సీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
రాయలసీమ అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు.
– అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం
– డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి చినరాజప్ప
మహానంది: రాయలసీమ అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు. ఆదివారం బుక్కాపురం గ్రామంలో నిర్వహించిన జనచైతన్య యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమలో నీటిసమస్య ఉందని, పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుమారు రూ.20వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం నిధులు కేటాయించి వారికి రుణాలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మహానంది మండలంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానన్నారు. రాళ్లవాగు, బుక్కాపురం ఇంజవాణి చెరువుల వద్ద భారీ వర్షాలు వస్తే అలుగులుదాటి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని యువకుడు నాగేశ్వరరెడ్డి చెప్పడంతో స్పందించిన డిప్యూటీ సీఎం వంతెనల నిర్మాణాలకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీపీ చింతం నాగమణి, తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు భాస్కరరెడ్డి, మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.