వాసుదేవుడు


వసుదేవుడి కుమారుడు వాసుదేవుడు. ‘వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం, దేవకీ పరమా నందం, కృష్ణం వందే జగద్గురుం’ అని కృష్ణాష్టకం. ఈ అర్థం ప్రకారం ద్వాపర యుగంలో దేవకీ పుత్రు డుగా అవతరించి యశోదానంద వర్ధనుడుగా వర్ధిల్లిన శ్రీకృష్ణుడే వాసుదేవుడు.


సర్వమూ వాసుదేవుడే అని అనుభూతి పూర్వ కంగా, అపరోక్షంగా స్వానుభూతిపూర్వకంగా గ్రహిం చగలిగిన మహాత్ములే జ్ఞానులు, ఇలాంటివారు చాలా అరుదు అంటుంది భగవద్గీత. సర్వమూ వాసు దేవుడే అన్నప్పుడు ఆ వాసుదేవుడు అన్న మాటకు  వసుదేవుడి కుమారుడు అని పరిమితమైన అర్థం చెప్పటంలో పూర్తి సామంజస్యం కనిపించదంటారు కొందరు. త్రికాలాతీతుడూ, గుణాతీతుడూ,  సర్వ వ్యాపీ, ఆది మధ్యాంత రహితుడూ అయిన పరమా త్మను ఒక్క అవతారానికే వర్తింపజేసి వసుదేవ సుతు డుగా మాత్రం పిలవటం ఎలా పొసగుతుంది అని వారి సందేహం.





విష్ణు సహస్రనామంలో ‘వాసుదేవ’ అనే నామం మూడుసార్లు వస్తుంది. ఒకే నామాన్ని ఒకే అర్థంలో రెండు మూడుసార్లు వాడటం సంప్రదాయం కాదు. కనుక విష్ణు సహస్ర నామభాష్యం చెప్పిన ఆది శంకరా చార్యులు వాసుదేవ నామానికి మూడు రకాల వివరణలు చెప్పారు. సర్వ జగత్తును ‘వసనం’ లేక ‘వాసనం’, లేక, ఆచ్ఛాదనం చేసి ఆక్రమించి ఉండేవాడు ‘వాసుడు’ . ‘దివ్’ అనే ధాతువుకు క్రీడించటం, విజయేచ్ఛ కలిగి ఉండటం, నియంత్రిం చటం, ప్రకాశించటం అని అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేసే వాడిని ‘దేవుడు’ అంటారు. ‘వాసుడు’ అయిన ‘దేవుడు’ వాసుదేవుడు. అంటే, చరాచర విశ్వాన్ని సూర్యకిరణాల ద్వారా సూర్యుడు కప్పినట్టు సర్వత్రా ఆక్రమించి, వ్యాపించి ఉండేవాడు అని. రెండవ చోట, వాసుదేవ నామానికి వసుదేవుడి పుత్రుడు అనే అర్థం చెప్పారు. మూడవ చోట, మాయ చేత జగత్తును ఆచ్ఛాదన చేసి ఆవరించి ఉండేవాడు అని అర్థం చెప్పుకోవచ్చన్నారు.





భాగవతంలో పౌండ్రక వాసుదేవుడనే విచిత్ర మైన పాత్ర కనిపిస్తుంది. ఈయన కరూశ దేశానికి రాజు. గొప్ప అజ్ఞాని. రంగస్థలం మీద నటుడిలా శ్రీకృష్ణుడి వేషభాషలనూ, చిహ్నాలనూ అనుకరించే వాడు. పీతాంబరం కట్టి , గరుడ ధ్వజం ఎత్తించుకొని, శంఖ-చక్ర- ఖడ్గ- గదా- శార్గ-శ్రీవత్స- కౌస్తుభ- వనమాలాది చిహ్నాలను అనుకరించేవాడు. మూర్ఖు లైన తన ఆశ్రీతులు చేసే ముఖ స్తుతులు నమ్మి, ఆయన శ్రీకృష్ణుడికి తన దూత ద్వారా ఒక హెచ్చరిక పంపుతాడు, ‘అసలైన వాసుదేవుడిని నేను. నువ్వు నా పేరూ చిహ్నాలూ ధరించి తిరుగుతున్నావు. వెంటనే నువ్వు వాటిని వదిలి నా శరణు వేడుకో. లేదంటే నాతో యుద్ధానికి సిద్ధపడు!’ అని. వసుదేవ పుత్రుడు ఆ పౌండ్రక వాసుదేవుడిని యుద్ధంలో వధిస్తాడు. వైర భావంతోైనైనా కృష్ణుడిని నిరంతరం స్మరిస్తూ అను కరిస్తూ జీవించిన కారణంగానూ, కృష్ణుడి చేతనే స్వయంగా హతుడైన కారణంగానూ పౌండ్రక వాసు దేవుడు, అన్ని బంధాలూ వదిలించుకొని ఆ వాసు దేవుడిలోనే లీనమయ్యాడు.

 - ఎం. మారుతి శాస్త్రి

 

Read latest Devotion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top