ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి తెచ్చిన మట్టిలో ఉన్న మర్మమేమిటో తనకు అర్థం కావడం లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.
చిత్తూరు (గిరింపేట): ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి తెచ్చిన మట్టిలో ఉన్న మర్మమేమిటో తనకు అర్థం కావడం లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం చిత్తూరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి హామీలు ప్రకటించకుండా మట్టిని ఇవ్వడంలో ఉన్న పరమార్థం ఏమిటో బోధపడటం లేదన్నారు. ఇది తెలుసుకోవడానికి ఆదివారం ప్రధానికి బహిరంగ లేఖ రాశానన్నారు.
రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం చిన్నాచితకా రైతులను బెదిరించి, వారి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. రైతులు ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను గమనిస్తున్నారని, త్వరలో తగిన బుద్ధి చెబుతారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పదవిలోకి రాక మునుపు ఒక మాట, వచ్చిన తరువాత మరో మాట చెబుతూ ప్రజలను వంచిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర రాజకీయాలు బిహార్ ఫలితాల్లో తేటతెల్లమవుతాయన్నారు.