
ఫైనల్‌కు 'అనంత'
ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వెటరన్ క్రికెట్ టోర్నీలో ఆతిథ్య అనంత జట్టు రెండో విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు చేరింది.
- వెటరన్ క్రికెట్ టోర్నీలో మొదటిసారి ఫైనల్ చేరిన ఆతిథ్య జట్టు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వెటరన్ క్రికెట్ టోర్నీలో ఆతిథ్య అనంత జట్టు రెండో విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు చేరింది. స్థానిక అనంత క్రీడా మైదానంలో శనివారం నిర్వహించిన లీగ్ పోటీల్లో అనంతపురం, కడప జట్లు విజేతలుగా నిలిచాయి. మొదటి మ్యాచ్‌లో అనంతపురం, గుంటూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గుంటూరు జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. జట్టులో ఇర్ఫాన్ 14 బంతుల్లోనే 37 పరుగులు రాబట్టారు. రమేష్ 28, రాజన్ 22 పరుగులు చేశారు.
అనంత బౌలర్లలో ఇనాయతుల్లా 3, షాబుద్దీన్ 2, యుగంధర్, ప్రదీప్, హరినాథ్‌రెడ్డి ఒక్కొక్క వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంత జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫైనల్‌లో తన బెర్తును ఖరారు చేసుకుంది. జట్టులో నూర్ 47, షాబుద్దీన్ 40, సందీప్ 22, యుగంధర్ రెడ్డి 20 పరుగులు చేశారు. అనంత జట్టు వెటరన్ క్రికెట్ టోర్నీలో మొదటిసారి ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది టోర్నీ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన జిల్లా జట్టు తన సత్తా చాటింది.
రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ ఏ, కడప జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ ఏ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది.ఽ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు సాధించింది. జట్టులో కార్తీక్ 48 పరుగులు చేశారు. కడప జట్టు బౌలర్లలో సంజయ్‌రెడ్డి, శ్రీనివాసులు చెరి 2 వికెట్లు సాధించారు. అనంతరం బరిలోకి దిగిన కడప జట్టు 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికే లక్ష్యాన్ని అధిగమించింది. ఆదివారం ఉదయం సెమీ ఫైనల్లో విజయవాడ, కడప జట్లు తలపడనున్నాయి. గెలుపొందిన జట్టు అనంత జట్టుతో ఫైనల్‌లో తలపడుతుందని టోర్నీ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నాగప్ప తెలిపారు.