‘కరోనా’ కలవరం!

Corona Virus Spreading Speedily - Sakshi

‘శరచ్చంద్రిక’ కవితా ఖండికలో మహాకవి శ్రీశ్రీ జాబిల్లికి మానవజాతి ప్రోగ్రెస్‌ రిపోర్టు అందజేస్తూ ‘...చికిత్స లేదనుకున్న వ్యాధులు/చిత్తగిస్తున్నాయి పరారీ’ అంటూ ఒకింత గర్వంగా చెప్పాడు. కానీ పరారవుతున్న వ్యాధులకు మించిన ప్రాణాంతక లక్షణాలతో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి మానవాళిపై దాడి చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా చైనాలోని వూహాన్‌లో బయటపడిందంటున్న వైరస్‌ ఆ బాపతే. ఆ మహమ్మారి తీరుతెన్నులేమిటో, దాని ఊరూ పేరూ ఏమిటో, ఎక్కడినుంచి వచ్చిందో నిర్ధారించేలోగానే అది 17మందిని పొట్టనబెట్టుకుంది. మరో 554మందిని చావుబతుకుల్లోకి నెట్టింది. ఈలోగా మా దేశంలోనూ ఒక యువకుడు ఆ వైరస్‌ బారిన పడ్డాడని అమెరికా ప్రకటించింది. ఇంకా హాంకాంగ్, మెక్సికో, థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియాల్లో  వైరస్‌ జాడలు కనబడ్డాయి. సౌదీ అరేబియాలోని ఆసుపత్రిలో పనిచేస్తున్న కేరళ నర్సుల్ని పరీక్షిస్తే వారిలో దాదాపు వందమంది పాజిటివ్‌ అని తేలిందని, ఒకరికి వ్యాధి సోకిందని అక్కడినుంచి అందుతున్న సమా చారం వల్ల తెలుస్తోంది. అంటే వ్యాధి ఖండాంతరాలు దాటిందన్నమాట! కనుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) గురువారం అత్యవసరంగా భేటీ అయింది. వ్యాధి సోకిన రోగులనుంచి రక్త నమూనాలు సేకరించి, వైరస్‌ జన్యు అమరిక ఎలావుందో తరచి చూసిన శాస్త్రవేత్తలు... ఇది పది హేడేళ్లనాడు ప్రపంచాన్ని వణికించి, వందలాదిమందిని బలితీసుకున్న ‘సార్స్‌’ను పోలివుందని తేల్చిచెప్పారు.

అయితే జన్యుపరంగా ఇది ‘సార్స్‌’ కుటుంబానికే చెందినదైనా, తీవ్రతలో దాన్ని మించిపోయిందని, ఇది సరికొత్తదని వారు చెబుతున్న మాట. కనుక ప్రపంచం అప్రమత్తంగా ఉండక తప్పదు. ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌ను ఉపయోగించి తీసిన వైరస్‌ ఛాయాచిత్రం చూస్తే అది అచ్చం సూర్యుడి చుట్టూ ఆవరించేవుండే కరోనాను పోలివుంది. కనుకనే దీనికి వారు కరోనా వైరస్‌ 2019–ఎన్‌ సీవోవీ అని నామకరణం చేశారు. గాలి ద్వారా పెను వేగంతో వ్యాపించే ఈ వైరస్‌ జంతు వులు, పక్షుల్లో చేరి, వాటినుంచి మనుషులకు సంక్రమిస్తోంది. మనుషుల మధ్య కూడా వేగంగా వ్యాపిస్తోంది.  వైరస్‌కు మూలం మాత్రం చైనాలోని రెండు రకాల విషసర్పాల్లో వుందని శాస్త్రవేత్తల నుకుంటున్నారు. పక్షులు, సర్పాలు, పందికొక్కులు, ముళ్లపందులు, మనుషులు వగైరాల్లో ఉండే ప్రొటీన్‌ కోడ్‌తో  కరోనా వైరస్‌లోని ప్రొటీన్‌ కోడ్‌ను పోల్చగా ఆ రెండు రకాల పాముల్లోని కోడ్‌తో సరిపోయిందని వారు నిర్ధారణకొచ్చారు. చల్లటి నెత్తురు, వేడి నెత్తురు ప్రవహించే జీవులు రెండింటి లోనూ ఈ వైరస్‌ దర్జాగా ఉండగలగడం శాస్త్రవేత్తలను విస్మయపరుస్తోంది. చైనాలో బయటపడిన కరోనా వైరస్‌ మూలాలు అక్కడి సీఫుడ్‌ మార్కెట్‌లో ఉన్నాయని నిర్ణయించి ఆ మార్కెట్లన్నింటినీ మూసేశారు. ఇప్పుడు 2 కోట్లమంది నివసించే వూహాన్, హువాంగాంగ్‌ నగరాలు రెండింటినీ మూసి వేశారు. వాటితో బయటి ప్రాంతాలకు అన్ని రకాల రవాణా సంబంధాలనూ నిలిపేశారు.

