
విజయవాడలో మరో మోసం
నారా రోహిత్ యువసేన నిర్వాహకుడు, గొల్లపూడికి చెందిన తాడికొండ సాయికృష్ణ మీద సోమవారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రూ.34 లక్షలు తీసుకుని ఇవ్వడంలేదని నారా రోహిత్ యువసేన నేతపై ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: తమవద్ద రూ. 34 లక్షలు అప్పు తీసుకుని ఇవ్వడంలేదని, అడిగితే కాల్‌మనీ కేసు పెడతానని బెదిరిస్తున్నారని ముగ్గురు వ్యక్తులు నారా రోహిత్ యువసేన నిర్వాహకుడు, గొల్లపూడికి చెందిన తాడికొండ సాయికృష్ణ మీద సోమవారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. గతంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్‌లో కియ్రాశీలకంగా పనిచేసిన సాయికృష్ణ.. నారా రోహిత్ యువసేనను స్థాపించి నిర్వహిస్తున్నారు.
నారా రోహిత్‌తోను, సీఎం కుమారుడు నారా లోకేశ్‌తోను పరిచయం పెంచుకున్న ఆయన తరచూ హైదరాబాద్ వెళ్లి వారిని కలిసి వస్తుంటారు. వ్యక్తిగత అవసరాల కోసం రెండేళ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితులు నీరుకొండ శ్రీనివాస్, ఇరుపులపాటి దిలీప్ వద్ద రూ.30 లక్షలు, వెలగపూడి పవన్ వద్ద రూ.4 లక్షల అప్పు తీసుకున్నారు.
బాకీ తీర్చమని ఆదివారం రాత్రి సాయికృష్ణను ముగ్గురు స్నేహితులు అడిగారు. దీంతో సాయికృష్ణ కోర్టులో చూసుకుందాం అని చెప్పారు. మాటలు పెరిగిన నేపథ్యంలో సాయికృష్ణ.. శ్రీనివాస్‌ను కొట్టారు. ముగ్గురు స్నేహితులు భవానీపురం పోలీసులకు ఫిర్యాదుచేశారు. నారా రోహిత్ సినిమా డిస్టిబ్యూషన్ తీసుకోవడానికని సాయికృష్ణ తమవద్ద అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు.