వైద్యుల నిర్లక్ష్యానికి ..బాలింత మృతి

Women Died Of Doctors Negligence  - Sakshi

విజయనగరం ఫోర్ట్‌ :  ఘోషాస్పత్రిలో తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నా వైద్య సిబ్బందిలో మార్పు రావడం లేదు. కొద్ది రోజుల కిందట చీపురుపల్లి మండలం జి.ములగాం గ్రామానికి చెందిన భవాని, సత్యనారాయణ దంపతులకు జన్మించిన మగ శిశువు ఘోషాస్పత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో శిశువు తండ్రి పోలీసులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం దానిపై విచారణ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం మరో విచారకర సంఘట చోటుచేసుకుంది. మగ బిడ్డ పుట్టాడని ఎంతో సంబరపడ్డ ఆ తల్లి పుట్టిన శిశువును తనివితీరా ముద్దాడకుండానే తనువు చాలించింది. బాలింత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం పోరలి గ్రామానికి చెందిన కొప్పల సంతోషి ఈనెల 25న ప్రసవం కోసం ఘోషాస్పత్రి లో చేరింది. 26వ తేదీ రాత్రి 10.20 గంటల సమయంలో ఆమెకు సాధారణ ప్రసవం అవ్వగా మగబిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో వైద్య సిబ్బంది ఆమెను కాన్పు గది నుంచి వార్డుకు తరలించారు. రాత్రి ఒంటి గంట సమయంలో సంతోషికి తీవ్ర రక్తస్రావం అవ్వడంతో ఆమె బంధువు నర్సు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె నేను డ్యూటీలో లేను.. ఇంకోనర్సుకు చెప్పు అని తెలిపింది. ఇలా ఒకరు మీద ఒకరు చెప్పుకుంటూ శుక్రవారం ఉదయం వరకు బాలింతను పట్టించుకోలేదు. ఉదయం 6 గంటల సమయంలో వైద్యురాలి వద్దకు బాలింతను తీసుకుని వెళ్లగా వారు రక్తం ఎక్కించారు.

అయినప్పటికీ రక్తస్రావం అగకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో రక్తస్రావం తగ్గడానికి గర్భసంచి తొలిగించాలని బంధువులకు చెప్పారు. బంధువులు అందుకు అంగీకరించడంతో ఆపరేషన్‌ చేసి గర్భసంచి తొలిగించారు. ఆపరేషన్‌ అనంతరం రక్తస్రావం తగ్గిందని వైద్యురాలు బంధువులకు తెలిపింది.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో రక్తస్రావం అగినప్పటికి బ్రెయిన్‌లో సమస్య ఉందని.. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని సిబ్బంది సూచించారు. దీంతో  2.45 గంటల సమయంలో అంబులెన్స్‌లో సంతోషిని కేజీహెచ్‌కు  తరలించారు. అయితే కేజీహెచ్‌ గేట్‌ వద్ద సంతోషిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పారు.  

మృతదేహంతో ఆందోళన 

సంతోషి చనిపోయిందని కేజీహెచ్‌ సిబ్బంది చెప్పడంతో రాత్రి ఎనిమిది గంటలకు అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకువచ్చి స్థానిక ఘోషాస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. మా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ రోధించారు. ఘోషాస్పత్రిలోనే చనిపోతే విశాఖకు తరలించా రని ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్‌ సీతారామరాజు ఆస్పత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు.

సంఘటనపై విచారణ చేపడతామని చెప్పగా, ఇంతవరకు ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారని బాధితులు ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరగడంతో రెండో పట్టణ ఇన్‌చార్జి సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు అశోక్, దుర్గాప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  ఘోషాలోనే చనిపోయింది 
ఘోషాస్పత్రిలోనే మా చెల్లి చనిపోయింది. ఏమీ తెలియకుండా వైద్యులు కేజీహెచ్‌కు తీసుకెళ్లమని చెప్పారు. అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయిందని చెప్పారు. ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే మా చెల్లి చనిపోయింది. – జి. చంద్రినాయుడు, మృతిరాలి సోదరుడు

విచారణ చేయిస్తాం

వైద్యుల నిర్లక్ష్యం లేదు. సంతోషి కోమాలోకి వెళ్లిపోవడంతో మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించాం.  సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తాం. వైద్య సిబ్బంది నిర్లక్షం ఉంటే చర్యలు తీసుకుంటాం.  కె.సీతారామరాజు, సూపరింటెండెంట్‌ , ఘోషాస్పత్రి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top