
ముద్దిరెడ్డిపల్లిలో దారుణం
పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం తల్లీకూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
హిందూపురం అర్బన్ : పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం తల్లీకూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. ముద్దిరెడ్డిపల్లికి చెందిన రమేష్, రాజేశ్వరి (30) దంపతులు మగ్గం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. చిన్న కుమార్తె పద్మశ్రీ (10)కి మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటోంది.
కాగా శనివారం పద్మశ్రీకి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కలత చెందిన తల్లి దిగాలుగా ఉండేది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి రాజేశ్వరి(30), కుమార్తె పద్మశ్రీ(10) మగ్గం కడ్డీలకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం బయటి నుంచి వచ్చిన కుటుంబసభ్యులు కడ్డీకి వేలాడుతున్న శవాలను చూసి కన్నీరు మున్నీరయ్యారు. శవాలను కిందకు తీసి వన్‌టౌన్ పోలీసుకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాపు చేపట్టారు. పరీక్షల నిమిత్తం శవాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అయితే తల్లికుమార్తె ఆత్మహత్య చేసుకోవడం ముద్దిరెడ్డిపల్లిలో చర్చానీయాంశంగా మారింది.