రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ చేతిలో కీలుబొమ్మలా మారి మత రాజకీయాలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ దుయ్యబట్టారు.
శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్) : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ చేతిలో కీలుబొమ్మలా మారి మత రాజకీయాలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో జరిగే పార్టీ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్రం బగల్‌కోట్ ఎంపీ పీసీ.గఢీగౌడార్ రాక సందర్భంగా శనివారం ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం తొండుపల్లిలోని ఓయ్‌స్టార్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టించిందని, యావత్ దేశ ప్రజలు బీజేపీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయఢంఖా మోగిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ గఢీగౌడార్, బీజేపీ రాష్ట్ర నాయకుడు బద్దం బాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఆచారి, డాక్టర్ ప్రేమ్‌రాజ్, మండల అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బి.శ్రీధర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.