రాణితోటపై రాబందుల కన్ను | vultures eyes on the rhini garden | Sakshi
Sakshi News home page

రాణితోటపై రాబందుల కన్ను

Jun 24 2017 10:45 PM | Updated on Sep 5 2017 2:22 PM

రాణితోటపై రాబందుల కన్ను

రాణితోటపై రాబందుల కన్ను

ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కొందరు రాబంధులా వాలిపోతున్నారు.

– 10 ఎకరాల ప్రభుత్వ స్థలం కాజేసేందుకు యత్నం
– ప్రజావసరాలకు కేటాయించాలని  గ్రామ పెద్దలు డిమాండ్‌
– రెండు పర్యాయాలు పేదలకు పట్టాలిచ్చి... స్థలాలు చూపని వైనం
 
ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కొందరు రాబంధులా వాలిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేయాలని పథకాలు రచిస్తారు. మండల పరిధిలోని చిన్నటేకూరు గ్రామ రెవెన్యూలోని పది ఎకరాల రాణితోటపై ఇప్పుడు కొందరి కన్ను పడింది.  పరిశ్రమల స్థాపన పేరుతో కాజేసేందుకు  ప్రయత్నాలు ముమ్మరం  చేశారు. 
 
కల్లూరు: 44వ నంబరు జాతీయ రహదారి పక్కనే  రాణితోట పేరుతో  10.81 ఎకరాల భూమి ఉంది.  89 సర్వే నెంబరులో 4.47 ఎకరాలు, 90/2లో 3.44 ఎకరాలు, 92/2లో 2.90 ఎకరాలు ఉంది.  ప్రజల అవసరాలకు ఈ భూమిని కేటాయించాలని గ్రామ పెద్దలు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది.  ప్రస్తుతం భూ విలువలు భారీగా పెరగడంతో  కొందరు అక్రమార్కులు ఈ భూమిని కబ్జా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.  అందులో బడా వ్యాపార, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇటీవల శంకర్‌ అనే ప్రైవేట్‌ వ్యక్తి ఈనెల 17వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జేసీబీ సహాయంతో ముళ్లపొదలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. గమనించిన గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌ను సంఘటన స్థలానికి పంపించి అక్రమార్కులు చేపట్టిన పనులను నిలిపివేయించారు.  పరిశ్రమల స్థాపన, ఇతర యూనిట్ల స్థాపన పేరుతో కొందరు రాణితోట స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఆర్‌డీఓ, తహసీల్దార్, వీఆర్‌ఓలు స్థలాలను నిత్యం పరిశీలిస్తూనే ఉన్నారు. ఈనెల 22న ఆర్‌డీఓ, తహశీల్దార్‌లు, 23న కల్లూరు, కర్నూలు వీఆర్‌ఓలు స్థలాన్ని,  మ్యాప్‌లను పరిశీలించారు. 
 
 ప్రజా ప్రతినిధులకు విన్నవించినా స్పందన కరువు
 పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామ పెద్దలు డిమాండ్‌ చేయగా  2004లో 270 మంది పేదలకు ఒక్కొక్కరికి 1.50 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తూ నాటి రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు జారీ చేశారు. పట్టాలు పొందిన వారికి స్థలాలు చూపించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు. అనంతరం కల్లూరు మండలం అర్బన్, రూరల్‌ మండలాలుగా విభజన కానున్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. రూరల్‌ మండలం అయితే చిన్నటేకూరు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుచేసి రాణితోట 10 ఎకరాలలో ప్రభుత్వ భవనాలను ఏర్పాటు చేసేందుకు సద్వినియోగం చేసుకోవాలని భావించారు.
 
మళ్లీ రెండవ పర్యాయం 2014లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు నాటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి విశ్వప్రయత్నం చేశారు. పట్టాలు రూపుదిద్దుకున్నా పంపిణీకి నోచుకోలేదు. ఏడాది క్రితం మళ్లీ గ్రామపెద్దలు డిప్యూటీ సీఎం కేఈ క​ృష్ణమూర్తిని కలిసి రాణితోట స్థలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు క్రీడా మైదానం ఏర్పాటుచేయాలని విన్నవించారు. మరోపక్క హైదరాబాద్‌ శిల్పారామం నుంచి కొందరు  స్థలం కావాలని ప్రతిపాదనలు అందజేసినట్లు సమాచారం. ఇందుకోసం వీఆర్‌ఓ స్థలాన్ని పరిశీలించినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.  
 
జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలి : మల్లికార్జున, చిన్నటేకూరు
చిన్నటేకూరు గ్రామానికి సమీపంలో ఉలిందకొండ, లక్ష్మీపురం, బొల్లవరం, పర్ల గ్రామాల్లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ పదవ తరగతి ఉత్తీర్ణులైన వారందరూ జూనియర్‌ కళాశాలలో చేరాలంటే కర్నూలు నగరానికి వెళ్లాలి.  చిన్నటేకూరులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను రాణితోటలో ఏర్పాటుచేస్తే  5 గ్రామాల్లోని విద్యార్థులకు ఉన్నత చదువు అందుతుంది. 
 
ఇతరులకు కట్టబెడితే ఊరుకోం: రామాంజనేయులు, మండల ఉపాధ్యక్షుడు
రాణితోట స్థలంలో పేదలకు ఇళ్లు కేటాయించాలి. రూరల్‌ మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఆ స​‍్థలంలో ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా వ్యాపార వేత్తలకు, పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయిస్తే గ్రామస్తులమంతా కలిసి ఉద్యమిస్తాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement