‌కు దశాబ్దాలుగా అలవాటు. రంజాన్‌ఖాన్‌ సంస్కృతంలో పట్టభద్రుడు. తన కుటుంబం అనుసరిస్తున్న ఆచారాల విషయంలోగానీ, దేవాలయాల్లో భజనగీతాలు పాడటం విషయంలోగానీ ముస్లింలెవరూ అభ్యంతరం చెప్పలేదని ఆయనంటున్నాడు. సంస్కృతంపై తనకు వల్లమాలిన ప్రేమ ఉండబట్టే కుమారుణ్ణి ఆ భాషలో నిష్ణాతుడయ్యేలా ప్రోత్సహించానని చెబుతున్నాడు.

ఫిరోజ్‌ఖాన్‌ సంస్కృత భాషపై చేసిన పరిశోధనైనా, ఆయన మాట్లాడే సంస్కృత భాషైనా అత్యున్నత ప్రమాణాలతో ఉన్నదని ఇంటర్వ్యూ బోర్డులోని సభ్యులు తెలిపారు. ఈ విషయమే ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తెలియజెప్పి వారిని ఒప్పించాలని చూశారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ ఆందోళన కొనసాగినంతకాలం ఫిరోజ్‌ఖాన్‌ అజ్ఞాతవాసం గడపవలసి వచ్చింది. చిత్రమేమంటే అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో సంస్కృత విభాగ అధిపతిగా ఉన్న సల్మా మఫీజ్‌కు ఇలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు.

అందరూ అత్యంత సంక్లిష్టమైనదిగా భావించే పాణిని విరిచిత సంస్కృత వ్యాకరణం అష్టాధ్యాయిని ఆమె అలవోకగా బోధిస్తారు. సంస్కృత భాషలో పాండిత్యం గడించిన తొలి ముస్లిం మహిళగా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తున్న 15మంది విద్యార్థులకు ఆమె గైడ్‌. వారణాసికి చరిత్రలో విశిష్ట స్థానముంది. అక్కడ షా జహాన్‌ చక్రవర్తి పెద్ద కుమారుడు దారా షికో  సంస్కృత భాషను అధ్యయనం చేయడమే కాదు... అందులో నిష్ణాతుడై భగవద్గీతను, 52 ఉపనిషత్తులను పర్షియన్‌ భాషలోకి అనువదించాడు.

సాగర సంగమం పేరుతో హిందూ, ఇస్లాం, ఇతర మతాల మధ్య ఉన్న వైవిధ్యతలనూ, ఏకత్వాన్ని సోదాహరణంగా వివరిస్తూ పర్షియన్‌ భాషలో గ్రంథం రచించాడు. ఆయనకన్నా ఏడువందల ఏళ్ల ముందు అల్‌–బిరూని అనే ముస్లిం విద్యాధికుడు ఇప్పటి ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్‌ల నుంచి భారత్‌ వచ్చి సంస్కృతంలో పాండిత్యం గడించి ఈ దేశంలోని సంస్కృతి, మతం, జీవనవిధానం, తాత్విక చింతనలను చాటిచెబుతూ ఉద్గ్రంథాన్ని రచించాడు. పర్షియన్‌ ప్రపంచానికి హిందూ మతాన్ని పరిచయం చేసే వంద గ్రంథాలు వెలువరించాడు.

సూఫీ కవి, పండితుడు అమిర్‌ ఖుస్రో వేదాల్ని, పురాణాల్ని ఔపోసన పట్టి, సంస్కృతంలోనే అనేక రచనలు చేశాడంటారు. ఆయన వచనంలోనూ, కవిత్వంలోనూ అడుగడుగునా అనేక సంస్కృత పదాలుంటాయి. వీరు మాత్రమే కాదు... యూరప్‌ దేశాలకు చెందిన ఎందరో సంస్కృతాన్ని నేర్చుకున్నారు. 1785లో చార్లెస్‌ విల్కిన్స్‌తో మొదలుపెట్టి జర్మనీకి చెందిన మాక్స్‌ ముల్లర్‌ వరకూ అనేకులు సంస్కృత కావ్యాలను, గ్రంథాలను ఇంగ్లిష్, జర్మన్‌ తది తర భాషల్లోకి  అనువదించారు.

కొందరు పర్షియన్‌ భాషలోకి అనువాదమైన సంస్కృత కావ్యాలను తర్జుమా చేశారు. సంస్కృతభాషను నిశితంగా అధ్యయనం చేసి భిన్న శతాబ్దాల్లో వెలువడిన సంస్కృత కావ్యాల్లోని భాషా ప్రయోగాల్లో చోటుచేసుకున్న మార్పులపై పరిశోధనలు చేసిన కొలం బియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ షెల్డన్‌ పొలాక్‌ వర్తమాన ప్రపంచంలోని సంస్కృత భాషా పండి తుల్లో అగ్రగణ్యుడు. 

భాష నేర్చుకోవడానికి కులమో, మతమో అడ్డురావడం అంతిమంగా దానికి ప్రతిబంధక మవుతుంది తప్ప అది విస్తరించడానికి దోహదపడదు. మన దేశంలో ఉన్న కుల వ్యవస్థ ఇలాంటి ప్రతిబంధకాలు సృష్టించబట్టే  ఆర్యభట, కణాదుడు, వరాహమిహిరుడు, చరకుడు, సుశ్రుతుడు, బ్రహ్మగుప్తుడు తదితరులు సంస్కృత భాషలో అభివృద్ధి చేసిన ఎన్నో విజ్ఞానశాస్త్రాలు అనంతర కాలంలో విస్తరించలేకపోయాయి. నిజానికి ఇలాంటివి మనకు గుణపాఠాలు కావాలి. మన దృష్టి కోణాన్ని విశాలం చేయాలి. మరింతమంది ఫిరోజ్‌ఖాన్‌లు రూపొందేందుకు దోహదపడాలి. కానీ జరుగుతున్నదంతా అందుకు విరుద్ధం. అది విచారకరం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top