అన్ని చెరువులకూ నీరు

అన్ని చెరువులకూ నీరు


- ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ

- టెక్నాలజీతో సేద్యంలో ఆదర్శం కావాలని రైతులకు పిలుపు

- 74 ఉడేగోళం వద్ద ‘ఏరువాక’ ప్రారంభం




రాయదుర్గం/ రాయదుర్గం అర్బన్‌ : జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి జిల్లాలోని చెరువులన్నింటికీ నీరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎత్తయిన ప్రదేశంలో ఉన్న చెరువులకు అవసరమైతే మొబైల్‌ లిఫ్ట్‌ ద్వారా నీటిని అందిస్తామన్నారు. శుక్రవారం ఆయన  రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామం వద్ద ‘ఏరువాక పౌర్ణమి’ని ప్రారంభించారు. సీఎం ఉదయం 10.36 గంటలకు  గ్రామానికి చేరుకున్నారు. హెలిప్యాడ్‌ నుంచి నేరుగా ఉల్లిరైతు ఉడేగోళం అప్పాజీ పొలంలోకి వెళ్లి పంటను పరిశీలించారు. పంటను జియో ట్యాగింగ్‌ చేశావా అంటూ రైతును అడగ్గా.. లేదని అతను చెప్పాడు. వెంటనే అధికారుల ద్వారా జియోట్యాగింగ్‌ చేయించి.. పంట పరిస్థితిపై ఆరా తీశారు. పచ్చపురుగు ఆశించిందని, నీమ్‌ ఆయిల్‌ వాడాలని శాస్త్రవేత్తలు తెలిపారు.



శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా మందు పిచికారీ చేయాలని సీఎం సూచించారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి పంట (సేద్యపు) కుంటలను పరిశీలించి, పూజలు చేశారు. అనంతరం ఎద్దుల బండి తోలారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఆ«ధ్వర్యంలో వరుణ పూజలో పాల్గొన్నారు. కుమార్‌ అనే రైతు పొలంలో సీఎం కాడెద్దులతో దుక్కి దున్నారు. పక్కనే వన్నప్ప పొలంలో వేరుశనగ విత్తును ప్రారంభించారు. అలాగే ట్రాక్టర్‌తో సేద్యం చేశారు. నాగరికతకు చిహ్నం, సంప్రదాయానికి ప్రతీక అయిన ఏరువాకను పండుగలా ,చేసుకోవాలని, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయంలో ఆదర్శంగా నిలవాలని రైతులకు సూచించారు. జిల్లాలో సేంద్రియ పద్ధతుల్లో పండించే పండ్లు, కూరగాయలకు ఇతర దేశాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉందన్నారు.



వ్యవసాయ అనుబంధ రంగాలపైనా రైతులు దృష్టి పెట్టాలన్నారు. అధికారులు పనులు చేయకపోయినా, అవినీతికి పాల్పడినా 1100 నంబరుకు ఫోన్‌ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 6,344 మంది లబ్ధిదారులకు మంజూరైన రుణాలకు సంబంధించి రూ.86,38,98,000 మెగా చెక్కును, రూ.1032 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెక్కును విడుదల చేశారు.  బీటీ ప్రాజెక్టుకు నీరిచ్చే పనులకు ఆగస్టు 15న శంకుస్థాపన చేస్తామని సీఎం ప్రకటించారు. కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాల్లో ఎడారి నివారణకు రూ.60 కోట్లను మంజూరు చేస్తామన్నారు.



ఆస్పత్రి భవనం ప్రారంభం

ఏరువాక సభ వేదికపై నుంచే ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాలను  ప్రారంభించారు. రాయదుర్గం పట్టణంలో రూ.3.69 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల నూతన భవనాలను ప్రారంభించారు. గుమ్మఘట్ట మండలం గోనబావిలో రూ.24 కోట్లతో బీసీ బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లా, మండల నీటి బడ్జెట్‌లను విడుదల చేశారు. జిల్లా నీటి బడ్జెట్‌కు రూ.13,731 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు.  



వ్యవసాయ ట్రాక్టర్లకు రూ.125 కోట్లు

వ్యవసాయం కోసం రైతులకు ట్రాక్టర్లను అందించడానికి బడ్జెట్‌లో రూ.125 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రాజశేఖర్‌ తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రైతులు పంట కుంటలు తవ్వుకుని.. వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సూచించారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఈరణ్ణ, యామినీ బాల, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, శమంతకమణి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్, జేడీఏ శ్రీరామమూర్తి, జాయింట్‌ కలెక్టర్‌ రమామణి, జేసీ-2 సయ్యద్‌ ఖాజామొహిద్దీన్, సీడ్స్‌ జేడీఏ వెంకటేశ్వర్లు, సిరికల్చర్‌ జేడీఏ అరుణకుమారి, ఏడీఏ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top