అవును.. వారిద్దరూ ఒకరినే ఇష్టపడ్డారు!

Women Constables Conflict For Boyfriend in Police Station Tamil Nadu - Sakshi

ప్రియుడొక్కడు..ప్రియురాళ్లిద్దరు

మహిళా హెడ్‌కానిస్టేబుళ్ల కుమ్ములాట

పురుగుల మందుతాగి ఆస్పత్రిలో వివాహిత

సాక్షి ప్రతినిధి, చెన్నై: వాళ్లిద్దరూ పోలీసుశాఖలో మహిళా హెడ్‌కానిస్టేబుళ్లు. వీరిలో ఒకరు వివాహిత. అయితే వీరిద్దరూ ఒకే యువకుడిని ఇష్టపడ్డారు. కలియబడి కొట్టుకున్నారు. ఆఖరకు వీరిలో వివాహిత ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిత్రమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  తంజావూరు ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు విభాగంలో (27), (25) ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు యువతులు హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరిలో 27 ఏళ్ల యువతికి పెళ్లికాగా కుటుంబసభ్యులు పుదుకోట్టైలో ఉన్నారు. ఇద్దరు యువతులు తంజావూరులోని పోలీసు క్వార్టర్స్‌లో ఒకే పోర్షన్‌లో ఉంటున్నారు. వీరిలో ఓ యువతి ప్రేమలోపడి ప్రియుడితో రాత్రివేళల్లో ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడేది. ఈ ప్రేమ వ్యవహారం వివాహితకు తెలుసు. ఇదిలాఉండగా యువతి బాత్‌రూముకు వెళ్లిన సమయంలో ప్రియుడి నుంచి ఫోన్‌ రావడంతో వివాహిత ఫోన్‌తీసుకుని అతడితో మాట కలిపింది. క్రమేణా వీరిద్దరి మధ్య ఫోన్‌లో సాన్నిహిత్యం పెరిగిపోగా గంటలకొద్ది మాట్లాడుకునే వారు. తన సమీప బంధువు, తమ్ముని వరస అని వివాహిత తోటి యువతికి అబద్ధం చెప్పింది.

ఇదిలాఉండగా ప్రియుడు తనకు ఫోన్‌ చేయకపోవడం, తాను చేసినా తీయకపోవడంతో యువతి ఆలోచనలో పడిపోయింది. ప్రియుడిలో ఎందుకంత మార్పు వచ్చిందో తెలియక అల్లాడిపోయింది. వివాహిత యువతి లేని సమయంలో ఆమె సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను యథాలాపంగా చూసిన యువతి అది తన ప్రియుడి నంబరు నుంచి వచ్చినట్టు గ్రహించింది. తరువాత అతని కాల్‌డేటాను పరిశీలించగా వారం పది రోజులుగా వీరిద్దరే మాట్లాడుకుంటున్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయింది. పెళ్లయి భర్త ఉన్న నీకు ఇదేంపని అంటూ గురువారం రాత్రి వివాహితను నిలదీసింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోగా కలియబడి కొట్టుకున్నారు. ఈ శబ్దాలు విని ఇతర క్వార్టర్లలోని పోలీసు కుటుంబాలు వచ్చి వారిని అడ్డుకున్నారు.  వివాహిత దాడిలో యువతి గాయపడింది. నీ చేష్టలపై పోలీసు ఉన్నతాధికారులకు, భర్తకు చెబుతానని యువతి బెదిరించడంతో భయపడిన వివాహిత పురుగుల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇరుగుపొరుగు వారు ఆమెను ప్రాణాపాయస్థితిలో తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేయకుండా విచారణ జరుపుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top