
మోదీని కలవను
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తాను ప్రధానమంత్రి మోదీని కలవనని, తనకు ఆ అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు.
* ఆ అవసరం నాకు లేదు: సీఎం చంద్రబాబు
* మా ఎంపీలు కలుస్తారు..హోదాపై బాబు మళ్లీ సన్నాయి నొక్కులు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తాను ప్రధానమంత్రి మోదీని కలవనని, తనకు ఆ అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీపీగా తమ ఎంపీలు ప్రధాని అపాయింట్‌మెంట్ అడిగి.. కలుస్తారని తెలిపారు. పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద సోమవారం ఆవేదన (నిరసన అనే పదం ఉచ్చరించకుండా.. దాన్ని నిరసన అంటారో మరేం అంటారో అంటూ..) తెలుపుతారని సన్నాయి నొక్కులు నొక్కారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో తాజా పరిణామాలపై ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో అరుణ్‌జైట్లీ ఇచ్చిన సమాధానం తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు. సంకీర్ణంలో ఉన్నాం కాబట్టి హోదా తాను కోరడంలేదని, చట్టంలో ఉన్నవి అడుగుతున్నానని చెప్పారు.
బీజేపీయే ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలందని, ఆర్థిక సంఘం ఉందని ఆరోజు తెలుసు కదా ఎందుకు హోదా గురించి పట్టుబట్టిందని ప్రశ్నించారు. ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని ప్రధానికి ఓటు వేశారని కేంద్రానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలన్నీ ప్రధానికి చెప్పి పరిష్కారం చేయాలని కోరతామని, ఆయన ఏంచేస్తారో చూశాక కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
జపాన్ తరహా నిరసన...
ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో ధర్నాలు, బంద్‌లు చేయడం సరికాదన్నారు. ఢిల్లీలో పోరాడాలని అది చేయకుండా ఇక్కడ బంద్ చేయాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని అనుకోవద్దని చెప్పారు. జపాన్ తరహాలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని రోడ్లు ఊడ్చి, చెట్లు నాటాలని కోరారు. ఒక నాయకుడు ఈ సమయంలో తన గురించి మాట్లాడుతున్నాడంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పరోక్షంగా విమర్శించారు.
కేసులు పెడతారని భయపడి తాను అడగడంలేదంటున్నారని, ఎందుకు కేసులు పెడతారని ప్రశ్నించారు. పేపరు ఉంది కదా అని ప్రతీ దానికి పేజీలు పేజీలు రాస్తున్నారని, టీవీ పెడితే 24 గంటలూ అదే చూపిస్తున్నారని సాక్షిపై శివాలెత్తారు. ప్రతిరోజూ ఆ పత్రికలో (సాక్షి) రాసే వార్తలకు సమాధానం చెప్పుకోవాల్సివస్తుందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మున్ముందు ఏవిధంగా నిరసనలు తెలుపుతారని విలేకరులడిగిన ప్రశ్నకు తానిప్పుడే ఏదీ చెప్పలేనన్నారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ఒత్తిడి చేయొచ్చుకదా అని అడగ్గా.. హోదాకు రాజ్యసభలో అన్ని పార్టీలు మద్దతిచ్చినా జరగలేదని ఇక్కడి నుంచి నలుగురైదుగురిని తీసుకెళితే ఉపయోగం ఉండదన్నారు. కేంద్రం సహకరించకపోయినా ఇటీవల బీజేపీకి చెందిన సురేష్ ప్రభుకు ఎందుకు రాజ్యసభ సీటిచ్చారని ప్రశ్నించగా రైల్వే శాఖలో పనులవుతాయని, న్యాయం చేస్తారని ఆశించానని తెలిపారు. బీజేపీపై వ్యక్తిగత విమర్శలకు పోవద్దని తమ పార్టీ నేతలకు చెబుతున్నానన్నారు.
విలేకరులపై అసహనం...
30 సార్లు మీరు ఢిల్లీ వెళ్లి అడిగితే జరగని న్యాయం ఇప్పుడు ఎంపీలు వెళ్లి అడిగితే జరుగుతుందా అని విలేకరులు ప్రశ్నించగా బాబు సూటిగా సమాధానం చెప్పలేదు. అనుభవజ్ఞుడైన నేతగా తానేం చేయాలో అది చేస్తానన్నారు. కేంద్రంపై ఎలా పోరాడతారని ప్రశ్నించగా విలేకరులపై అసహనం వ్యక్తం చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టించవద్దంటూ దాట వేశారు.
అపాయింట్‌మెంట్ ఇవ్వండి...
రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన అంశాలపై అత్యవసరంగా మాట్లాడేందుకు ప్రధాని మంత్రి మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా ఆయన కార్యాలయ ప్రత్యేక అధికారి సంజయ్ భవసర్‌కు లోక్‌సభలో టీడీపీ పక్ష నేత తోట నరసింహం ఆదివారం లేఖ రాశారు. లేఖపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఎంపీలు గల్లా జయదేవ్, కె.రామ్మోహన్‌నాయుడు సంతకాలు చేశారు.