'ఖాకీ'చకుడు అరెస్ట్ | MedicalStudent Sexually Assaulted In nellore, Accused constable Arrested | Sakshi
Sakshi News home page

'ఖాకీ'చకుడు అరెస్ట్

Oct 26 2016 6:49 PM | Updated on Oct 17 2018 5:51 PM

నిందితుడు (ఫైల్) - Sakshi

నిందితుడు (ఫైల్)

మెడికో విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఘటనలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులోని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్‌ను ఎట్టకేలకు బుధవారం అరెస్ట్ చేశారు.

- ‘నిర్భయ’ సెక్షన్ల కింద కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): మెడికో విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఘటనలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులోని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్‌ను ఎట్టకేలకు బుధవారం అరెస్ట్ చేశారు. బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ సీహెచ్ రామారావు నిందితుడి వివరాలను వెల్లడించారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన పాలేపు గోపి బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్‌లో నాలుగున్నరేళ్లుగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 20వ తేదీ రాత్రి బాలాజీనగర్‌లోని పద్మావతి గ్రీన్‌సిటీ సమీపంలో కారులో ఇద్దరు మెడికో విద్యార్థులు కూర్చొని మాట్లాడుకుంటుండగా గోపి అక్కడకువెళ్లి సెల్‌ఫోన్‌లో వారిని ఫొటోలు తీశాడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటూ వారిని ప్రశ్నించాడు. ఈ విషయం ఎక్కడ తమ కుటుంబ సభ్యులకు తెలుస్తుందోనని బెంబేలెత్తిన వారు రూ. 10 వేల డబ్బులిచ్చారు.

వారి ఇద్దరి ఫోన్ నంబర్లును తీసుకుని గోపిని అక్కడ నుంచి పంపించేశాడు. అనంతరం మెడికో విద్యార్థినిని వెంబడించి ఆమె ఇంటిని గుర్తు పెట్టుకున్నాడు. 21వ తేదీ విద్యార్థిని ఇంటి వద్దకు వెళ్లి ఆమెకు ఫోన్ చేసి తనకు రూ.90 వేలు కావాలని లేదంటే ఫొటోలు తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించాడు. ఫొటోలు ఇవ్వమని ఆమె ప్రాధేయపడింది. దీంతో గోపి ఆమెను చిల్డ్రన్స్‌పార్కురోడ్డులోని వైన్స్ సమీపంలోకి తీసుకెళ్లాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని లైంగిక సంపర్కం ఎలా చేస్తారని ప్రశ్నించాడు.

తనకు తెలియదని చెప్పడంతో తన ఫోన్‌లోని అసభ్యకర వీడియోలను ఆమెకు చూపించాడు. రెండున్నర గంటల పాటు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వదిలేయని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. అతని వెకిలి చేష్టలకు విసిగిపోయిన ఆమె కానిస్టేబుల్ వాయిస్‌ను సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు బాలాజీనగర్ పోలీసులు నిందితుడు గోపిపై నిర్భయ చట్టం (సెక్షన్ 354, 354(ఎ), 384ఐపీసీ) కింద కేసు నమోదు చేశారు. బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

హైడ్రామా నడుమ మీడియా ఎదుట
మెడికో విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించిన పాలేపు గోపిని హైడ్రామా నడుమ పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. విలేకరుల సమావేశం నిర్వహిస్తోన్న సమయంలో నిందితుడు పోలీసుస్టేషన్‌లోనే ఉన్నాడు. నిందితుడుని చూపించాలని విలేకరులు అడుగగా మెడికల్ చెకప్‌కు తీసుకెళ్లామని చెప్పి సమావేశం ముగించే ప్రయత్నం చేశారు. విలేకరులు తాము స్టేషన్‌లో అతనిని చూశామని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో అతనిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. గోపిపై గతంలో వివిధ ఆరోపణలు కూడా ఉండటం గమనార్హం.

                                        నిందితుడి వివరాలను వెల్లడిస్తోన్న ఇన్‌స్పెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement