మంత్రి ప్రత్యేక పూజలు
రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సోమవారం ఆయన స్వగ్రామమైన దీపాయిగూడలో ప్రత్యేక పూజలు చే శారు.
జైనథ్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సోమవారం ఆయన స్వగ్రామమైన దీపాయిగూడలో ప్రత్యేక పూజలు చే శారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ గణేశ్ మండల్ వద్ద ఆయన ప్రజలతో కలిసి పూజాది కార్యక్రమాల్లో పాల్గొని, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన గ్రామంలో ఉచితంగా వినాయకుడి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణానికి హాని తలపెట్టని మట్టి విగ్రహాలను వాడాలని ప్రజలకు సూచించారు. రసాయనాలతో తయారు విగ్రహాలను వాడటం వలన నీరు, వాతావరణం కలుషితమవుతుందని వివరించారు. వినాయక చవితి ఉత్సవాలను సామరస్యంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన కోరారు.
రైతులతో ముచ్చట్లు...
గ్రామంలో వేసిన పంటలు, వాటి పరిస్థితి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన సొంత భూమిలో ఎకరం విస్తీర్ణంలో సాగు చేస్తున్న పసుపు పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో కలిసి ముచ్చటించి, కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.
కాగా గ్రామ మాజీ సర్పంచ్ బొల్లి గంగన్న తండ్రి హన్మండ్లు వయసు పైబడటంతో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మంత్రి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడారు.మంత్రి వెంట నాయకులు తల్లెల చంద్రయ్య, సర్సన్ లింగారెడ్డి, అశోక్, దుర్ల నడిపెన్న, కరుణాకర్ తదితరులు ఉన్నారు.