ఐసీజేలో ఎన్నదగిన విజయం

Dalveer Bhandari re-elected to ICJ - Sakshi

ప్రపంచంలో అనేక దేశాలను కండబలంతో వలసలుగా మార్చుకుని తనది ‘రవి అస్తమించని రాజ్యమ’ని ఒకప్పుడు చెప్పుకున్న బ్రిటన్‌... ఆ దేశాల్లో ఒకటైన భారత్‌ చేతిలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఘోరమైన పరాభవాన్ని చవి చూసింది. ఐసీజే న్యాయమూర్తి పదవికి మన దేశంనుంచి పోటీపడిన జస్టిస్‌ దల్వీర్‌ భండారీని ఎలాగైనా ఓడించాలని, ఆ పదవి దక్కించుకోవాలని అది శతథా ప్రయత్నించింది. కానీ పరిస్థితులు తనకు అనుకూలించడంలేదని, మొండిగా ముందుకెళ్తే భంగపాటు తప్పదని గ్రహించి తమ అభ్యర్థి గ్రీన్‌వుడ్‌ను పోటీనుంచి తప్పించి భారత్‌కు మద్దతిచ్చింది. దాంతో జస్టిస్‌ భండారీ ఆ పదవిని కైవసం చేసుకున్నారు. ఇదంత సులభంగా ఏమీ కాలేదు.

ఐక్యరాజ్యసమితిలో తనకు మెజారిటీ దేశాల మద్దతు లభించడం లేదని తెలిసినా... ఇలాంటి పరిస్థితుల్లో పోటీలో కొనసాగటం నైతికంగా సరికాదని అర్ధమైనా భద్రతా మండలిలో తనకున్న శాశ్వత సభ్యత్వాన్ని అడ్డుపెట్టుకుని ఈ ఓటింగ్‌ను ఆపించి, కాలం చెల్లిన ‘జాయింట్‌ కాన్ఫరెన్స్‌’ విధానాన్ని ప్రయోగించి గండం గట్టెక్కాలని బ్రిటన్‌ ఆలోచించింది. ఓటింగ్‌కు 12 రౌండ్లుంటే 11 రౌండ్‌ల వరకూ అది మొండిగా పోటీలో కొనసాగింది. ఈ పరిస్థితుల్లో ఆ పదవి దక్కించుకున్నా సారాంశంలో అది ఓటమే అవుతుందనుకుందో... ‘జాయింట్‌ కాన్ఫరెన్స్‌’ ప్రతిపాదనకు అమెరికా నుంచి ఆశించిన మద్దతు లభించలేదో... బ్రెగ్జిట్‌ పర్యవసానంగా ఇబ్బందులు చుట్టుముట్టబోతున్న ఈ తరుణంలో భారత్‌ మనసు నొప్పించడం, అంత పెద్ద మార్కెట్‌కు దూరం కావడం తెలివితక్కువ చర్య అవుతుందని భావించిందో... చివరకు అది పోటీ నుంచి వైదొలగక తప్పలేదు.

ఇదే సమయంలో విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, ఆ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితిలో మన దూత సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తదితరులు ఈ విజయానికి చేసిన కృషి గురించి కూడా చెప్పుకోవాలి. వారు పట్టుదలతో శ్రమించిన కారణంగానే ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాల్లో 183 దేశాలు మన దేశానికి మద్దతునిచ్చాయి.  భద్రతామండలిలోని 15 దేశాల ఓట్లూ లభించాయి. పోటీనుంచి తప్పుకోవడానికి ముందు భద్రతామండలిలో బ్రిటన్‌ హవాయే కొనసాగింది. అది మండలిలోని ఇతర శాశ్వత సభ్యదేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌లను కూడగట్టుకుంది. ఈ శాశ్వత సభ్య దేశాల్లో అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా పదవిని చేజిక్కించుకోవడానికి, ఏ కీలక నిర్ణయాన్నయినా ఆపడానికి అవి కలిసికట్టుగా వ్యవహరిస్తాయి. వాస్తవానికి పోటీనుంచి విరమించుకోవాలని మొన్న శుక్రవారం బ్రిటన్‌ నిర్ణయించినా ఇతర శాశ్వతసభ్య దేశాలు అందుకు అడ్డుతగిలాయని కథనాలు వచ్చాయి. రహస్య బ్యాలెట్‌ జరుగుతుంది గనుక ఎవరు ఎవరికి ఓటేశారో తెలియదుగానీ... అప్పటికి మండలి ఓటింగ్‌లో 9 దేశాలు బ్రిటన్‌వైపు నిలిచాయి. మనకు ఆరుగురి మద్దతు లభించింది. నిబంధనల ప్రకారం రెండింటిలోనూ మెజారిటీ కూడగట్టుకున్న దేశానికి మాత్రమే న్యాయమూర్తి పదవి దక్కాలి గనుక ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ దశలో శాశ్వతసభ్య దేశాల ముందు బ్రిటన్‌ ‘జాయింట్‌ కాన్ఫరెన్స్‌’ ప్రతిపాదన తీసుకొచ్చింది. దాని ప్రకారం సమితి నుంచి ముగ్గురూ, భద్రతామండలి నుంచి ముగ్గురూ సమావేశమై ఒక అభ్యర్థిని నిర్ణయించాలి. అయితే ఇది అమలు చేస్తే ఫలితం, పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదు.  సమితి నుంచి వచ్చే ముగ్గురూ భండారీ పేరుకే కట్టుబడి ఉన్నపక్షంలో ఆ పరిస్థితిని అధిగమించడానికి ఏం చేయాలన్న సందేహాలు అందరిలోనూ తలె త్తాయి. దీన్ని ఆనవాయితీగా తీసుకుని శాశ్వతసభ్య దేశాలను భవిష్యత్తులో ఎవ రైనా సవాలు చేసే పరిస్థితి ఏర్పడొచ్చు. బహుశా ఈ ఆలోచనే శాశ్వతసభ్యుల్లో పునరాలోచన కలిగించినట్టుంది. అందువల్ల దాని జోలికి పోకుండా భారత్‌కు మద్దతు పలకడమే శ్రేయస్కరమని బ్రిటన్‌కు ఆ దేశాలన్నీ నచ్చజెప్పి ఉండొచ్చు.

