విహార యాత్రలో విషాదగీతం

Young Man Died in Godavari - Sakshi

గోదావరిలో మునిగి యువకుడి మృతి

పోలవరం సందర్శనకు వచ్చి అనంత లోకాలకు..

పశ్చిమగోదావరి, కొవ్వూరు: విహార యాత్ర ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కళ్లెదుటే కన్నబిడ్డ నీటమునిగిపోవడం తల్లిదండ్రులకు ఎనలేని దుఃఖాన్ని మిగిల్చింది. పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శనకు వెళుతూ కొవ్వూరు వద్ద గోదావరిలో స్నానానికి దిగిన యువకుడు గల్లంతై మృతిచెందడం కలచివేసింది. వివరాలిలా ఉన్నాయి.. కాకినాడలోని సంజయ్‌నగర్‌కు చెందిన దౌలూరి కిషోర్‌ (17) కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారితో కలిసి ఆదివారం పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శనకు బయలుదేరారు. మార్గమధ్యంలో కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద ఆగారు. అక్కడ గోదావరిలో స్నానానికి కిషోర్‌తో పాటు పలువురు దిగారు. ఒడ్డున ఇసుక మేటలు ఉండటంతో లోతు తక్కువగా ఉంటుందని భావించారు.

అయితే అక్కడే లోత్తెన ప్రాంతం ఉండటంతో కిషోర్‌తో పాటు మరో యువకుడు గట్టెం మహేంద్రవర్మ నీట మునిగిపోయారు. కిషోర్‌ తండ్రి మహేష్‌ మహేంద్రవర్మను రక్షించగా కిషోర్‌ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఉదయం నుం చి కిషోర్‌ ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలించారు. మధ్యా హ్న సమయంలో కాకినాడకు చెందిన గజ ఈతగాళ్లు కూడా రంగంలోకి దిగారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో కిషోర్‌ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని కాకినాడ తరలించారు. కిషోర్‌ ప్రస్తుతం కాకినాడ నారాయణ విద్యాసంస్థలో పదో తరగతి చదువుతున్నాడు. తండ్రి సతీష్‌ లారీడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. సతీష్‌కు కిషోర్‌ పెద్దకుమారుడు కాగా సోదరుడు ఉన్నాడు. కన్న బిడ్డ కళ్లేదుటే నీటిమునగడంతో అతడి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇసుకమేటలు.. ప్రమాదానికి బాటలు
గోష్పాదక్షేత్రం స్నానఘట్టంలో ఇసుక మేటలు వేయడంతో స్నానాలకు అనువుగా లేదు. గోదావరిలో నీటిమట్టం అడుగంటడంతో స్నానఘట్టంగా తయారుచేసిన ప్రాంతమంతా నీరు లేకుండా పోయింది. అయితే ఇక్కడే లోతైన ప్రాంతం ఉండటం, కొత్తవాళ్లకు విషయం తెలియకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. స్నానఘట్టంలో ఇసుక మేటలతో పాటు పారిశుద్ధ్యం క్షీణించడంతో స్నానం కోసం వచ్చిన వారు కొంచెం లోతుకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నారు. స్నానఘట్టంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంపై కిషోర్‌ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు మండిపడ్డారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top