అప్పుల బాధతో ఓ రైతు తనువు చాలించాడు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Mar 14 2017 12:01 AM | Updated on Jun 4 2019 5:04 PM
కర్నూలు(హాస్పిటల్): అప్పుల బాధతో ఓ రైతు తనువు చాలించాడు. జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చెందిన ఆళ్ల రోసిరెడ్డి కుమారుడైన వెంకటేశ్వరరెడ్డి(52)కి భార్య పార్వతి, కుమార్తెలు ప్రియాంక, భారతి ఉన్నారు. వ్యవసాయ ఆధారంగా జీవనం సాగించే ఆయన తనకున్న 15 ఎకరాల్లో ఉల్లి, మిర్చి పంటను వేశాడు. చేతికి ఉల్లి పంట వచ్చినా ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. మిర్చి పంటకు సైతం గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టమే మిగిలింది. గతంలోనూ ఇదే విధంగా వ్యవసాయం కలిసి రాక అప్పుల పాలయ్యాడు. ఈ మేరకు ఇప్పటికే 4 ఎకరాలను అమ్మి అప్పులు తీర్చాడు.
కూతుళ్ల వివాహానికి, చేసిన అప్పులు తీర్చడానికి మరో 5 ఎకరాలు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో చేతికి వచ్చిన పంటలు సైతం గిట్టుబాటు కాకపోవడంతో తీవ్రంగా మానసిక వేదనకు గురయ్యాడు.చేసిన అప్పులు, కూతుళ్ల పెళ్లిళ్ల నేపథ్యంలో ఆందోళన చెందాడు. దీంతో ఆదివారం క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆయన సోమవారం తెల్లవారుజామున మరణించారు. జూపాడుబంగ్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement