మెదక్ జిల్లా కంగ్టి మండలం తడకల్‌లో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
కంగ్టి: మెదక్ జిల్లా కంగ్టి మండలం తడకల్‌లో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. తడకల్ గ్రామానికి చెందిన వర్ష(25) అనే యువతికి కర్ణాటకలోని ఖండ్‌కేరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో 3 సంవత్సరాల క్రితం పెళ్లైయింది. నెల రోజులకే మనస్పర్థలు రావడంతో భర్తను వదిలేసి స్వగ్రామం తడకల్ వచ్చింది. మొదటి భర్త నుంచి రూ.3 లక్షలు తీసుకుని పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. గ్రామానికి చెందిన కోటగిరి శంకర్‌రావు అనే వ్యక్తితో 3 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తోంది.
ఈ క్రమంలో తన దగ్గర ఉన్న రూ.3 లక్షలను శంకర్‌కు ఇచ్చింది. అయితే రెండు నెలల నుంచి వీరిమధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో వర్ష సోదరుడు ఈ విషయం గురించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో శంకర్‌రావు, ఆమెకు రూ.4 లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. ఈ విషయం మేమే పరిష్కరించుకుంటామని ఎస్పీకి చెప్పటంతో విషయం సద్దుమణిగింది. అయితే.. కొన్ని రోజుల తర్వాత సీన్ మళ్లీ మొదటికి వచ్చింది.
నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వనని, ఎక్కువగా మాట్లాడితే కుటుంబాన్నంతా చంపేస్తానని శంకర్, ఆమెను బెదిరించడం, పది రోజుల నుంచి శంకర్ జాడలేకపోవటంతో మనస్తాపం చెందిన వర్ష.. తన ప్రియుడు శంకర్ పురుగుల మందు దుకాణం ఎదుట తాను తెచ్చుకున్న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు ఆమెను హుటాహుటిన 108 ఆసుపత్రిలో నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.