ఈ వ్యాధి సోకిన రోగులకు దూరంగా వుండటం, చేతులు తరచు శుభ్రపరుచుకోవడం, పశువులు, పశు మార్కె ట్లకు దూరంగా వుండటం అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఎన్నో రకాల వ్యాధులు పుట్టుకొచ్చి హడలెత్తించాయి. సార్స్, మెర్స్, స్వైన్‌ ఫ్లూ, ఎబోలా, జికా... వీటి పేర్లు వింటేనే గుండెలదురుతాయి. ఇవన్నీ తమ తమ మార్గాల్లో మరణ మృదంగాన్ని మోగించినవే. వీటిని మట్టుబెట్టే మందు కనుక్కునేసరికి చడీచప్పుడూ లేకుండా నిష్క్రమించినట్టు కనిపిస్తాయి. మళ్లీ ఎప్పుడో, ఎక్కడో బయటపడుతుంటాయి. ఈ వ్యాధులు మొదలైనప్పుడు ప్రతిసారీ లక్షణాలు ఒకేలా కనబడుతుంటాయి. గందరగోళ పెడతాయి. సాధారణ జ్వరంగా రావడం, బలహీనపడిపోవడం, తలనొప్పి రావడం, కండరాల నొప్పులు ఏర్పడటం వగైరాలన్నీ మామూలే.  ఇప్పుడు కరోనా వైరస్‌ గురించి అటువంటి మాటలే చెబుతున్నారు. జ్వరం, దగ్గుతో శ్వాస కోశ, ఉదరకోశ సమస్యలు ఏర్పడటం, విరోచనాలు మొదలుకావడం కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలు. అది ముదిరేకొద్దీ రోగికి తీవ్ర సమస్యలు ఏర్పడతాయి. న్యుమోనియా, మూత్ర పిండాల వైఫల్యం వంటివి చోటుచేసుకుంటాయి. లోగడ వ్యాధి పుట్టుకొస్తే అది ఒక ప్రాంతానికి పరిమితమయ్యేది. మహా అయితే ఇరుగు పొరుగు ప్రాంతాలకు సోకేది. కానీ ప్రపంచీకరణ తర్వాత పరిస్థితులు మారాయి. చదువు, కొలువు, వ్యాపారం తదితరాల కోసం వేలాదిమంది దేశాలు పట్టిపోతున్నారు.

లక్షలాదిమంది ఒక దేశం నుంచి మరో దేశానికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. కనుక ఎక్కడైనా వ్యాధి అంటుకుందంటే చాలు... అది విశ్వవ్యాప్తం కావడానికి వారాలు, నెలలూ కాదు... కొన్ని రోజులే సరిపోతోంది. చైనాలో గత డిసెంబర్‌ చివరిలో బయటపడిన కరోనా వైరస్‌ చకచకా అనేక దేశాలకు వ్యాపించిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. ఏ వైరస్‌ కూడా ఇంత వేగంగా గతంలో వ్యాపించలేదు. ఆశ్రయించిన జీవిలో ప్రతికూల పరిస్థితులుంటే, దాన్ని అధిగమించేందుకు అనే కానేకసార్లు జన్యు పరివర్తన చెంది, విస్తరించడం ఏ వైరస్‌కైనా వుండే ప్రధాన లక్షణం. ఇలా ఒక జీవి నుంచి మరో జీవికి వ్యాపించే క్రమంలో అది ఎన్నో మార్పులకు లోనై కొరకరాని కొయ్యగా మారుతుంది. వ్యాధులైనా, ఆరోగ్య స్థితిగతులైనా మన చుట్టూ వుండే పరిసరాలకు ప్రతిబింబాలు. సహజ వనరులు విధ్వంసమవుతూ, పట్టణీకరణ విస్తరిస్తూ, మురికివాడలు పెరుగుతూ ప్రకృతి వైపరీ త్యాలకు కారణమవుతున్నాయి. పర్యవసానంగా ఆరోగ్యపరంగా కొత్త కొత్త సవాళ్లు ఎదురవు తున్నాయి. పాత వ్యాధులకు కొత్త చికిత్సలు కనుక్కునేలోగానే... సరికొత్త రోగాలు తమ లోతు కనుక్కోమంటూ మానవాళికి సవాళ్లు విసురుతున్నాయి. ప్రకృతికి అనువైన జీవనం సాగిస్తూ పరి శుభ్రత, పారిశుద్ధ్యం వగైరాలపై శ్రద్ధ పెట్టనంతకాలం ఈ సవాళ్లు ఎదుర్కొనక తప్పదని అన్ని దేశాల్లోని ప్రభుత్వాలూ, ప్రజలూ గుర్తించాల్సి వుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top