5,054 | Sakshi
Sakshi News home page

5,054

Published Sat, Jun 3 2017 12:27 AM

5,054 - Sakshi

∙ గుర్తించిన జిల్లా యంత్రాంగం
∙ రేపు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేత
∙ అనర్హుల్లో ఎక్కువమంది వితంతువులే


రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఒంటరి మహిళల లెక్క తేలింది. 5,054 మంది అర్హులను గుర్తించారు. ఏ ఆధారమూ లేని వీరి ఎదురుచూపులకు రెండు రోజుల్లో మోక్షం లభించనుంది. జీవనభృతి కోసం గుర్తించిన ఈ లబ్ధిదారులకు ఆదివారం ప్రొసీడింగ్స్‌ అందజేయనున్నారు. ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం చేసే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. గత నెల 8 నుంచి 25 తేదీ వరకు ఒంటరి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

జిల్లాలో నాలుగు వేల వరకు దరఖాస్తులు రావచ్చని అధికారులు తొలుత అంచ నా వేశారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,017 దరఖాస్తులు అందాయి. వీటిని గత నెల 26 నుంచి 31వ తేదీ వరకు రెండు దశల్లో అధికారులు పరిశీలన చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి పూర్వపరాలు ఆరా తీసి పరిశీలన జరిపారు. ఆ తర్వాత దశలో అన్ని దరఖాస్తుల్లో 10 శాతం రాండమ్‌గా మరోసారి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల మేరకు ఉన్న 5,054 మంది అర్హులను జీవనభృతికి ఎంపిక చేశారు. రెండు రోజుల కిందటే ఈ జాబితా ఖరారైంది. కలెక్టర్‌ రఘునందన్‌ రావు కూడా జాబితాకు ఆమోదముద్ర వేశారు. అనర్హుల్లో చాలామంది వితంతువులే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఏదో ఒక పెన్షన్‌ పొందుతున్న వాళ్లూ దరఖాస్తుదారుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిని తిరస్కరించామని వివరిస్తున్నారు. అర్హత సాధించిన వారిలోనూ 80 శాతం విడాకులు తీసుకున్న లబ్ధిదారులే ఉన్నారని సమాచారం. మిగిలిన వారు అవివాహితులై తల్లిదండ్రులపై ఆధారపడిన వారేనని తెలిసింది.

ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా..
గుర్తించిన లబ్ధిదారులకు ఆదివారం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రొసీడింగ్స్‌ అందజేయనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ నియోజవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ద్వారా ప్రొసీడింగ్స్‌ని లబ్ధిదారులకు అప్పగిస్తారు. మండల కేంద్రాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో ఆ తంతు జరగనుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో ఏప్రిల్, మే నెలలకు సంబంధించి రూ. వెయ్యి చొప్పున మొత్తం రూ. 2వేలు జమ చేస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే బ్యాంకు ద్వారా డబ్బులు అందుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా అందజేస్తారు. వీరికి వారంలోగా భృతి అందే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అప్పటికప్పుడే వారి వేలిముద్రలు తీసుకుని డబ్బులు అందజేస్తారని పేర్కొంటున్నారు.


మొత్తం లబ్ధిదారులు :     5,054
గ్రామీణ ప్రాంతాల్లో :     3,300
జీహెచ్‌ఎంసీ పరిధి :    1,352
షాద్‌నగర్‌ మున్సిపాలిటీ :     78
మీర్‌పేట మున్సిపాలిటీ :         56
జిల్లెలగూడ మున్సిపాలిటీ :     37
జల్‌పల్లి మున్సిపాలిటీ :     62
బడంగ్‌పేట నగర పంచాయతీ :     79
ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ :     26
పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీ :     64

Advertisement
 
Advertisement
 
Advertisement