కోడలు దోచిన కాపురం

women Committed Robbery With His Brother At Husband House In   - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : పెళ్లయిన నెల రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి తరచూ పుట్టింటికి వెళ్లొస్తున్న భార్య.. భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. దానికి ముందే అత్తింటిని దోచేయడానికి కుటుంబీకులతో కలిసి పథకం వేసింది. పక్కా ప్లాన్‌ ప్రకారం అత్తారింటి నుంచి రూ.80 లక్షల విలువ చేసే సొత్తు ఎత్తుకుపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోడలితో పాటు ఆమె తల్లిదండ్రులు, అన్నను అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. 

ఉత్తర మండల డీసీపీ కల్వేశ్వర్‌ సింగెన్వర్‌తో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఓల్డ్‌ బోయిన్‌పల్లి మల్లికార్జున కాలనీకి చెందిన తాండూరి సరళ భర్త చనిపోయిన నాటి నుంచి వారి వడ్డీ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తోంది. సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు ధీరజ్‌ వివాహం నాలుగు నెలల క్రితం కామారెడ్డిలోని రామారెడ్డి చౌరస్తాకు చెందిన వ్యాపారి కొల్లూరి శ్రీనివాస్‌ కుమార్తె సుప్రియతో జరిపించింది. వివాహమైన నాటి నుంచి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. దీంతో సుప్రియ ప్రతి రెండు రోజులకు ఒకసారి పుట్టింటికి వెళ్లి వస్తుండేది.

భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నెల రోజుల క్రితమే నిర్ణయించుకుంది. బంగారు నగలు, వెండి వస్తువులపై అమితమైన మక్కువ చూపే తన అత్త ఇంట్లో భారీగా సొత్తు ఉంటుందనే విషయం సుప్రియకు తెలుసు. దీంతో విడాకులు తీసుకునేలోపే వాటిని సొంతం చేసుకోవడానికి అత్తారింట్లోనే చోరీ చేయాలని భావించింది. ఈ విషయం తన అన్న సాత్విక్‌కు చెప్పడంతో అతడూ అంగీకరించి జతకట్టాడు. వీరికి తమ తల్లిదండ్రులు శ్రీనివాస్, సునీత సైతం వత్తాసు పలికి సహకరించడానికి ముందుకొచ్చారు.  

డూప్లికేట్‌ తాళాలతో...  
దాదాపు నెల రోజుల క్రితమే అత్తారింట్లో చోరీకి ప్లాన్‌ వేసిన సుప్రియ తొలుత వారి ఇల్లు, బీరువాల తాళం చెవులు ఉండే గుత్తిని దాచేసింది. అది పోయిందని భర్త, అత్తతో చెప్పింది. అదను చూసుకొని వాటికి డూప్లికేట్‌ తాళాలు తయారు చేయించింది. ఆపై తాళం చెవుల గుత్తి దొరికిందంటూ తిరిగి ఇచ్చేసింది. సరళ ప్రతిరోజూ మధ్యాహ్నం తన కుమారుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొని బాపూజీనగర్‌ వరకు వెళ్లి అక్కడ ఆఫీస్‌ క్యాబ్‌ ఎక్కించి వస్తుంటుంది.

ఇది తెలిసిన సుప్రియ ఆ సమయంలోనే చోరీ చేద్దామని, ఆధారాలు దొరక్కుండా గ్లౌజ్‌లు, మాస్క్‌లు ధరిద్దామని పుట్టింటి వారితో చెప్పింది. దీపావళి నాటికి ఇంటికి సీసీ కెమెరాలు బిగించాలని సరళ నిర్ణయించింది. దీంతో ఆ లోపే తమ ‘పని’ పూర్తి చేయాలనే ఉద్దేశంతో గత సోమవారం (ఈ నెల 21న) సుప్రియ, సాత్విక్, శ్రీనివాస్, సునీతలు తమ కారులో కామారెడ్డి నుంచి మలికార్జున కాలనీకి చేరుకున్నారు. ఇంటికి కాస్త దూరంలో కారును ఆపారు. అక్కడికి సమీపంలో ఉన్న మలుపు వద్ద ఆగిపోయిన శ్రీనివాస్‌ తన వియ్యపురాలు వస్తోందేమో అనేది గమనించే పనిలో పడ్డాడు. సునీత కారు వద్దే ఉండి పరిసరాలను గమనిస్తూ గడిపింది. సుప్రియ, సాత్విక్‌ మాత్రం సరళ ఇంటి వద్దకు వెళ్లారు.

తమ వద్ద ఉన్న నకిలీ తాళం చెవుల్ని వినియోగించి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా, అల్మారాలు తెరిచి వాటిలో ఉన్న 2 కిలోల బంగారు ఆభరణాలు, ఆరున్నర కేజీల వెండి వస్తువులు తస్కరించారు. ఆపై నలుగురూ కలిసి సొత్తుతో సహా కామారెడ్డి చేరుకున్నారు. బయటకు వెళ్లిన దాదాపు మూడు గంటల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన సరళ తన ఇంట్లో చోరీ జరిగిన విషయం గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి మూడు కేజీల బంగారం, రూ.18 లక్షల నగదు, వెండి వస్తువులు పోయాయంటూ ఫిర్యాదు చేశారు. రెండు బ్రీఫ్‌కేసులు, ఓ బ్యాగ్‌లో ఉన్న వీటిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయినట్లు పేర్కొన్నారు. ఇంట్లోని అన్ని ప్రాంతాల్లో వెతకగా కొంత బంగారం, నగదు దొరకడంతో రెండు కేజీల బంగారం, 6.5 కేజీల వెండి పోయినట్లు తేల్చారు. దీనిపై బోయిన్‌పల్లి ఠాణాలో నమోదైన కేసును తిరుమలగిరి ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రవణ్‌కుమార్, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ పి.చంద్రశేఖర్‌లతో కూడిన బృందం దర్యాప్తు చేసింది.  

ఇలా ఛేదించారు...  
ప్రాథమిక ఆధారాలతో పాటు ఇల్లు, బీరువా తాళాలు పగులగొట్టక పోవడాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంటి దొంగల పనిగా అనుమానించారు. ఇంట్లో గ్లౌజ్‌కు చెందిన చిన్న ముక్క లభించడం, సీసీ కెమెరాల్లో స్కార్ఫ్‌ ధరించిన ఇద్దరు ఇంటి వైపు రావడం గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సరళ కుమారుడు, కోడలి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. సుప్రియతో పాటు ఆమె కుటుంబంపై అనుమానాలు వచ్చాయి.

వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించడంతో పాటు ఇంట్లో దాచి ఉంచిన బంగారం, వెండి వస్తువుల్ని అప్పగించారు. తాము అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకు చిక్కమని భావించామని, అందుకే అంత ధైర్యంగా దొంగతనం చేశామని నిందితులు వెల్లడించారు. వీరి నుంచి పోలీసులు నేరం చేయడానికి వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top