ఆయుత చండీ మహాయాగం ప్రారంభం

ఆయుత చండీ మహాయాగం ప్రారంభం - Sakshi


ఎర్రవల్లి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయుత చండీ మహాయాగం ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7.45 గంటలకు మొదలైన ఈ మహాక్రతువు ఆదివారం వరకు (ఐదు రోజుల పాటు) సాగనుంది. ఇందుకు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కె.చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రంలో అన్ని ఏర్పాట్లుచేశారు.



తొలుత కేసీఆర్ దంపతులతో గౌరీ పూజ చేయించిన వేదపండితులు.. అనంతరం వారిని ప్రధాన యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఆ తర్వాత యాగశాలలోనికి తోడ్కొని వెళ్లారు. యాగం ప్రారంభమైన కొద్దిసేపటికే గవర్నర్ నరసింహన్ దంపతులు అక్కడికి చేరుకున్నారు. సీఎం దంపతులు వారికి సాదర స్వాగతం పలికారు. శృంగేరీ పండితులతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 2 వేల మంది రుత్వికులు ఈ సందర్భంగా గురుపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు.



ప్రముఖుల రాక

అయుత చండీ మహాయాగం తొలి రోజున జరిగే పూజల్లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులతోపాటు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి బొసాలే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ పాల్గొంటారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం 24న కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, 25న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగ ర్‌రావు, 26న తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు.



అంగరంగ వైభవంగా ఏర్పాట్లు

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలతోపాటు పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రానుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు యాగాన్ని వీక్షించేందుకు దాదాపు 50 వేల మంది భక్తులు తరలివస్తారని అంచనా. వీరందరికీ సరిపడేలా అమ్మవారి పసుపు కుంకుమ, ప్రసాదంతో పాటు అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది భక్తులు ఒకేసారి ప్రదక్షిణగా వెళ్లి యాగాన్ని వీక్షేంచేలా యాగశాల చుట్టూరా బారికేడ్లతో మార్గాన్ని నిర్మించారు.



ఈ ఏర్పాట్లన్నింటినీ సీఎం స్వయంగా దగ్గరుండి  పర్యవేక్షించారు. అయుత చండీ మహాయాగానికి శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి తన ఆశీర్వచనాలతో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. శృంగేరీ జగద్గురు మహా సంస్థానం పండితుల ఆధ్వర్యంలోనే యాగం నిర్వహించేందుకు అంగీకారం తెలుపుతూ.. ఈ యాగానికి నరహరి సుబ్రహ్మణ్య భట్టు ప్రధాన ఆచార్యులుగా, తంగిరాల శివకుమార శర్మను వాచకులుగా పంపించారు.



మహారుద్ర యాగానికి ఆచార్యులుగా పురాణం మహేశ్వరశర్మ, యాగ పర్యవేక్షకులుగా శివసుబ్రహ్మణ్య అవధాని, గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక్‌శర్మ వ్యవహరిస్తున్నారు. యాగంలో 1,100 మంది రుత్వికులు ఏకకంఠంతో పారాయణాలు చదవనున్నారు. మరో 400 మంది రుత్వికులు వారికి సహాయం చేయనున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top