మట్టుపెట్టి.. మృతదేహం దాచిపెట్టి..

Worker Sathyanarayana Murder Case Reveals in East Godavari - Sakshi

దింపు కత్తి తాకట్టు వివాదంతోనే సత్యనారాయణ హత్య

20 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం

తూర్పుగోదావరి, అల్లవరం: అదృశ్యమైన ఓ దింపు కార్మికుడు హత్యకు గురయ్యాడు. ఆ కార్మికుడిని హతమార్చి కొబ్బరి తోటలో పొదలమాటున దాచి పెట్టారు. 20 రోజుల తర్వాత మృతదేహం గుర్తు పట్టలేనంతగా మారింది. చివరకు ఈ హత్యోదంతం సోమవారం వెలుగు చూసింది. అల్లవరం మండలం కొమరి గిరిపట్నం శివారు కొడప గ్రామానికి చెందిన దింపు కార్మికుడు ఇంజేటి సత్యనారాయణ(54) గత నెల 17వ తేదీన అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతని కోసం కుటుంబీకులు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 4వ తేదీన అల్లవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వ్యక్తి అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌ బాషా ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ రుద్రరాజు భీమరాజు లోతైన దర్యాప్తు చేశారు. 

దింపు కత్తి తాకట్టు వివాదమే హత్యకు కారణం  
తాను దింపు తీసే కత్తిని సత్యనారాయణ ఆర్థిక అవసరాల దృష్ట్యా అదే గ్రామానికి చెందిన గోసంగి దొరబాబు వద్ద తాకట్టు పెట్టాడు. గత నెల 17న దొరబాబు కొబ్బరి తోటలో దింపు తీశారు. అనంతరం సత్యనారాయణ మద్యం సేవించి తాకట్టు పెట్టిన దింపు కత్తి గురించి దొరబాబుతో తగాదా పడ్డాడు. ఈ సమయంలో తీవ్ర ఆవేశానికి గురైన దొరబాబు కార్మికుడు సత్యనారాయణను గొంతు నులిమి తీవ్రంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ భీమరాజు తెలిపారు. ఈ విషయం ఎవరికీ తెలీకుండా మృతదేహాన్ని కొబ్బరి తోటలోనే ఓ మూల పొదల మాటున దాచి దానిపై కొబ్బరి ఆకులు కప్పి ఏమీ తెలియనట్టు అక్కడ నుంచి జారుకున్నాడు. అల్లవరం పోలీసుల అదృశ్యంపై దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నప్పటికీ హత్య కోణంలో కూడా విచారణ చేపట్టగా ఈ దారుణం వెలుగు చూసింది. హత్య చేసిన దొరబాబును పోలీసులు విచారించగా,  సత్యనారాయణను తానే హత్య చేశానని, మృతదేహాన్ని కొబ్బరి తోట పొదల్లో దాచానని అంగీకరించినట్టు సీఐ భీమరాజు తెలిపారు. హత్యకు గురైన సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. డీఎస్పీ మసూమ్‌ బాషా హత్యా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. వీఆర్వో పి.వెంకటేశ్వరరావు, పీహెచ్‌సీ వైద్యుడు శంకరరావు హత్యా స్థలంలోనే కృశించుకుపోయిన మృతదేహానికి పంచనామా చేశారు. అల్లవరం, అంబాజీపేట, ఉప్పలగుప్తం ఎస్సైలు కె.చిరంజీవి, నాగార్జున, సురేష్‌బాబు కూడా ఈ కేసు దర్యాప్తులో భాగస్వాములయ్యారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top