ఎన్నారై భర్తలపై కొరడా

Centre to change CrPC to punish NRIs who desert their wives - Sakshi

విదేశాల్లో ఉద్యోగం.. లక్షల్లో జీతం... అక్కడ సొంత ఇల్లు, సొంత కారు–ఇలాంటి ఆకర్షణీయమైన కబుర్లు చెప్పి పెళ్లాడి, తీరా వెళ్లాక భార్యను శారీరకంగా, మాన సికంగా కష్టపెడుతున్న ప్రవాస భారతీయ (ఎన్నారై) యువకుల భరతం పట్టేందుకు భారతీయ శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ)లో అవసరమైన నిబంధనలు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగింది.

పెళ్లి చేసుకుని దేశంగాని దేశానికి కొత్తగా వెళ్లిన యువతులు అనుభవిస్తున్న కష్టాల గురించి దశాబ్దాలుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంతక్రితం కలిగిన కుటుంబాలకే ఇలాంటి సమస్యలుండేవి. కానీ 90వ దశకం తర్వాత విదేశాల్లో లక్షలమందికి సాఫ్ట్‌వేర్‌ రంగ నిపుణులుగా ఉద్యోగావకాశాలు లభించడం పర్యవసానంగా మధ్య తరగతి ప్రజానీకాన్ని కూడా ఆ సమస్యలు తాకాయి. విదేశీ సంబంధమని మోజు పడి పెళ్లి చేసి పంపితే అక్కడ బాధల్లో కూరుకుపోతున్న కుమార్తెల విషయంలో ఏం చేయాలో తోచక వేలాదిమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. యువతుల్ని చిత్రహింసలపాలు చేయడం అర్ధాంతరంగా వెళ్లగొట్టడం రివాజైంది. మరికొందరు ఘనులు పెళ్లాడి ముచ్చట్లన్నీ తీర్చుకుని, కట్న కానుకలతో విదేశాలకు పోయి అక్కడినుంచి విడాకుల నోటీసులు పంపుతున్నారు.

ఎన్నారైలకు ప్రాతినిధ్య ఓటింగ్‌ హక్కు కల్పించడానికి చాన్నాళ్లనుంచి మన ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. కానీ ఇలాంటి మహిళల ఇబ్బందులపై ఈ స్థాయిలో దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. తాజా నిర్ణయంతో ఆ లోటు సరిదిద్దినట్టవుతుంది. మన విదేశాంగశాఖ వెల్లడించిన గణాంకాలు విస్మయం కలిగిస్తాయి. 2015 జనవరి మొదలుకొని నిరుడు నవంబర్‌ వరకూ ఆ శాఖకు 3,328 ఫిర్యాదులందాయి. వాటి ఆధారంగా ప్రతి 8 గంటలకూ ఒక ఫిర్యాదు వస్తున్నదని ఆ శాఖ వివరించింది. అంటే రోజుకు మూడు ఫిర్యాదులందుతున్నాయన్నమాట. అయితే బాధిత మహిళల అసలు సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. అన్ని దారులూ మూసుకుపోయాకే ఏ యువతి అయినా ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తుంది. నిందితుల్లో 60 శాతం మంది యువకులని ఆ గణాంకాలు చెబుతున్నాయి.