నిజానికి సమితిలో ఆఫ్రికా దేశాలకున్నట్టు మనకంటూ ప్రత్యేక గ్రూపు లేదు. ఆర్ధికంగా, అభివృద్ధిపరంగా అవి వెనకబడిన దేశాలే కావొచ్చుగానీ ఆ 54 దేశాలూ ఏ విషయంలోనైనా కలిసికట్టుగా వ్యవహరిస్తాయి. ఏ పదవికైనా ఎన్ని కలొచ్చినప్పుడు ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాయి. ఇతర దేశాల ప్రతినిధులను కూడా సమీకరించి గెలిపించుకుంటాయి. భారత్‌ పరిస్థితి అలా కాదు. ఒకప్పటి బ్రిటన్‌ వలస దేశాలు సభ్యులుగా ఉన్న కామన్వెల్త్‌లో ఒక్కో దేశానిది ఒక్కో దారి. ఈ సంస్థలోని యూరప్‌ ఖండ దేశాలు సహజంగా బ్రిటన్‌కు మద్దతునిస్తాయి. ఆసియా, పసిఫిక్, దక్షిణ అమెరికా దేశాల్లో కూడా భిన్నా భిప్రాయాలుంటాయి. అటు ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ(ఓఐసీ) సభ్యదేశాలు కూడా సమైక్యంగా ఉంటాయి. ఆ దేశాలు బలపర్చడంవల్ల లెబనాన్‌కు చెందిన నవాఫ్‌ సలాం గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీని, సంఖ్యాపరంగా చెప్పాలంటే 121 ఓట్లను చేజి క్కించుకుంది.

జస్టిస్‌ భండారీ ఎన్నికతో ఐసీజేలో ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆ సంస్థ 71 ఏళ్ల చరిత్రలో తొలిసారి బ్రిటన్‌కు అందులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పైగా ఆసియా నుంచి సంస్థకు ఈసారి నలుగురు న్యాయమూర్తులు ఎన్నికయ్యారు. అసలు భద్రతామండలిలో అయిదు అగ్రరాజ్యాలకున్న శాశ్వతసభ్యత్వమే పరమ అప్రజాస్వామికమైనది. పైగా ఆ అయిదింటికీ వీటో అధికారముంది. ఇప్పుడు ఐసీజే ఓటింగ్‌ను కూడా అవి తల్చుకుంటే నిలిపివేసేవి. కానీ సమితిలో ఇంత భారీ యెత్తున మద్దతు లభించిన నిర్ణయానికి అడ్డు తగిలితే ఆ చర్య దేనికి దారి తీస్తుందోనన్న సందేహం ఏర్పడటంవల్ల అవి వెనకడుగేశాయి. ఈ ఎన్నిక మన దేశానికి కూడా మంచి అనుభవాన్నిచ్చింది. కీలక సమయాల్లో వర్ధమాన దేశాలతో కలిసి అడుగేస్తే, సమస్యలేర్పడినప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే ఆ దేశాలు దృఢంగా మన వెనకుంటాయని ఈ ఎన్నిక చాటిచెప్పింది. ఆ పరిస్థితుల్లో అగ్ర రాజ్యాలు కూడా వెనకడుగేయక తప్పదని రుజువైంది. ఆ కోణంలో జస్టిస్‌ భండారీ విజయం ఎన్నదగినది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top