పేరు శిక్షణ..చేసేది భక్షణ


రూ.31.16 లక్షలకు లెక్కాపత్రం లేని పరిస్థితి

మెజార్టీ డివిజన్లలో సమావేశాలుపెట్టకుండానే డబ్బులు స్వాహా

వ్యవసాయశాఖలో చేతివాటం  




వ్యవసాయశాఖలో శిక్షణల పేరుతోసొమ్ముల స్వాహాకు అధికారులుతెరలేపారు. ఇక్కడ పనిచేసే కిందిస్థాయి అధికారులు, క్షేత్రస్థాయిసిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవడానికి, శాస్త్రపఠనంపైఅవగాహన పెంచుకోవడానికిశిక్షణలు ఇచ్చేలా రాష్ట్ర  వ్యవసాయశాఖ నిధులు మంజూరు చేసింది.అయితే ఆ శాఖలోని కొందరుశిక్షణ పేరుతో నిధుల భక్షణకుపాల్పడుతున్నారనే విషయం

చర్చనీయాంశంగా మారింది.శిక్షణ సమావేశానికి హాజరైన ఏఈఓలు,ఎంపీఈఓలు(ఫైల్‌)




కడప అగ్రికల్చర్‌:  

జిల్లా, డివిజన్‌ స్థాయిలో ఎంపీఈఒలకు, ఏఈఓలకు  అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా క్షేత్రస్థాయి అధికారులకు తగిన శాస్త్ర పఠన పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. వ్యవ సాయశాఖలోని అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలతో తగిన సూచనలు ఇప్పించాలి. అయితే క్షేత్రస్థాయిలో అటువంటి మీటింగ్‌లు ఏమీ పెట్టకుండా మెజార్టీ డివిజనల్‌ అధికారులు సొమ్ములు స్వాహా చేసినట్లు సమాచారం. జిల్లా, డివిజన్‌ స్థాయిలో శిక్షణలు ఏర్పాటు చేసి దానికి అయిన ఖర్చు వివరాల పత్రాలను జిల్లా కేంద్రానికి పంపాలి, అయితే కొందరు మీటింగ్‌లు పెట్టకపోయినా పెట్టినట్లు దొంగ బిల్లులు తయారు చేసి సొమ్ములు దిగమింగినట్లు శాఖలో చెప్పుకుంటున్నారు.



శిక్షణలు ఇలా...

మండలాల్లోని బహుళ వ్యవసాయ విస్తరణాధికారులు 230 మంది, మండల వ్యవసాయ విస్తరణాధికారులు 245 మంది పనిచేస్తున్నారు. వీరందరికి ఏడాదిలో 4 నుంచి 5 మీటింగ్‌లు జిల్లా, డివిజన్‌స్థాయిలో మొత్తం ఏడాదికి 60 రోజులు ఏర్పాటు చేయాలి. ఒక్కో శిక్షణ 4 రోజులు నిర్వహించాలి. డివిజన్‌స్థాయి మీటింగ్‌లకు రూ.11,35,865లు, జిల్లా మీటింగ్‌కు రూ.19.81 లక్షల నిధులు విడుదల అయ్యాయి. ఈ మీటింగ్‌లోఎంపీఈఓ, ఏఈఓల పనితీరు, శాస్త్ర పఠనం విషయాలు, వ్యవసాయశాఖలో అమలవుతున్న పధకాలు, పంటల్లో సమస్యలను వివరిస్తారు. వీటిని బాగా ఆకలింపు చేసుకుని క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి సాగును ప్రోత్సహిస్తూ అధిక దిగుబడులకు ఊతం ఇవ్వాలనేది ఈ శిక్షణల ముఖ్య ఉద్దేశం.



అయితే   కొందరు డివిజన్‌ ఏడీలు తూ...తూ మంత్రంగా శిక్షణలు నిర్వహించి, మరికొందరు  నిర్వహించకుండానే దొంగ బిల్లు సమర్పించి లక్షల రూపాయల సొమ్ములు స్వాహా చేసినట్లు సమాచారం. వ్యవసాయ పంటలకు సంబంధించిన సమాచార పుస్తకాలు, అధికారులకు కరదీపికలు కలిపి 700 బుక్‌లెట్‌లు ప్రింటింగ్‌ చేసి ఇవ్వాల్సి ఉన్నా అలా చేయకుండానే పని కానిచ్చేశారని డివిజన్లలోని అధికారులు కొందరు గుసగుసలాడుకుంటున్నారు. జిల్లా స్థాయికి మంజూరైన రూ.19.81 లక్షలు, డివిజన్‌ స్థాయిలో రూ.11.35 లక్షలు కలిపి మొత్తం రూ.31.16 లక్షలకు లెక్కాపత్రం లేని పరిస్థితి ఉంటోందనే చర్చ జరుగుతోంది.



డీడీ స్థాయి అధికారులతో విచారణ

వ్యవసాయశాఖలో ఇచ్చే శిక్షణలు పక్కా ఉంటాయి. ఎందుకంటే మీటింగ్‌లకు సంబంధించి ఫొటోలు, ఖర్చుల బిల్లులు, ప్రింటింగ్‌ సామగ్రి తప్పని సరిగా జిల్లా శాఖ కార్యాలయానికి పంపాలి. దాని ఆధారంగా ఆయా బిల్లులు ఇచ్చిన వారిని కూడా విచారిస్తాం. అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేలితే తప్పకుండా ఆయా ఏడీలపై చర్యలుంటాయి. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు.

–డి ఠాకూర్‌ నాయక్, సంయుక్త సంచాలకులు, జిల్లా వ్యవసాయశాఖ.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top