వివిధ రంగాల్లో ఎంతగా పురోగతి సాధించామనుకుంటున్నా మన దేశంలో మహిళలపై వేర్వేరు రూపాల్లో వివక్ష, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. విదేశాలకు పోయే యువకులు తమతోపాటు ఈ కశ్మలాన్నంతటినీ మోసుకు పోతున్నారు. కుటుంబాల్లో యధావిధిగా తమ ఆధిపత్య ధోరణులను ప్రదర్శి స్తున్నారు. ఇక్కడిలాగే మన సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆ దేశాల్లో సైతం మన మహిళలకు అవరోధంగా మారుతున్నాయి. వీటిని ధిక్కరించి ఫిర్యాదు చేద్దామనుకున్నా ఎక్కడికెళ్లాలో, ఎలా వెళ్లాలో, ఎవరితో మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితి. కొత్తగా కాపురానికెళ్లినవారికి ఇవన్నీ పెను అవ రోధాలవుతున్నాయి. వీటిని అధిగమించి ఫిర్యాదు చేసినా అక్కడి పోలీస్‌ అధి కారులకు సమస్యేమిటో అవగాహన కావడం కష్టమవుతోంది. భర్తతో సమానంగా ఉద్యోగం చేసే మహిళ పరిస్థితి ఎంతో కొంత మెరుగు. ఆమె స్వతంత్రంగా జీవనం సాగిస్తూ సమస్యలపై పోరాడగలదు. కానీ హెచ్‌ 4 వీసాపై అమెరికాలో ఉంటున్న ఆడపిల్లలది దుర్భరస్థితి. వారు తప్పనిసరిగా భర్త సంపాదనపైనే ఆధారపడాలి. ఇక్కడ పెళ్లాడటం, అక్కడికెళ్లాక ఆ దేశాల్లోని విడాకుల చట్టం ప్రకారం వదుల్చు కోవడం ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. అక్కడేం చేసినా అడిగే దిక్కుండదు... అత్తింటివారికి తెలియకుండా భారత్‌ వచ్చి దర్జాగా తిరిగి వెళ్లొచ్చునన్న భరోసా ఎన్నారై యువకుల్లో ఉంటున్నది. సీఆర్‌పీసీలో మార్పులు తీసుకురావాలన్న తాజా నిర్ణయం వల్ల ఇకపై ఇది అసాధ్యమవుతుంది.

ప్రతిపాదిత నిబంధనల ప్రకారం భార్యలను విడిచిపెట్టిన కేసుల్లో న్యాయస్థానాలు జారీ చేసే సమన్లను  వరసగా మూడుసార్లు బేఖాతరు చేసి నట్టయితే అలాంటివారిని ‘పరారీలో ఉన్న వ్యక్తులు’గా పరిగణించి వారి ఆస్తుల్ని, వారి తల్లిదండ్రుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు న్యాయస్థానాలు ఆదే శాలివ్వొచ్చు. దీంతోపాటు విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో పెట్టే సమన్లకు చట్టబద్ధత కల్పించడానికి అనువుగా సీఆర్‌పీసీ నిబంధనలను సవరించాలని కేంద్ర హోం శాఖను విదేశాంగ శాఖ కోరింది. ఇది కూడా ఆహ్వానించదగ్గ మార్పు. సమన్లు తీసుకోవడానికి నిరాకరించినవారి ఇంటి తలుపుపైనో, గోడపైనో ఆ సమన్లను అతికిస్తే చట్టం దృష్టిలో ఆ సమన్లు వారికి అందినట్టే. ఇప్పుడు వెబ్‌సైట్‌లో ఉంచే నోటీసులకు కూడా ఇదే సూత్రం వర్తింపజేయడం మంచి ఆలోచన. అలా మూడుసార్లు వెబ్‌సైట్‌లో పెట్టాక నిందితుల ఆస్తుల స్వాధీనం ప్రక్రియ మొదలవుతుంది.

చూడటానికిది మొత్తంగా ‘ఎన్నారై వధువుల’ సమస్యేగానీ ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. కేవలం భార్య ద్వారా సంక్రమించే ఆస్తిపై కన్నేసి కొందరు, ఇంట్లో ఉండే వృద్ధ తల్లిదండ్రుల అవసరాలు చూసుకోవడానికి ఇంకొందరు, జీతం ఇవ్వనవసరం లేని పనిమనిషిగా భావించి మరికొందరు యువతుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. పంజాబ్‌ నుంచి అయ్యే పెళ్లిళ్లలో 80 శాతం ఈ బాపతేనని గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, గుజరాత్‌ రాష్ట్రాలున్నాయి. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేయడం, గృహ హింసకు పాల్పడేవారిని, భార్యల్ని విడిచిపెట్టేవారిని అప్పగించేందుకు విదేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం, అందుకొక ప్రత్యేక వెబ్‌సైట్‌ పెట్టడం వంటి చర్యలు కూడా చాలా అవసరం. సంబంధం కుదుర్చుకోవడానికి ముందు అవతలి వ్యక్తి ఇచ్చిన సమాచారంలోని నిజా నిజాలేమిటో నిర్ధారించుకోవడం అవసరమన్న చైతన్యం అమ్మాయిల తల్లిదండ్రుల్లో కలగజేయడం అన్నిటికన్నా ముఖ్యం. ఇవన్నీ సాకారమైనప్పుడే పెళ్లి చేసి పంపిన మన ఆడపిల్లలు విదేశాల్లో క్షేమంగా, హుందాగా, గౌరవప్రదంగా బతక గలుగుతారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top