సచ్చినా ‘లెక్క’లేదా.. | fever died count un authorised | Sakshi
Sakshi News home page

సచ్చినా ‘లెక్క’లేదా..

Sep 9 2016 11:02 PM | Updated on Sep 4 2017 12:49 PM

సచ్చినా ‘లెక్క’లేదా..

సచ్చినా ‘లెక్క’లేదా..

జ్వరాలతో ప్రజలు అర్ధంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ.. మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో..

  • విషజ్వరాలతో రెండు నెలల్లో 20 మంది మృతి
  • జిల్లాలో మరణాలే లేవంటున్న వైద్య ఆరోగ్య శాఖ
  • తీవ్రతనుబట్టి అక్కడక్కడ వైద్య శిబిరాలు
  • జ్వరాలు తగ్గే వరకు ఉంచాలంటున్న ప్రజలు
  • సాక్షిప్రతినిధి, ఖమ్మం : జ్వరాలతో ప్రజలు అర్ధంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ.. మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో.. ఇంకొందరు ఇంటి వద్దే మృతిచెందుతున్నా.. ప్రస్తుతం ప్రబలుతున్న జ్వరాలపై జిల్లా వైద్యాధికారులు చెప్పే మాటలు మరోలా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా జూలై నుంచి ఇప్పటివరకు జ్వరాల బారినపడి 20 మంది వరకు మృతిచెందితే.. అధికారులు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందిన లెక్కనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. జిల్లాలో జ్వరాలు ఇప్పటివరకు ఎవరూ మృతిచెందలేదు.. జ్వరాల తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు.
        జిల్లావ్యాప్తంగా జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. పలు పల్లెల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి జ్వరాలతో కుటుంబాలన్నీ మంచం పడుతున్నాయి. పట్టణాల్లోని ఆస్పత్రులు, మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోజుకు 50 నుంచి 100 మంది కేవలం జ్వరంతో బాధపడుతూ వివిధ గ్రామాల నుంచి వస్తుంటారు. ఇక్కడ వైద్య సేవలు సక్రమంగా అందకపోవడం.. సమయానికి వైద్యులు, సిబ్బంది లేకపోవడం.. మందుల కొరతతో కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు ఇంట్లోనే ఉండి ఆర్‌ఎంపీ చేత చికిత్స చేయించుకుంటున్నారు. వీరిలో అనేక మందికి జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో మృతిచెందుతున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం, వైరాలోని కొణిజర్ల మండలం, మధిరలోని బోనకల్‌ మండలం, ఇల్లెందు నియోజకవర్గాల్లో జ్వరాల బారిన పడినవారు ఎక్కువగా ఉన్నారు. జ్వరపీడితులు మరీ ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైద్యాధికారులు నామమాత్రంగా స్పందించి.. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాలపై సరిగా దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది.
    ఇదేం లెక్క..
    జిల్లాలో విషజ్వరాలతో మృతిచెందే వారిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు లెక్కించే విధానంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి జ్వరంతో బాధపడుతూ వచ్చిన తర్వాత.. వారిని పరీక్షించగా.. డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయితే.. అక్కడ చికిత్స అందిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రిజిస్టర్‌ అయిన వారు మృతిచెందితేనే.. డెంగీ మృతులను లెక్కిస్తామని వైద్యాధికారులు చెప్పడం విశేషం. జిల్లాలో జూలై నుంచి రెండు నెలల కాలంలో డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో బాధపడుతూ 20 మంది వరకు మృతిచెందారు. అయితే వీరంతా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూపించుకున్న వారు కావడంతో ప్రభుత్వ అధికారులు జిల్లాలో అసలు విషజ్వరాలతో మృతిచెందిన కేసులే లేవని చెబుతున్నారు. అలా కాకుండా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా విషజ్వరాలతో మృతిచెందిన వారిని లెక్కించి.. జిల్లాలో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నామమాత్రంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఒకటి, రెండు రోజులు మాత్రమే శిబిరాలు ఏర్పాటు చేసి.. తర్వాత తొలగిస్తున్నారు. దీంతో జ్వరపీడితులు మళ్లీ ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.

    డెంగీ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో మృతిచెందిన వారి వివరాలు
    ––––––––––––––––––––––––––––––––––––––––––––––
    పేరు                గ్రామం            మండలం
    ––––––––––––––––––––––––––––––––––––––––––––––
    ముసలయ్య            పద్మాపురం            పినపాక
    మల్లాది వెంకటేశ్వరరావు    అసుపాక            అశ్వారావుపేట
    జర్ముల అమ్ముడి            అసుపాక            అశ్వారావుపేట
    బొగ్గం శిరీష            పోతురెడ్డిపల్లి        పినపాక
    గొడ్డుగొర్ల లావణ్య        కొణిజర్ల            కొణిజర్ల
    నడ్డి వీరమల్లు            కోయకట్టుగూడెం        చండ్రుగొండ
    గున్నాల శివయ్య            వైరా                వైరా
    బలమాల జయరాజు        సింగరాయపాలెం        కొణిజర్ల
    పసుపులేటి రమణ        చర్ల                చర్ల
    మోటపోతుల రాణి        సింగరాయపాలెం        కొణిజర్ల
    గొగ్గల మల్లమ్మ            పోట్లపల్లి            పినపాక
    బానోతు నీల            తడికలపూడి            టేకులపల్లి
    కంకణాల లక్ష్మమ్మ        సింగరాయపాలెం        కొణిజర్ల
    పాలకుర్తి లక్ష్మి            బస్వాపురం            కొణిజర్ల
    మర్రి ఆదిలక్ష్మి            ఆళ్లపాడు            బోనకల్‌
    కేసుపాక భద్రమ్మ        పాత సారపాక        బూర్గంపాడు
    కొమ్మినేని లలితమ్మ        మొట్లగూడెం            కారేపల్లి
    దూడ మోహన్‌రావు        చింతలపాడు            కారేపల్లి
    వగ్గెల చంద్రం            వినాయకపురం కాలనీ    అశ్వారావుపేట
    దారా పాపమ్మ            చౌటిగూడెం            ములకలపల్లి
    –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––       

Advertisement

పోల్

Advertisement